స్త్రీ శక్తి.. మరో అడుగు

Historical Wonders of Feminism and Power - Sakshi

సెంట్రల్‌ రిజర్వ్‌ పోలిస్‌ ఫోర్స్‌(సీఆర్పీఎఫ్‌) స్త్రీసాధికారత, శక్తియుక్తులకు సంబంధించి మూడు చారిత్రక అద్భుతాలకు వేదిక అయింది.

కొన్ని నెలలు వెనక్కి వెళితే...
నక్సల్స్‌ను ఎదుర్కోవడం కోసం ఏర్పాటు చేసిన ‘కోబ్రా కమాండో’లో మహిళల ప్రాతినిధ్యం లేదు. అయితే 34 మంది మహిళలతో ‘కోబ్రా’ దళాన్ని ఏర్పాటు చేసి మహిళలు లేని లోటును పూరించారు. ‘కోబ్రా’కు ఎంపికైన వారియర్స్‌ మూడు నెలల పాటు అడవుల్లో కఠినమైన శిక్షణ తీసుకున్నారు. గుర్‌గ్రామ్‌ కదార్‌పుర్‌లో కోబ్రా వుమెన్‌ వారియర్స్‌ ప్రదర్శించిన యుద్ధవిన్యాసాలు అబ్బురపరిచాయి.

వారి మాటల్లోని ఆత్మవిశ్వాసం ఆకట్టుకుంది. శిక్షణ పూర్తి చేసుకున్నవారికి అభినందనలు తెలియజేస్తూ ‘హిస్టరీ ఇన్‌ మేకింగ్‌’ అని ట్విట్‌ చేసింది సీఆర్పీఎఫ్‌. 2012లో వరల్డ్స్‌ ఫస్ట్‌ ‘ఆల్‌– ఉమెన్‌ పారామిలటరీ పైప్‌బ్యాండ్‌’ను ఏర్పాటు చేసింది సీఆర్‌పీఎఫ్‌.

ఇక తాజా విషయానికి వస్తే...
సీఆర్పీఎఫ్‌ జడ్‌–ప్లస్‌ కేటగిరి కోసం విధులు నిర్వహించడానికి ఎంపికైన 32 మంది ఉమెన్‌ వారియర్స్‌ వివిధ విభాగాల్లో పదివారాల పాటు శిక్షణ పొందారు. ఈ నెలలోనే కొత్త బాధ్యతల్లోకి వెళ్లనున్నారు.

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా, కాంగ్రెస్‌ నాయకులు సోనియా గాంధీ, ప్రియాంకా గాంధీ వాద్రా, మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌... మొదలైన వారికి రక్షణగా నిలవనున్నారు. రాబోయే అయిదు రాష్ట్రాల ఎన్నికల్లో వీఐపీ రాజకీయ నాయకుల రక్షణ బాధ్యతల్లో పాలుపంచుకోనున్నారు. గతంలో జడ్‌–ప్లస్‌ కమాండో విభాగంలో పురుషులు మాత్రమే ఉండేవారు. తాజా అడుగుతో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టింది సీఆర్పీఎఫ్‌.
 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top