దానివల్ల నాకు కానీ, నా బిడ్డకు కానీ ఏదైనా ఇబ్బంది ఉంటుందా?

Gynecologist and Obstetrician Dr Bhavana Kasu Health Suggestions - Sakshi

సందేహం 

►నాకిప్పుడు ఎనిదవ నెల. బిడ్డ ఎదురు కాళ్లతో ఉందని స్కానింగ్‌లో తేలింది. దీనివల్ల నాకు నార్మల్‌ డెలివరీ అయ్యే అవకాశం లేదంటారా?
– నిరుపమ, కదిరి

చాలా మంది గర్భిణీల్లో ఎదురు కాళ్లతో బిడ్డ ఉండడం చూస్తాం. అయితే తొమ్మిదవ నెలలో అంటే 36– 37వ వారానికీ బిడ్డ అదే పొజిషన్‌లో ఉంటే అప్పుడు చర్చించాలి. బిడ్డ కదలికలు ఎక్కువగా ఉన్నప్పుడు స్కానింగ్‌లో పొజిషన్‌ మారుతుంది. ప్రసవమప్పుడు అంటే తొమ్మిదవ నెల నిండినప్పుడు కూడా బిడ్డ ఎదురుకాళ్లతో ఉంటే అప్పుడు ప్రసవం కష్టమవుతుంది. అలా 36–37వ వారంలో కూడా  బిడ్డ ఎదురుకాళ్లతో ఉంటే  మీ డాక్టర్‌ చెక్‌ చేసి కొన్ని పరీక్షలు చేసి,  ECV (ఎక్స్‌టర్నల్‌ సెఫాలిక్‌ వెర్షన్‌) అనే ప్రక్రియ ద్వారా బిడ్డ తల కిందకు వచ్చేటట్టు చేయగలుగుతారు. అలా చేయలేని పక్షంలో సిజేరియన్‌ చేయడమే మేలు. కొంత మంది గర్భిణీల్లో 36– 37వ వారం వచ్చేసరికి బిడ్డ తనంతట తానే హెడ్‌ పొజిషన్‌కు మారుతుంది. అప్పుడు నార్మల్‌ డెలివరీ చేయొచ్చు.

వందలో ముగ్గురికి మాత్రమే 36–37వ వారానికి కూడా బిడ్డ ఎదురు కాళ్లతోనే ఉండిపోయి హెడ్‌ పొజిషన్‌కు రాదు. బిడ్డ ఎదురుకాళ్లతో ఉండడానికి చాలా కారణాలు ఉంటాయి. ప్లెసెంటా కిందకు ఉన్నప్పుడు, ఉమ్మనీరు ఎక్కువగా ఉన్నప్పుడు, కవలలు ఉన్నప్పుడు, తొలి చూలులో గర్భసంచిలో ఓ అడ్డుగోడలాంటిది ఏర్పడినప్పుడు బిడ్డ ఎదురు కాళ్లతో ఉండే స్థితి చూస్తాం. బిడ్డ ఎదురు కాళ్లతో ఉన్నప్పుడు నార్మల్‌ డెలివరీ కోసం ప్రయత్నించడం వల్ల ఇటు తల్లికి, అటు బిడ్డకూ రిస్కే. ప్రసవమప్పుడు బిడ్డకు ఆక్సిజన్‌ సరిగ్గా అందకపోవడం, తల బయటకు రావడంలో సమస్య ఎదురవడం, నొప్పులతో ఎక్కువ సేపు కష్టపడ్డం, అత్యవసరంగా సిజేరియన్‌ చేయాల్సి రావడం జరుగుతాయి. అందుకే తొమ్మిదవ నెల చివరిలో కూడా బిడ్డ ఎదురు కాళ్లతోనే ఉంటే సిజేరియన్‌ గురించి డాక్టర్‌.. పేషెంట్‌తో చర్చిస్తారు. 

►నాకిప్పుడు ఎనిమిదవ నెల. ఒళ్లంతా దురదలు. మందులు వాడినా తగ్గడం లేదు. ఇది పొట్టలో బిడ్డ మీదేమైనా ప్రభావం చూపుతుందా?
– శ్రీలక్ష్మి పెండ్యాల, వరంగల్‌

గర్భంతో ఉన్నప్పుడు చాలామందికి ఒంటి మీద దురద వస్తుంది. ఇది నెలలు నిండే కొద్దీ చర్మం సాగడం వల్ల, వేడి వల్ల కూడా వస్తుంది. కొన్ని రకాల మాయిశ్చరైజర్‌ క్రీమ్స్‌తో ఇది తగ్గుతుంది. కానీ వందలో ఒకరికి అబ్‌స్టెట్రిక్‌ కొలెస్టాసిస్‌ అనే కండిషన్‌ ఉన్నప్పుడు ఎన్ని క్రీములు రాసినా దురద తగ్గదు. గర్భంతో ఉన్నప్పుడు కాలేయం ప్రభావితమై శరీరంలోకి బైల్‌ యాసిడ్స్‌ విడుదలవుతాయి. అందువల్ల దురద వస్తుంది. ఇది ప్రసవం తర్వాత తగ్గిపోతుంది. చాలా సందర్భాల్లో దీనికి కారణం తెలియదు. ఈస్ట్రోజన్‌ హార్మోన్‌ ఎక్కువ అవటం, జన్యు కారణాలూ కావచ్చు. ఇది తర్వాత ప్రెగ్నెన్సీలో కూడా రావచ్చు. చాలామందికి 28 వారాలు (ఏడవ నెల)లో వస్తుంది.

