రక్త'నాలా'ల్లో పూడికలు.. తీసివేతలు | Heart Bypass Surgery: Purpose Procedure Risks Recovery | Sakshi
Sakshi News home page

రక్త'నాలా'ల్లో పూడికలు.. తీసివేతలు

Nov 26 2024 9:52 AM | Updated on Nov 26 2024 10:04 AM

Heart Bypass Surgery: Purpose Procedure Risks Recovery

చాలామంది వాడుకలో బైపాస్‌ ఆపరేషన్‌ అనే మాట నలుగుతుంటుంది. కానీ దాని అసలు అర్థం ఏమిటి, అందులో ఏం చేస్తారు, బైపాస్‌ శస్త్రచికిత్స అయినవాళ్లు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి వంటి విషయాలను తెలుసుకుందాం. 

గుండెకు రక్తాన్ని తీసుకెళ్లే కీలకమైన ధమనుల్లో అడ్డంకులు ఏర్పడినప్పుడు,  వాటిని తొలగించి రక్తసరఫరా సాఫీగా జరడానికి వీలుకల్పించేందుకు చేసే శస్త్రచికిత్సను  ‘సీఏబీజీ సర్జరీ’ అంటారు. ఇందులో... అప్పటికే రక్తపు క్లాట్స్‌ ఏర్పడ్డ ధమనులను వదిలేసి, ఇతర రక్తనాళాల ద్వారా అంటే... బైపాస్‌ చేసిన మార్గం ద్వారా గుండెకండరానికి రక్తం అందేలా చేస్తారు. 

ఇలా రక్తం బైపాస్‌ మార్గంలో వెళ్లడానికి  కృత్రిమంగా రక్తనాళాలను గ్రాఫ్టింగ్‌ చేస్తారు కాబట్టి వైద్యపరిభాషలో దాన్ని  ‘కరొనరీ ఆర్టరీ బై΄ాస్‌ గ్రాఫ్టింగ్‌’ అంటారు. దానికి సంక్షిప్త రూపమే ఈ సీఏబీజీ . దీన్నే సాధారణ వాడుక భాషలో ‘బైపాస్‌ సర్జరీ’ అని వ్యవహరిస్తుంటారు. 

గ్రాఫ్టింగ్‌ కోసం ఉపయోగించే ఆ రక్తనాళాలను కాళ్లు లేదా చేతుల్లో ఉన్నవాటిని తీసి, క్లాట్స్‌ అడ్డంకులుగా ఏర్పడ్డ రక్తనాళాలకు ప్రత్యామ్నాయంగా అమర్చుతారు. అలా అమర్చిన రక్తనాళాల ద్వారా గుండె కండరానికి అందాల్సిన రక్తాన్ని బైపాస్‌ అయ్యేలా చేస్తారు. గుండె వద్ద ఉన్న రక్తనాళాన్ని నేరుగా బైపాస్‌ చేసే ప్రక్రియను రీ–వాస్క్యులరైజేషన్‌ అంటారు. 

సాధారణంగా ఒక బ్లాక్‌ (అడ్డంకి)ని బైపాస్‌ చేయడానికి ఒక రక్తనాళం అవసరం. ఛాతీకీ కుడి, ఎడమ వైపున ఉన్న రక్తనాళాలను ఇంటర్నల్‌ మ్యామరీ ఆర్టరీస్‌  అంటారు. గుండెకు ఎడమవైపున ఉన్న నాళాన్ని లెఫ్ట్‌ యాంటీరియర్‌ డిసెండింగ్‌ ఆర్టరీ అని అంటారు. ఈ రక్తనాళాన్ని బ్లాక్‌ అయిన నాళాల వద్ద బైపాస్‌ మార్గంలా కలుపుతారు. 

బైపాస్‌ సర్జరీ చేయించుకున్న తర్వాత, భవిష్యత్తులో ఇలా మార్చిన రక్తనాళాల్లోనూ కొవ్వు పేరుకోకుండా హృద్రోగులు కొన్ని జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియలో రక్తనాళాల్లో పేరుకున్న బ్లాక్స్‌ను అధిగమించి, రక్తాన్ని గుండెకు చేరవేసేందుకు వీలుగానే కొన్ని రక్తనాళాలు ఏర్పరుస్తారు తప్ప ఈ శస్త్రచికిత్స వల్ల  అప్పటికే ఉన్న గుండెజబ్బు తొలగిపోయిందని పేషెంట్‌ అ΄ోహ పడకూడదు. 

అందుకే కొత్తగా వేసిన రక్తనాళాలూ మళ్లీ బ్లాక్‌ అయి΄ోయి పరిస్థితి పునరావృతమయ్యే అవకాశం ఉన్నందున బాధితులు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అవేమిటంటే... బాధితులకు హైబీపీ ఉన్నట్లయితే రక్త΄ోటును ఎల్లప్పుడూ అదుపులో ఉంచుకునేలా డాక్టర్‌ సూచించిన మందులు క్రమం తప్పకుండా తీసుకోవాలి. 

అలాగే బాధితుల్లో డయాబెటిస్‌ ఉంటే, రక్తంలోని చక్కెర మోతాదులను అదుపులో ఉంచుకునేందుకు అవసరమైన మందులు వాడుతూ, కొవ్వులు తక్కువగా ఉండే పోషకాహారం తీసుకోవాలి. ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించాలి.  పొగతాగడం,  మద్యం అలవాట్లు  ఉంటే దాన్ని తక్షణం పూర్తిగా మానేయాలి. డాక్టర్లు సూచించిన మేరకు శరీరానికి మరీ ఎక్కువ శ్రమ కలిగించని విధంగా తగిన వ్యాయామాలు చేస్తూ ఉండాలి.
డా‘‘ జి. వెంకటేశ్‌ బాబు, సీనియర్‌ కన్సలెంట్‌, ప్లాస్టిక్‌ సర్జన్‌ 

(చదవండి: దుస్తుల నుంచి కర్రీ వాసనలు రాకూడదంటే..!)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement