సోలో లైఫ్‌..  సోషల్‌ మీడియా | Impact of screen and social media use on mental health | Sakshi
Sakshi News home page

సోలో లైఫ్‌..  సోషల్‌ మీడియా

Apr 4 2026 3:41 AM | Updated on Apr 4 2026 3:41 AM

Impact of screen and social media use on mental health

మనసు క(వ్య)థలు

ఉదయం లేస్తూనే సోషల్‌మీడియా వాకిట్లో పక్షుల్లా వాలిపోతుంటారు. రీల్స్, రివైవల్, కబుర్లు, మెసేజ్‌లు, ఫొటోలు, వీడియోలు.. వయసు తేడా లేకుండా ఆన్‌లైన్‌ వేదికగానే  ఎన్నో విశేషాలను పంచుకుంటూ, పెంచుకుంటూ ఉంటారు. అదే సమయంలో సోషల్‌ మీడియా ద్వారా డంప్‌ అయ్యే ఎన్నో మానసిక సమస్యలనూ నెత్తిన మోస్తున్నారు. ‘ప్రపంచం అంతా ‘పర్‌ఫెక్ట్‌’గా ఉందన్న భ్రమతో  తమను తాను హింసించుకునేవారి శాతం  ఇటీవల పెరుగుతోంది..’ అంటున్నారు నిపుణులు.

వైజాగ్‌ వాసి పదిహేడేళ్ల అనన్య భోజనం తినడం తగ్గించడం మొదలుపెట్టింది. ఈ సమస్య ఎంతగా అంటే ఒకరోజు ఆమెను బలవంతంగా హాస్పిటల్‌లో చేర్చి, సెలైన్‌ పెట్టించాల్సి వచ్చింది. సోషల్‌ మీడియా ప్రభావంతో ఆమె తన శరీరం గురించి ఎక్కువగా ఆలోచిస్తుండేది. తినమని తల్లి ఒత్తిడి చేస్తే ‘లైక్స్‌ రావడం లేదంటే అర్థం, నేను బాగా లేనట్టేగా..’ అని గట్టిగట్టిగా అరుస్తోంది.. అని అనన్య తల్లి ఆవేదన చెందుతోంది.. 
∙∙ 
ఉద్యోగంలో బిజీగా ఉండే మాధవి రిలాక్స్‌ కావడానికి సోషల్‌మీడియా ఒక మార్గంగా మారింది. మొదట్లో ఫ్రెండ్స్‌తో కనెక్ట్‌ అవడానికి ఆ తర్వాత ఫొటోలు షేర్‌ చేసేది. ఆ పోస్టులకు లైక్స్, కామెంట్స్‌ పెరుగుతుండటంతో తరచు చెక్‌ చేసుకోవడం ఒక అలవాటుగా మారింది. ఒకట్రెండుసార్లు ఆమె పెట్టిన ఫొటోకు తక్కువ లైక్స్‌ రావడంతో నిరాశ మొదలైంది. ‘అందరూ నన్ను ఇగ్నోర్‌ చేస్తున్నారు, ఎందుకో’ అనుకోవడం మొదలుపెట్టింది. ఇతరుల ఫొటోలు చూసి, తనను తాను పోల్చుకుంటుంది. ‘వారితో పోల్చితే, అంత అందంగా లేను. అందుకే లైక్స్‌ రావడం లేదు’ అనే భావన పెరిగింది. పనిమీద దృష్టి తగ్గింది. దీంతో ఆందోళన పెరగడం, ఆత్మవిశ్వాసం తగ్గడం వంటి సమస్యలు మొదలయ్యాయి. 

కనిపించని ఒత్తిడులు
ఇప్పటికాలంలో సోషల్‌ మీడియా మహిళల జీవితంలో ఒక ముఖ్యమైన భాగంగా మారింది. కానీ అదే సమయంలో ఇది మానసిక ఆరోగ్యంపై గణనీయమైన ప్రభావం చూపిస్తోంది. బయటికి కనిపించేది ఫొటోలు, వీడియోలు, లైక్స్, కామెంట్స్‌ మాత్రమే. కానీ అంతరంగంలో జరిగే మానసిక ఒత్తిడి వేరుగా ఉంటోంది. అందం, ఆనందం, ఆర్థిక విషయాలు, తన చుట్టూ ఏమీ బాగోలేదనే ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు.