అరి చేతులు, అరి కాళ్లు, పొట్ట మీద ఎక్కువ దురద వస్తుంది. దద్దుర్లు ఉండవు. రాత్రివేళ ఎక్కువవుతుంది. దీనితో కొంతమందికి జాండీస్‌ రావచ్చు. ఆకలి తగ్గిపోతుంది. నీరసంగా ఉంటారు. ఇలాంటి పరిస్థితుల్లో పొట్టలో బిడ్డకు కొంచెం రిస్క్‌ తలెత్తొచ్చు. బైల్‌ యాసిడ్స్‌ ఎక్కువ అవడంతో పొట్టలో బిడ్డ మల విసర్జన చేయడం, నెలలు నిండకుండా ప్రసవమవడం, ఊపిరాడకపోవడం వంటివి సంభవిస్తాయి. అందుకే దురద తగ్గకపోతే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి. లివర్‌ ఫంక్షన్‌ టెస్ట్, బైల్‌ యాసిడ్స్‌ టెస్ట్‌ చేసి.. సరైన వైద్యం అందించే అవకాశం ఉంటుంది. దీనికి ప్రత్యేకమైన మందులు ఉంటాయి. గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్‌ను సంప్రదించి తగిన మందులు వాడితే దురద తగ్గుతుంది. 

►నాకిప్పుడు అయిదవ నెల. ఆస్తమా ఉంది. ఇన్‌హేలర్స్‌ వాడాల్సి వస్తోంది. దీని వల్ల నాకు కానీ, నా బిడ్డకు కానీ ఏదైనా ఇబ్బంది ఉంటుందా?
– టి. అనూష, నిర్మల్‌

ఆస్తమా ఉన్నవాళ్లకు ప్రెగ్నెన్సీలో కొంతమందికి ఏ విధమయిన ఇబ్బందీ ఉండదు. మూడింట ఒకింత మందికి మాత్రం ఆస్తమా ఎక్కవై ఆసుపత్రిలో చేర్పించాల్సి వస్తుంది. ప్రెగ్నెన్సీలో ఉండే ఎసిడిటీ వల్ల ఆస్తమా ఎక్కువ ఇబ్బంది పెట్టవచ్చు. ఆస్తమా ట్రీట్‌మెంట్‌ ప్రెగ్నెన్సీలో ఆపకూడదు. మీ డాక్టర్‌ పర్యవేక్షణలో ప్రెగ్నెన్సీలో సేఫ్‌గా ఉండే మందులు, ఇన్‌హేలర్స్‌ కొనసాగించాలి. ఆస్తమా నియంత్రణలో ఉంటే మీకు, బేబీకి ఏ సమస్యా రాదు. అకస్మాత్తుగా మందులు ఆపేస్తే మీకు ఆస్తమా అటాక్‌ కావచ్చు. బిడ్డ కూడా తక్కువ బరువుతో అంటే లో బర్త్‌ వెయిట్‌తో పుడుతుంది.

అందుకే మందులు ఆపకుండా కొనసాగించాలి డాక్టర్‌ పర్యవేక్షణలో. మందులతో పాటు ఈ జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. పోషకాహారం తీసుకోవాలి. ప్రతిరోజూ వ్యాయామం చేయాలి. ఎలర్జీ వచ్చే ఆహారం, దుమ్ము, ధూళికి దూరంగా ఉండాలి. జ్వరం, దగ్గు, జలుబుకి వెంటనే చికిత్స తీసుకోవాలి. అవసరమైతే స్టెరాయిడ్‌ ఇన్‌హేలర్‌ కూడా వాడాలి. ఆస్తమా ఉన్నా నార్మల్‌ డెలివరీకి  ప్రయత్నించొచ్చు. ఇన్‌హేలర్‌ తీసుకుంటున్నా బిడ్డకు తల్లి పాలు పట్టొచ్చు. మీకు రాత్రి పూట ఆయాసం ఎక్కువ అయినా, ఇన్‌హేలర్‌ ఎక్కువసార్లు వాడవలసి వచ్చినా, ఊపిరాడకపోవడం వంటి సమస్య ఉన్నా వెంటనే ఎమర్జెన్సీ వార్డ్‌ని సంప్రదించాలి. 

డా‘‘ భావన కాసు
గైనకాలజిస్ట్‌ – ఆబ్‌స్టెట్రీషియన్‌
హైదరాబాద్‌

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top