వేసవిలో పిల్లలు హెల్దీగా ఉండాలంటే..! | Health Tips: Summer Tips for Kids: How to Keep Kids Cool and Safe | Sakshi
Sakshi News home page

వేసవిలో పిల్లలు హెల్దీగా ఉండాలంటే..!

Apr 14 2026 5:38 PM | Updated on Apr 14 2026 5:49 PM

Health Tips: Summer Tips for Kids: How to Keep Kids Cool and Safe

అనాదిగా వేసవికీ బాల్యానికీ ఎనలేని సంబంధం ఉంది. పైగా పులి మీద పుట్రలా వేసవి సెలవులొకటి. తామూ ఒకప్పటి పిల్లలే అయినా తమ బాల్యాన్ని మరచిపోయి ఎండలో ఆడవద్దంటూ పిల్లలను గదమాయిస్తుంటారు పెద్దలు. కానీ... సూర్యుణ్ణి కంపాస్‌ బాక్స్‌లో ఉంచేసి, అది సరిపోనట్టు మళ్లీ దాన్ని స్కూల్‌ బ్యాగ్‌లో పెట్టిజిప్పు లాగేసినట్టుగా ఎండను లెక్కచేయకుండా పిల్లలంతా ఆడేస్తుంటారు. తరాలు గడుస్తున్నా ఇదో ఎప్పటికీ ఎడతెగని చైన్‌ రియాక్షన్‌. ఈ నేపథ్యంలో పిల్లలను వేసవి తీవ్రతతో వచ్చే ప్రమాదాలూ; తినిపించాల్సినవీ, తాగించాల్సినవీ, దూరం ఉంచాల్సినవీ అయిన ఆహారపదార్థాలూ; ఎండ నుంచి రక్షించుకోడానికి అనుసరించాల్సిన సూచనల వంటి అనేక అంశాలను తెలిపే కథనమిది.

అప్పటివరకూ ఆరుబయట హాయిగా ఒళ్లెరగకుండా ఆడుతున్న చిన్నారి ఒళ్లు వెచ్చబడుతుంది. అకస్మాత్తుగా అమ్మాయి మేను నిప్పులు చెరుగుతోందేమో అనిపిస్తుంది. తల్లీదండ్రీ నుదురు తాకి చూసి, తటాలుమని చేయి వెనక్కు లాగేసుకుంటారు ఆ ఒంటి వేడి తట్టుకోలేక. ఇది దాదాపు ప్రతి చిన్నారి బాల్యంలో ఒక్కసారైనా ఎదుర్కొనే సంఘటన. ఇది ప్రతి తల్లిదండ్రుల జీవితంలో ఒక్కసారైనా చవిచూసే కాళరాత్రి. ఇలాంటి వేసవి తీవ్రత బారి నుంచి చిన్నపిల్లలను కాపాడుకోడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలేమిటో చూద్దాం.

పిల్లలపై ఎండ దుష్ప్రభావం ఎందుకు ఎక్కువ? 
ఎండవేడిమి తీవ్రతకు పెద్దలూ, పిల్లలూ, వృద్ధులనే తేడా లేక΄ోయినప్పటికీ పెద్దలతో  పోలిస్తే పిల్లల మీదే వేసవి ప్రతాపం ఎక్కువగా చూపిస్తుంటుంది. దీనికి కారణం ఉంది. పిల్లలంతా ఎండల్లో విపరీతంగా ఆటలాడుతూ ఉంటారు కాబట్టి పెద్దల కంటే వాళ్లకు చెమటలు పట్టడమూ, దాంతో వాళ్లు లవణాలు ఎక్కువగా కోల్పోతుండటం వల్ల ఎండతీవ్రతకు గురవుతుంటారనేది కొందరి అపోహ. కానీ అది వాస్తవం కాదు. విషయం ఏమిటంటే... పెద్దలతో పోలిస్తే పిల్లల్లో చెమట గ్రంథులు తక్కువ. 

