
తల్లిదండ్రులను వదిలించుకున్న కుమారులు
ఆలయంలో తలదాచుకుంటున్న వైనం
న్యాయం చేయాలని ఆర్డీఓకు వినతి
మణికొండ: జీవిత చమరాంకంలో అండగా ఉంటారనుకున్న కుమారులు రోడ్డు పాలు చేశారు..కూతురైన కరుణించకపోతుందా అనుకుంటే ఆమె సైతం సోదరులతోనే చేతులు కలిపింది. వారందరూ కలిసి ఇంటిని అమ్మేసి తల్లిదండ్రులను బయటకు గెంటేశారు. ఈ ఘటన నార్సింగి మున్సిపాలిటీ కేంద్రంలో వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. రంగుల కొమరయ్య, లక్ష్మమ్మకు ఇద్దరు కుమారులు, కూతురు ఉన్నారు. కొమరయ్య రంగులు వేసే పనిచేసి నార్సింగిలో 150 గజాల్లో ఇంటిని నిర్మించుకుని పిల్లలను పెంచి పెద్ద చేసి వారందరికీ వివాహాలు చేశారు.

అయితే ఇంటిని కుమారులు, కూతురు కలిసి ఇటీవల రూ.60 లక్షలకు అమ్మేసి ముగ్గురు రూ. 20 లక్షల చొప్పున పంచుకున్నారు. తర్వాత తల్లిదండ్రులను భారంగా భావించి ఇంట్లో నుంచి గెంటేశారు. దీంతో దిక్కుతోచని స్థితిలో గ్రామంలోని లక్ష్మమ్మ ఆలయ ఆవరణలో నివసిస్తున్నారు. కుమారులు, కూతురు స్థానికంగానే ఉన్నా వారికి అన్నం పెట్టడం లేదు. దాంతో వారం రోజులుగా ఆలయం చుట్టు పక్కల వారి ఇళ్లకు వెళ్లి అడుక్కు తింటున్నారు.
ఆర్డీఓకు ఫిర్యాదు..
స్థానిక మాజీ కౌన్సిలర్ ఉషారాణి, మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ లక్ష్మీబాయితో కలిసి కొమరయ్య రాజేంద్రనగర్ ఆర్డీఓ వెంకట్‌రెడ్డికి మంగళవారం ఫిర్యాదు చేశారు. తనకు వచ్చే రూ. 2వేల పింఛన్ రూ.5 వేలు అవుతుందని, సంతకం పెట్టాలని తీసుకెళ్లి తనను మోసం చేశారని కొమరయ్య ఆర్డీఓతో రోధిస్త చెప్పాడు. తన ఇంటిని తిరిగి ఇప్పించాలని, తమను ఆదుకోవాలని కోరారు.