'చైతన్య'పథం! థర్మకోల్‌తో గ్రీన్‌ ఇన్నోవేషన్‌.. | Sakshi
Sakshi News home page

'చైతన్య'పథం! థర్మకోల్‌తో గ్రీన్‌ ఇన్నోవేషన్‌..

Published Fri, Dec 22 2023 12:22 PM

Green Innovation with Thermocol :Chaitanya Dubey - Sakshi

'వేడుకలు, స్కూల్‌ ప్రాజెక్ట్‌లు, ప్యాకింగ్‌ అవసరాలు.. మొదలైన వాటి కోసం థర్మోకోల్‌ను ఉపయోగిస్తుంటాం. స్టోర్‌రూమ్‌లలో వాడేసిన థర్మోకోల్‌లు కుప్పలుగా పడి ఉంటాయి. మన అవసరం మేరకు తప్ప వాటి గురించి అంతగా ఆలోచించం. కొత్త విషయాలు తెలుసుకుంటే ఏమొస్తుంది? కొత్తగా ఆలోచిస్తాం. కొత్తగా ఆలోచిస్తే ఏమొస్తుంది? కొత్తదారులు కనిపిస్తాయి. కొత్త ఆవిష్కరణలు జరుగుతాయి. చైతన్య దూబే కొత్తదారులలో ప్రయాణిస్తున్నాడు. సంప్రదాయ థర్మోకోల్‌కు భిన్నంగా బయోడిగ్రేడబుల్‌ థర్మోకోల్‌ తయారు చేసి ప్రపంచ దృష్టిని ఆకర్షించాడు.'

థర్మోకోల్‌ నాన్‌–బయోడిగ్రేడబుల్‌..
పర్యావరణంపై వాటి ప్రభావం ఎంత‌గానో ఉంది. థర్మోకోల్‌కు సూర్యరశ్మి తగిలి హానికరమైన వాయు కాలుష్య కారకాలు ఉత్పత్తి అవుతాయి, థర్మోకోల్‌ కాల్చడం వల్ల విషపూరిత రసాయన సమ్మేళనాలు విడుదల అవుతాయి. దీని ప్రభావంతో కంటి, ఊపిరితిత్తులకు సంబంధించి సమస్యలు తలెత్తుతాయి. ఇలాంటి విషయాలు తెలుసుకున్న చైతన్య ప్రత్యామ్నాయాన్ని గురించి ఆలోచించి విజయం సాధించాడు.

ఉత్తర్‌ప్రదేశ్‌లోని కాన్పూర్‌లో పుట్టి పెరిగిన చైతన్య బెంగళూరులో ఇంజనీరింగ్‌ చేశాడు. ఎంబీఏ చేసిన తరువాత బెంగళూరులోని ఏదైనా కంపెనీలో ఉద్యోగం చేయాలనుకున్నాడు. అయితే చిన్న బిజినెస్‌ కోర్స్‌ ఒకటి చేయడంతో అతడి ఆలోచనల్లో మార్పు వచ్చింది. ఉద్యోగం కాదు బిజినెస్‌ చేయాలి అనుకున్నాడు. ఆ కోర్స్‌ తన గమనాన్నే మార్చింది. కెరీర్‌కు సంబంధించి ఎన్నో అవకాశాలను పరిచయం చేసింది. పుట్టగొడుగుల పెంపకంపై ఆసక్తి పెరిగింది.

ఔషధ పుట్టగొడుగుల పెంపకం మొదలుపెట్టాడు..
రకరకాల పుట్టగొడుగుల గురించి తెలుసుకునే క్రమంలో పుట్టగొడుగుల నుంచి లెదర్‌ తయారుచేసే కాన్సెప్ట్‌ చైతన్యను ఆకట్టుకుంది. ‘ఇలాంటిదే కొత్తగా ఏదైనా చేయవచ్చా’ అని ఆలోచించి పరిశోధనలు మొదలుపెట్టాడు. పరిశోధనలో భాగంగా ఐఐటీ–కాన్పూర్‌ వెళ్లి ప్రొఫెసర్‌లతో మాట్లాడాడు. పుట్టగొడుగులను ఉపయోగించి పర్యావరణానికి హాని కలిగించని వస్తువులను తయారుచేయాలనే ఆలోచనలో భాగంగా రూపొదించిందే సరికొత్త థర్మోకోల్‌.

  • పుట్టగొడుగులతో పాటు సహజమైన పదార్థాలతో బయోడిగ్రేడబుల్‌ థర్మోకోల్‌ను తయారుచేశాడు. ఇది 60 నుంచి 90 రోజుల్లో కుళ్లిపోవడం మొదలవుతుంది. దీన్ని మొక్కలకు సహజ ఎరువుగా ఉపయోగించవచ్చు.
  • ఈ థర్మోకోల్‌ తయారీకి అయిదు నుంచి ఏడు రోజులు పడుతుంది. ‘మీ అవసరాలకు ఉపయోగించుకున్న తరువాత క్రష్‌ చేయండి. ఇది మొక్కలకు సహజ ఎరువుగా పనిచేస్తుంది’ అంటున్నాడు చైతన్య.
  • ఎప్పుడూ ఏదో ఒక కొత్త విషయం గురించి తెలుసుకోవడం, దాని గురించి లోతుగా ఆలోచించడం అంటే చైతన్యకు ఇష్టం. 29 సంవత్సరాల చైతన్య దూబే బయోటెక్‌ కంపెనీ ‘కినోకో బయోటెక్‌’ ప్రారంభించి ఎంటర్‌ప్రెన్యూర్‌గా మారాడు.
  • బయోడిగ్రేడబుల్‌ థర్మోకోల్‌ దగ్గరే ఆగిపోలేదు చైతన్య దూబే. పుట్టగొడుగుల ద్వారా విగ్రహాల తయారీకి ఉపయోగపడే పదార్థం గురించి పరిశోధనలు చేస్తున్నాడు. ప్లాస్టర్‌ ఆఫ్‌ పారిస్‌(పీవోపి)కి ప్రత్యామ్నాయాన్ని కనిపెట్టే ప్రయత్నంలో ఉన్నాడు.
    ఇవి కూడా చ‌ద‌వండి: భగవద్గీత: విజయవంతమైన జీవనానికి దివ్యౌషధం

Advertisement
Advertisement