అందుకే చెమటలు పట్టడం పెద్దవారిలోనే ఎక్కువ. అయితే పిల్లల చర్మంపైన వేసవి తీవ్రతను చల్లబరిచేందుకు అవసరమైన ప్రక్రియ... చెమట పట్టడమనేది తక్కువ. దాంతో ఎండ వేడిమి పిల్లలపై ఎక్కువ దుష్ప్రభావం చూపుతుంది. అందుకే పిల్లలెప్పుడూ చల్లగా ఉండే నీడపట్టునే ఉండేలా చూడాలి. ఎండా, వడగాడ్పులు తగ్గాకే వాళ్లను ఆరుబయటకు వెళ్లనివ్వాలి.

ఎండ తీవ్రతతో ఎదుర్కొనే ఇబ్బందులివే...
మజిల్‌ క్రాంప్స్‌ : పిల్లలెప్పుడూ ఎండను లెక్క చేయక ఆడుతూ ఉంటారు. ఇక సెలవుల్లో అయితే ఆటలే ఆటలు. దాంతో వారి దేహంలోని నీరు డీ–హైడ్రేషన్‌ కారణంగా బయటకు వెళ్లడమూ, ఆ నీటితో పాటు లవణాలూ తగ్గడం వల్ల... ఆ లవణాల అయాన్ల రూపంలో మెదడునుంచి కండరాలకు వచ్చే ఆదేశాలకు బ్రేక్‌ పడుతుంది. 

అందుకే ఒళ్లు డీ–హైడ్రేషన్‌కు గురి కాగానే... కండరాలు బిగుసుకు΄ోతుంటాయి. వీటినే మజిల్‌క్రాంప్స్‌ అంటారు. ఈ మజిల్‌క్రాంప్స్‌ పిల్లలతో పాటు పెద్దలకూ వస్తుంటాయి. ఇలా జరిగిన వెంటనే... వారికి చిటికెడు ఉప్పు, కాస్తంత చక్కెర వేసిన నీటిని వెంటనే తాగించాలి. కోల్పోయిన లవణాలను తిరిగి భర్తీ చేయడం వల్ల ఈ సమస్యను తేలిగ్గానే ఎదుర్కోవచ్చు.

వడదెబ్బ : మనలో జీవక్రియలన్నీ సరిగా జరగడానికి దేహ ఉష్ణోగ్రత ఎప్పుడూ 98.4 డిగ్రీల ఫారెన్‌హీట్‌గా ఉంటుంది. అయితే వడదెబ్బకు గురైనవారి దేహ ఉష్ణోగ్రత చాలా ఎక్కువగా పెరుగుతుంది. దాంతో దేహంలో కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. వడదెబ్బ కారణంగా దేహ ఉష్ణోగ్రత క్రమంగా పెరుగుతూ ప్రమాదకరస్థాయి అయిన 104 డిగ్రీ ఫారెన్‌హీట్‌కు చేరినప్పుడు ఆ వేడి దగ్గర మెదడు, గుండె, మూత్రపిండాలు, కాలేయం వంటి కీలకమైన అవయవాల పనితీరు తీవ్రంగా దెబ్బతినే అవకాశాలెక్కువ. అందుకే శరీర ఉష్ణోగ్రతను మళ్లీ నార్మల్‌కు తీసుకురావడం అవసరం.

ఒంటి ఉష్ణోగ్రత 100 డిగ్రీల ఫారెన్‌హీట్‌ దాటుతోందని తెలియగానే పిల్లలను చల్లటి గాలి సోకేలా ఫ్యాన్‌ కింద ఉంచాలి. (ఒకవేళ ఫ్యాన్‌ కింద వేడిగాలి వస్తుంటే అలాంటి చోటకు తీసుకెళ్లినా లాభం ఉండదు. చిన్నారుల దుస్తులు వదులు చేసి, ఒంటికి చల్లగాలిని బాగా తగలనివ్వాలి. ఈ జాగ్రత్తల తర్వాత కూడా శరీర ఉష్ణోగ్రత తగ్గకపోతే పిల్లల చంకల కింద / గజ్జల వద్ద ఐస్‌ గడ్డలను ఉంచాలి. దాంతో ఒళ్లు చల్లబడుతుంది. అప్పటికీ శరీర ఉష్ణోగ్రత తగ్గకపోతే, దాన్ని మెడికల్‌ ఎమర్జెన్సీగా గుర్తించి వెంటనే ఆసుపత్రికి తరలించాలి.