ప్రధాన సమస్యలు
ఇతరులతో పోల్చుకోవడం. ఇతరులు అందంగా, ఆనందంగా ఉన్న ఫొటోలు, రీల్స్‌.. చూసి వారి జీవితం వడ్డించిన విస్తరి అనే భావనకు లోనవుతున్నారు. అదే సమయంలో తమ జీవితం ఎంత నిస్సారంగా ఉందో అంచనా వేసుకుంటున్నారు. దీంతో మిగతావారికంటే తమ జీవితం చాలా తక్కువ అనే భావనకు లోనవుతున్నారు.  
→ ఫొటోలు, వీడియోలకు వాడే ఫిల్టర్లు, ఎడిటింగ్, ఏఐ.. వంటి వాటి వల్ల అంచనాలు పెరుగుతున్నాయి. నిజానిజాలు అర్ధం చేసుకోలేకపోతున్నారు.
→ తమపై తమకు ఆత్మవిశ్వాసం లోపిస్తోంది. కుటుంబంపైనా ఈ ప్రభావం పడుతోంది.
→ లైక్స్, కామెంట్స్‌ ద్వారా ఆనందం  పొందడం అలవాటై, తక్కువ రెస్పాన్స్‌ వస్తే ‘బాధ’కు లోనవుతున్నారు. 
→ ట్రోలింగ్, నెగటివ్‌  కామెంట్స్‌ వల్ల డిప్రెషన్, భయాందోళనకు లోనవుతున్నారు. 
→ ఇతరుల ఆనందం చూసి ‘నేను ఏదో మిస్‌ అవుతున్నాను’ అనుకుంటున్నారు.  
→ అతి ఎక్కువగా స్క్రీన్‌ టైమ్‌లో గడపడం వల్ల మానసిక అలసటకు లోనవుతున్నారు.  
→ సోషల్‌ మీడియా అంటే రెండువైపులా పదును ఉన్న కత్తి లాంటిది. సరైన విధంగా వాడితే సమాచారం, ప్రపంచంతో కనెక్టివిటీ ఇస్తుంది. కానీ నియంత్రణ లేకుండా వాడితే మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది.

నియంత్రణ తప్పనిసరి
→ రోజుకు ఒక పరిమితి పెట్టుకోవాలి.
→ సోషల్‌ మీడియాలో కనిపించేది పూర్తి నిజం కాదని గుర్తుంచుకోవాలి.
→ వారానికి ఒక రోజు సోషల్‌ మీడియా నుంచి పూర్తి బ్రేక్‌ తీసుకోవడం మంచిది.
→ ప్రేరణ, ఉత్సాహం, అవగాహన కలిగించే కంటెంట్‌ను ఫాలో అవడం మంచిది. 
→ మన విలువలను లైక్స్‌తో కాకుండా మనసుతో కొలవాలి. కుటుంబం, స్నేహితులతో రోజువారీ అంశాలపై చర్చ, మాట్లాడం.. వంటివి చేస్తుంటే సోషల్‌ మీడియా ఒత్తిడి నుంచి దూరం అవ్వచ్చు. 
 

సోషల్‌ మీడియా అనేది ఒక వర్చువల్‌ ప్రపంచం. అక్కడ మనం చూస్తున్నది పూర్తినిజం కాదు. కానీ, మన మెదడు దాన్ని నిజం అనేలా స్వీకరిస్తుంది. అదే సమస్యకు మూలం అవుతుంది. పాజిటివ్‌గా వచ్చే లైక్స్, కామెంట్స్‌ వల్ల మన బ్రెయిన్‌లో డోపమైన్‌ అనే ‘ఫీల్‌గుడ్‌’ హార్మోన్స్‌ రిలీజ్‌ అవుతాయి. దీంతో ఇది ఒక అలవాటుగా మారుతుంది. ఫోన్‌ను పదే పదే చెక్‌ చేయడం, సోషల్‌ మీడియా లేకపోతే అసహనం, నిద్రలేమి, పనిమీద దృష్టి తగ్గడం.. వంటి సమస్యలన్నీ తలెత్తుతాయి. రోజులో కొంత సమయమే సోషల్‌ మీడియా ఉపయోగించడం, అభి రుచులు, వ్యాయామం, కుటుంబంతో సరైన టైమ్‌ గడపడం వంటివాటి వైపు మనసును మళ్లించగలిగితే సరైన జీవన ఆనందాన్ని  పొందగలరు. సమస్యను నియంత్రించుకోలేకపోతే నిపుణులను సంప్రదించి, వారి సూచనలు పాటించడం మేలు చేస్తుంది.

– పి.జ్యోతిరాజ, సైకాలజిస్ట్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement