అలా చేయవచ్చా... అది అవమానం కదూ !!!

Good Books reads on community development - Sakshi

గురువాణి

మన దేశం కష్టాల్లో ఉన్నప్పుడు సనాతన ధర్మానికి పూర్వ వైభవం తీసుకురావడంలో ఎనలేని కృషి చేసిన సమర్ధ రామదాసు గారు చెప్పిన మరో సూత్రం – జ్ఞాన సముపార్జన, ప్రచారం. ఇంట్లో మంచి మంచి చిత్తరువులు, మంచి పరుపులు, మంచి మంచాలు, కుర్చీలు, ఇతర అలంకార సామాగ్రి ఎలా ఉంచుకుంటామో... ప్రతి ఇంటా కూడా చదవదగిన పుస్తకాలు కొన్ని ఉండి తీరాలి. చదివిన పుస్తకాల మీద చర్చ కూడా జరుగుతుండాలి.

ఇంటి పెద్ద ఒక మంచి పుస్తకం చదివి దానిలో తనకు నచ్చిన అంశాలు ఏ పేజీల్లో ఉన్నాయో ఆ పుస్తకం ముందుండే తెల్లకాగితంపై రాసి ఉంచాలి. పిల్లలు ఆ పుస్తకం తెరిచినప్పుడల్లా వాటిని చదివి పుస్తకంపట్ల ఆసక్తి పెంచుకుంటారు. చదివిన పుస్తకంపై కుటుంబ సభ్యులతో చర్చిస్తూండాలి. అప్పడు తీరికసమయాల్లో వాటిని చదవడానికి అందరికీ ప్రేరణ కలుగుతుంది. నిజానికి ఇంటి సంపద వృద్ధిలోకి రావాలన్నా, ఇంటి గౌరవం ఆచంద్రార్కం కొనసాగాలన్నా.. ఆ ఇంటి యజమాని ఎన్ని పుస్తకాలు చదివి, ఎన్ని పుస్తకాలగురించి అలా రాసి భద్రపరిచి ఉంచాడన్నది ముఖ్యం. అదే వారికి నిజమైన ఆస్తి. అదే తరువాత తరాలవారిలో స్ఫూర్తి రగిలిస్తుంది, వారినీ ఉత్తములుగా తీర్చిదిద్దుతుంది. పుస్తకాలు కొనడం పెద్ద కష్టమేమీ కాదు, పుస్తకాలు భద్రపరచడం భారం కూడా కాదు. ‘మా ఇంట్లో పుస్తకాలు చదివేవారు లేరండీ.. అని ఇచ్చేయడం ఆ కుటుంబానికి చాలా అవమానకరమైన విషయం.

చదివే వాళ్ళు లేకపోవడమేమిటి! చదివేవాళ్ళు ఉండాలి. ప్రతివాళ్లూ పుస్తకాలు ఒక నియమంగా చదవాలి. ప్రతిరోజూ మనం ఎదుర్కొనే ఎన్నో సమస్యలనుంచి బయటపడడానికి అవి ఎంతగానో ఉపయోగ పడతాయి. అవి మనకు మనశ్శాంతినిస్తాయి. ఒక్క ఆధ్యాత్మిక పుస్తకాలే కాదు... మన జీవితాలను, మన పిల్లల జీవితాలను ఉద్ధరించడానికి ఇది పనికొస్తుంది–అని అనుకున్న ప్రతి పుస్తకం ఆ ఇంట తప్పనిసరిగా ఉండాలి. పుస్తకాలు లేని జ్ఞానాన్ని ఇస్తాయి, ఉన్న జ్ఞానాన్ని అనేక రెట్లు పెంచుతాయి. ఆ జ్ఞానాన్ని పదిమందితో పంచుకున్నప్పుడు అది మరింత పెరుగుతుందే కానీ తరిగేది కూడా కాదు.

అందరూ వేదికలెక్కి ఉపన్యాసాలు ఇవ్వక్కర్లేదు. కానీ కుటుంబ సభ్యులతో, ఇంటికొచ్చిన అతిథులతో, ఆత్మీయులతో జరిపే సమావేశాల్లో, విందులు, వినోదాల్లో కలిసిన సన్నిహితులతో వారు చదివిన మంచి పుస్తకాలపై చర్చ పెట్టాలి. అలాగే పిల్లలున్న ఇంటికి వెళ్ళినప్పుడు, ఇతరత్రా శుభకార్యాల్లో, దూరప్రయాణాలు వెళ్ళేవారికి మంచి మంచి పుస్తకాలు బహూకరించడం అలవాటు చేసుకోవాలి. వీలయితే ఆ పుస్తకాల ప్రాధాన్యతను, వాటిని ఎందుకు బహూకరిస్తున్నది వాటిపై రాసి సంతకం చేసి ఇస్తే... వారితో మీ బంధం మరింత గట్టిపడుతుంది. మీపట్ల వారికి, వారి కుటుంబానికి ఎనలేని గౌరవం ఏర్పడుతుంది.

వారు కూడా వాటిని చదివి ఎంత ప్రభావితమవుతారో, ఎంత శాంతి పొందుతారో మాటల్లో చెప్పలేం. సమర్ధ రామదాసుగారి లాగా గురుస్థానాల్లో ఉన్న వారు ఇటువంటి విషయాలను ప్రబోధం చేయాలి, ప్రచారం చేయాలి... సమాజ అభ్యున్నతికి ఇది అవసరం.     
 
బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top