వేసవిలో కొన్ని ఆహారాల పట్ల అపోహలు

గుడ్డు : గుడ్లు తినడం వల్ల అవి వేడి చేస్తాయనే అ΄ోహ చాలామందిలో ఉంటుంది. అందుకే వేసవిలో గుడ్లను తినడానికీ, పిల్లలకు ఎక్కువగా ఇవ్వడానికి వెనకాడుతుంటారు. నిజానికి ఇది పూర్తిగా అ΄ోహ మాత్రమే. గుడ్లలో దాదాపు 75% నీళ్లే ఉంటాయి. పైగా ఇందులో ఖనిజలవణాలూ అన్నీ ఎక్కువే. అందుకే ఇవి చలవ చేయడంతో ΄ాటు ఒంటి నుంచి చెమట రూపంలో కోల్పోయే నీటినీ భర్తీ చేస్తాయి. అంతేకాదు... ఇందులోని లవణాల కారణంగా మజిల్‌క్రాంప్స్‌ వంటి సమస్యలూ నివారితమవుతాయి.

పాలు : వేసవిలో పాలకు బదులుగా... పెరుగునూ... ఇక పెరుగుకు బదులుగా దాన్ని చిలికి మజ్జిగ రూపంలో తీసుకోవడమే మేలని చాలామంది అనుకుంటారు. నిజానికి వేసవిలో మజ్జిగ వాడటం చాలా మంచిదే అనడంలో సందేహం లేదు. అంతమాత్రాన వేసవిలో పాలు అంత మంచివి కావని అనుకోవడం ఓ దురభి్ర΄ాయం మాత్రమే. నిజానికి పాలలోనూ 90 శాతానికి పైగా ఉండేది నీళ్లే. ఈ నీటి మోతాదులతోసాటు దేహానికి శ్రమ కలగడం వల్ల కోల్పోయే ఖనిజలవణాలూ ఉంటాయి. అంటే పాలు తాగడం అంటే ఏకకాలంలో నీటినీ, ఖనిజలవణాలనూ భర్తీ చేయడం లాంటిది. అందుకే మధ్యమధ్యలో మజ్జిగ తాగిస్తున్నప్పటికీ... వేసవిలో చిన్నారులకు ప్రతి ఉదయం, రాత్రి వేళల్లో పాలు తాగిస్తుండటమూ మంచిదే.

సూప్‌లు : వేసవిలో పిల్లలు ఆరుబయట ఎండల్లో చాలా ఎక్కువగా ఆడుకుంటూ ఉంటారు. దాంతో వారు చాలా వేగంగా నీళ్లనూ, లవణాలను కోల్పోతుంటారు. పైగా ఈ సీజన్‌లో ఘనాహారం తీసుకోవడం ఒకింత కష్టంగా ఉంటుంది. అందుకే పిల్లలు కోల్పోయే లవణాలను సూప్‌లూ, జావ రూపంలో తీసుకోవడం వల్ల అవి చాలా వేగంగా వారి దేహానికి అందుతుంటాయి.

వెజిటబుల్‌ సూప్స్‌ : అన్ని రకాల సూప్‌లలోనూ దాదాపు 98 శాతం నీళ్లే ఉంటాయి. ఇక మిగతావి సూప్‌లలో ఉపయోగించే ఆకుకూరలు, కాయగూర (వెజిటబుల్స్‌)ల్లోంచి సూప్‌లోకి లవణాలు బాగా ఊరి, తేలిగ్గా ఒంటపడతాయి. అందుకే వేసవిలో అన్ని రకాల సూప్‌లు తీసుకోవడం మేలు చేసే అంశమే. టోమాటో, మొక్కజొన్న, దోసకాయ, ఆలూ (బంగాళదుంప), చిలగడదుంప (మోరంగడ్డ / గెణుసుగడ్డ), గ్రీన్‌పీస్, జ్యూషీనీ, అవకాడో, బీట్‌రూట్, పుదీనా, కొత్తిమీర, బ్రాకలీ, పుట్టగొడుగులు (మష్‌రూమ్స్‌)... ఇలా దాదాపు అన్ని రకాల ఆకుకూరలు/కాయగూరలతో సూప్‌లు తయారుచేసుకోవచ్చు. వేసవిలో ఈ సూపులన్నీ చిన్నారులకు ఖనిజలవణాలను చాలా వేగంగా ఒంటికి సమకూరేలా చేస్తాయి.

పిల్లలకు జావ రూపంలో ఇచ్చేవి...
జావ రూపంలోనూ లేదా పలచటి ఉప్మా (పారిజ్‌) రూపంలో రెసిపీలను తీసుకోవడం వల్ల ఒంటికి నీళ్లూ, లవణాలూ తక్షణం సమకూరతాయి. జావరూపంలో తీసుకునేందుకు రాగులు మేలైన ఆహారం. అందుకే వీటిల్లో రాగిజావ చాలా ఫేమస్‌. జావ/పారిజ్‌ రూపంలో తీసుకునేందుకు నూకలూ మంచివే. ఆర్గానిక్‌గా పండించిన పట్టుతీయని వరినూక, గోధమనూక చాలా మేలు చేస్తాయి. వీటిలో పీచుపదార్థాలు ఎక్కువగా ఉండటం వల్ల పిల్లలకు ఇవి తేలిగ్గా జీర్ణం అవుతాయి. దాంతో వేసవిలో ఒళ్లు చాలా తేలిగ్గా ఉంటుంది. అన్నట్టు పెద్దలకూ, వృద్ధులకూ మంచివే.

రకరకాల పానీయాలు...
అన్నిటికంటే ముఖ్యమైనది నీరు దాహాన్ని తీర్చడానికి మంచినీటికి మించిన పానియం మరొకటి లేదు. ఎండలో ఇంటికి వచ్చినప్పుడు ఒక్క గ్లాసుడు నీరు తీసుకుంటే ప్రాణం లేచివచ్చినట్టు అవుతుంది. మంచినీరు ఎక్కువగా తాగుతూంటే డీ హ్రైడ్రేషన్‌కు దూరంగా ఉండవచ్చు. ఇక నీటి తర్వాత ఇవ్వదగ్గ పానియాలివి...

నిమ్మ : పిల్లలు వేసవిలో పానియాలను తాగేందుకు బాగా ఇష్టపడతారు. సాధారణంగా వేసవిలో నిమ్మకాయరసాన్ని తీసుకొని అందులో కొద్దిగా పంచదార వేసి చేసుకునే పానియం చాలా త్వరగా తయారవుతుంది. చాలా చవగ్గా కూడా. 

బత్తాయి : బత్తాయిరసం, ఆరెంజ్‌ జ్యూస్‌ వంటివి పిల్లలు ఇష్టంగా తాగుతారు. 

సర్సపారిల్లా : ఇది భూమి కింద పెరిగే ఒక రకం వేరు. దీన్నే చాలా చోట్ల వేర్వేరు పేర్లతో పిలుస్తుంటారు. కొందరు సుగంధ అనీ, మరికొందరు మారేడు అనీ, నన్నారి అని దీన్ని పిలుస్తారు. దీని వేర్లతో ఎసెన్స్‌లో లేదా ఆ వేర్ల పౌడర్‌లో నీళ్లు లేదా సోడా కలపాలి. 

ఒక టీస్పూన్‌ నిమ్మరసం, కాస్తంత చక్కెరతో చాలా పరిమళభరితమైన వేసవి పానీయం తయారవుతుంది. ఇది చలవచేస్తుందీ, ఆరోగ్యానికీ మేలూ చేస్తుంది. ఇవీ కాకుండా ఈ వేసవిలో మామిడిపండ్లు ఎక్కువగా దొరుకుతుంటాయి. దాంతో ఆమ్‌పన్నా అనే సీజనల్‌ డ్రింక్‌ను తయారు చేసుకోవచ్చు. 

ఇవేకాకుండా... ఖస్‌ షర్బత్, ద్రాక్షాజ్యూస్, వెలగపండు షర్బత్, రోజ్‌ షర్బత్‌లూ మంచివి. ఇక వేసవిలో చెరుకురసాన్ని తాగడానికి చాలామంది ఉవ్విళ్లూరుతుంటారు. అయితే ఇందులో కల్తీనీళ్లనుంచి తయారు చేసే ఐస్‌ కలవడమనే అంశం ఆరోగ్యాన్ని దెబ్బతీసే అవకాశమున్నందున... ఐస్‌ కలపకుండా తాగడమే మేలు.

తీసుకోదగ్గ ఇతర పండ్లు, సలాడ్స్‌...
పుచ్చకాయ...లో 80 శాతం కంటే ఎక్కువ నీరే ఉండటంతో డీహైడ్రేషన్‌ రాకుండా కాపాడుతుంది. వెజిటబుల్‌ చీజ్‌ సలాడ్స్‌... తక్కువ క్యాలరీలున్న చీజ్‌ను తరిగిన అనేక రకాల కూరలతో కలపటం వల్ల క్యాల్షియం, ప్రోటీన్ల పరిమాణాన్ని పెంచవచ్చు.

కొవ్వులు తక్కువగా ఉండే పానీయాలు... పిల్లలు చల్లగా, తియ్యగా ఉండే కూల్‌డ్రింక్స్, సోడా, ఐస్‌క్రీమ్‌లను ఇష్టపడుతుంటారు. వీటికి బదులుగా మజ్జిగ, లస్సీ వంటివి ఇవ్వడం మంచిది. పండ్లతో తయారయిన డెజర్ట్స్‌... వేసవిలో ఆరోగ్యాన్నిచ్చే పండ్లతో తయారుచేసిన డెజర్ట్స్‌ని తీసుకోవడమే మంచిది. ఇవి  ప్రోటీన్లు, క్యాల్షియంలను అందిస్తాయి. 

బెర్రీలు (స్ట్రాబెర్రీలు)... వేసవిలో ఈ బెర్రీ పళ్లను తినటం మంచిది. వీటిని పెరుగులోనూ, ఐస్‌క్రీంలాంటి వాటిలోనూ వాడవచ్చు. 

కుకుంబర్‌... పిల్లలు పెద్దగా ఇష్టంగా తిననప్పటికీ దోస వంటివి సహజంగానే చల్లగా ఉండి చలువ చేస్తాయి. అందుకే చల్లని తాజా దోసకాయ ముక్కలను సలాడ్స్‌లోనూ, కూరలలోనూ వాడుతూ పిల్లలకు ఇవ్వడం మంచిది. 

మామిడి... ఇవి వేసవిలోనే దొరుకుతాయి.  ఇందులో బీటా కెరొటిన్, విటమిన్‌ సి, ఫైబర్లు ఉంటాయి. 
వాల్‌నట్స్‌...  ఆక్రోట్ల (వాల్‌నట్‌)లో ఉండే ఒమేగా – 3 ఫ్యాటీయాసిడ్లు గుండె ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడతాయి.

చేపలు... వేసవిలో వేటమాంసం కంటే చేపలు మంచి ఆహారం. అయితే వేయించిన చేపల కంటె ఉడకబెట్టిన లేదా గ్రిల్డ్‌ చేపలు ఇవ్వడం మేలు. 

ఎరుపు, ఆరంజ్, పసుపు రంగులలో ఉన్న కూరగాయలు... గుమ్మడి, బంగాళదుంప, చిలగడదుంప, బెల్‌పెప్పర్‌... వంటివాటిలో ఎ విటమిన్, సి విటమిన్, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. 

పాల ఉత్పత్తులు... లస్సీ, మజ్జిగ, ఫ్లేవర్డ్‌ మిల్క్, ఫ్రూట్‌ మిల్క్‌ షేక్‌లు (మ్యాంగో మిల్క్‌ షేక్‌) వంటివి పిల్లల శరీరానికి అవసరమయిన శక్తిని, ప్రోటీన్లను, క్యాల్షియమ్‌ను, ఫ్లూయిడ్లను అందిస్తాయి. 

పనీర్‌... ఇందులో ప్రోటీన్లు, క్యాల్షియం అధికంగా ఉంటాయి. గ్రిల్‌డ్‌ వెజిటబుల్స్‌ను పనీర్‌తో కలిపి ఇవ్వవచ్చు. లేదా పనీర్‌ రోల్స్‌ కూడా ఇవ్వవచ్చు. పిల్లల ఎదుగుదలకూ, ఎముకల పటిష్టతకు బాగా తోడ్పడతాయి.

ఇంట్లో తయారుచేసిన ఐస్‌క్రీమ్‌లు, ఫ్రూట్‌ కస్టర్డ్స్, పుడింగ్స్, స్మూతీస్, ఐస్‌ గోల్స్‌... వంటివి పిల్లలకి పెట్టవచ్చు.  

ఎండ తాలూకు దుష్ప్రభావాల నివారణ ఇలా... 

ఎండవేళలల్లో పిల్లలు ఎండకు వెళ్లకుండా ఇంట్లోని చల్లటి జాగాల్లో ఆడుకునేలా ప్రోత్సహించాలి.

ఎండవేళల్లో ఇన్‌డోర్‌ గేమ్స్‌కు మాత్రమే వారిని పరిమితం చేయాలి. 

ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు వారిని ఇంట్లోనే ఉండేలా చూడాలి. 

పిల్లలు నీడలో ఉన్నా... ఒకవేళ ఆ నీడ ఉన్న గది ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటే నీడపట్టున ఉన్న పిల్లలకూ వడదెబ్బ తగలవచ్చు. అందుకే పిల్లలను ఒకింత చల్లగా ఉండే ప్రదేశంలోనే ఉంచాలి. 

ఆటల్లో పూర్తిగా నిమగ్నమైనొయిన పిల్లలు తరచూ మంచినీళ్లు తాగకపోవచ్చు. అందుకే తరచూ వారిని పిలుస్తూ కాస్త కాస్త మంచినీళ్లు పట్టిస్తూ ఉండాలి. ఓఆర్‌ఎస్‌ అందుబాటు లేక... ఒకవేళ కొబ్బరినీళ్లు అందుబాటులో ఉంటే అవి కూడా తాగించవచ్చు.

కొన్ని జాగ్రత్తలు ఇవి... 
పిల్లలకు పల్చటి దుస్తులు వేయాలి. మందపాటి దుస్తులు తొడగకూడదు. ∙గొడుగు వాడటం మేలే అయినప్పటికీ పిల్లలు గొడుగువాడటాన్ని పెద్దగా ఇష్టపడరు. అందుకే పిల్లలకు నేరుగా ఎండ తగలకుండా క్యాప్‌ తొడిగిస్తుండాలి. పిల్లలకు వాడే క్యాప్‌ల కలర్‌ లేత రంగుల్లో ఉండటం మేలు. పిల్లలు ఆటల్లో పడి నీళ్లు తాగడం విస్మరిస్తుంటారు. అలా ఆడుతున్నప్పుడు వాళ్లకు గంటా, గంటన్నర వ్యవధిలో మాటిమాటికీ నీళ్లు తాగిస్తూ ఉండాలి.

బయటకు వెళ్లే ముందే కనీసం రెండు మూడు గ్లాసుల మంచినీటిని తాగించాలి. ఎప్పుడూ వాటర్‌ బాటిల్‌ వెంట ఉంచుకునేలా ప్రోత్సహించాలి. నీళ్లను ప్లాస్టిక్‌ సీసాల్లో ఉంచడం అంత సరికాదు. బాటిల్‌ వేడెక్కి అందులోని నీళ్లు వేడెక్కడం వల్ల ప్లాస్టిక్‌ పదార్థాల నుంచి కొద్దికొద్ది మోతాదుల్లో ప్లాస్టిక్‌ వెలువడి నీటితోపాటు శరీరంలోకి వెళ్లే అవకాశాలెక్కువ. ఇలా ప్లాస్టిక్‌ అవశేషాలు శరీరంలోకి ఇంకిపోవడాన్ని ‘లీచింగ్‌’ అంటారు. దీనివల్ల ఆరోగ్యానికి ఎన్నో విధాల నష్టం చేకూరుతుంది. 

అందుకే ప్లాస్టిక్‌ బాటిల్‌కు బదులు మంచి గాజు బాటిల్‌ లేదా అంత త్వరగా వేడెక్కనివ్వని ఫ్లాస్క్‌లు, వాటర్‌బాటిల్స్‌నే మొదటినుంచీ పిల్లలకు అలవాటు చేయాలి. ∙ఆరుబయట తిరుగుతున్నప్పటికీ వారు చెట్టు నీడలాంటి దట్టమైన నీడ ఉండే ప్రదేశాలలోనే ఆడుకునేలా చూడటం మంచిది. ∙బయటకు అనుమతించడం అనేది ఉదయం 10 గంటలకు ముందూ... సాయంత్రం 5 తర్వాతనే జరిగేలా చూడాలి. ఎందుకంటే ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు ఎండ వల్ల ఆరుబయట రేడియేషన్‌ ప్రమాదం ఎక్కువగా ఉండి పిల్లల లేత శరీరాలకు నష్టం చేస్తుంది. 

పిల్లలు తప్పనిసరిగా ఎండకు వెళ్లాల్సి వచ్చినప్పుడు ఎండ నుంచి చర్మాన్ని కాపాడుకోడానికి కనీస సన్‌ ప్రొటెక్షన్‌ ఫ్యాక్టర్‌ 20 లేదా అంతకంటే ఎక్కువ ఉన్న ‘సన్‌ స్క్రీన్‌ లోషన్స్‌ / క్రీమ్స్‌’ను ఎండలోకి వెళ్లే కనీసం 20 నిమిషాల ముందర పిల్లల చర్మంపై రాయాలి. ఎండలో ఎక్కువసేపు ఉండాల్సి వస్తుంటే ప్రతి మూడు గంటలకోమారు మళ్లీ ఒకసారి ఈ క్రీమ్‌ రాస్తుండాలి. 

పిల్లలను కారులో ఉంచి షాపింగ్‌ చేయడం ప్రమాదకరం. అలా ఎప్పుడూ ఆగి ఉన్న కారులో పిల్లలను ఉంచి లాక్‌ చేయకూడదని తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాలి. 

పిల్లలకు ఇవ్వకూడనివి... 
దాహాన్ని పెంచడం, డీ–హైడ్రేషన్‌ కలిగించే గుణం ఉన్నందున వేసవిలో ఉప్పును సాధ్యమైనంత తక్కువగా తగ్గించాలి. అయితే నిమ్మ వంటి షర్బత్‌లలో చిటికెడు వేసుకోవచ్చు. పరిమితంగా తీసుకునే ఉప్పు మజిల్‌క్రాంప్స్‌ను తగ్గిస్తుంది. ఈ సీజన్‌లో కొవ్వులు ఎక్కువగా ఉండే ఆహారాన్ని సాధ్యమైనంతగా తగ్గించాలి. 

అలాగే ఆయిల్స్‌ కూడా వీలైనంతగా తగ్గించాలి. కాఫీ, టీ, కూల్‌డ్రింక్స్‌లో కెఫిన్‌ మోతాదులు ఎక్కువ. వాటిని పిల్లలకు ఇవ్వడం సరికాదు. ప్రాసెస్‌ చేసిన మాంసం, కేకులు, బిస్కెట్ల వంటి వాటికి దూరంగా ఉంచాలి. వాటికి బదులు తాజా పండ్లముక్కలూ, ఫ్రూట్‌సలాడ్స్‌ వంటివి ఇవ్వవచ్చు. 
డాక్టర్‌ కంచన్‌ ఎస్‌ చన్నావర్‌కన్సల్టెంట్‌ పీడియాట్రీషియన్, పీడియాట్రిక్‌ ఇంటెన్సివిస్ట్‌
నిర్వహణ: యాసీన్‌ 

(చదవండి: World Art Day: చిన్న పెన్సిల్ కూడా గొప్ప కథను చెప్పగలదు..!)

Advertisement
 
Advertisement
Advertisement