ఓ పాట వందల ప్రాణాలు తీసింది.. నేటికీ మిస్టరీనే..

Gloomy Sunday Strange Tale Of Hungarian Suicide Song - Sakshi

మాటల్లో చెప్పలేని భావాన్ని కూడా పాటలోని రాగం స్పష్టంగా పలికి స్తుంది. మనసుల్ని సుతారంగా మీటుతూ భావోద్వేగాలను స్పృశిస్తుంది. అలాంటి ఓ పాట వందల మంది ప్రాణాలు తీసేసింది. హంగేరీ పోలీసులకు ముచ్చెమటలు పట్టించిన ‘హంగేరియన్‌ సూసైడ్‌ సాంగ్‌’ చరిత్ర నేటికీ ఓ మిస్టరీనే.


                                                            స్మైల్‌ క్లబ్స్‌ 

1933.. అప్పుడప్పుడే పలు దేశాలు మొదటి ప్రపంచ యుద్ధం మిగిల్చిన విషాదం నుంచి తేరుకుంటున్నాయి. అప్పటికే ఎందరో సైనికుల్ని కోల్పోయిన హంగేరీ రాజధాని బుడాపెస్ట్‌ ప్రజలను  మాత్రం మరో విషాదం ఏడిపించింది. ఏమైందో ఏమో.. ఉన్నట్టుండి ఆత్మహత్యలు చేసుకోవడం మొదలుపెట్టారు జనం. ఏదో మైకం కమ్మినట్లు, దెయ్యం పట్టినట్లు.. ట్రాన్స్‌లోకి వెళ్లి పెద్దపెద్ద భవనాల మీద నుంచి, నదుల వంతెనల మీద నుంచి దూకేయసాగారు. కారణం లేకుండానే మెడకు ఉరితాళ్లు బిగించుకునేవారు. పదుల సంఖ్యతో మొదలైన ఆత్మహత్యలు వందలకు చేరుకున్నాయి. దాంతో ఆ పరిసరప్రాంతాల్లోని నదులు, ఎత్తైన కట్టడాల చుట్టూ పోలీసులు కాపలా కాయసాగారు. ఎవరైనా చనిపోవాలని నదిలోకి దూకేస్తే వెంటనే రక్షించేవారు. ఇలా ఎంతోమంది ప్రాణాలను కాపాడారు. 

కానీ, ప్రజల్లో ఆత్మహత్య ప్రయత్నాలు మాత్రం ఆగలేదు. కేవలం బుడాపెస్ట్‌లోనే కాకుండా హంగేరీలోని ఇతర నగరాల్లోనూ ఇలాంటి ఘటనలే కనిపించసాగాయి. డిప్రెషన్‌తోనే అలా ప్రవర్తిస్తున్నారని భావించిన  ప్రభుత్వ అధికారులు.. ప్రజలకు కౌన్సెలింగ్‌ ఇవ్వడం ప్రారంభించారు. అప్పటికీ సూసైడ్స్‌ ఆగలేదు. అంత యుద్ధమప్పుడు కూడా ధైర్యాన్ని కోల్పోని  జనం ఇప్పుడింతటి మనోవ్యాకులతకు ఎందుకు గురవుతున్నారో అర్థం కాలేదు నిపుణులకు, ప్రభుత్వ యంత్రాంగానికి. అసలు కారణం తెలుసుకోవడం కోసం.. కొందరు వైద్య నిపుణులు, మరికొందరు రక్షణ సిబ్బంది, పలు శాఖల అధికారులతో ఓ విచారణ కమిటీ ఏర్పడింది. ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించి, ప్రాణాలతో బయటపడిన వారిని ఆ కమిటీ ప్రశ్నించడంతో ఓ ఆశ్చర్యకరమైన విషయం వెలుగులోకి వచ్చింది. 

అదేంటంటే.. ‘గ్లూమీ సండే’. అదొక పాట.  నిత్యం రేడియోలో ప్లే అవుతున్న ఆ పాటను విన్న తర్వాత మదిలో ఏదో తెలియని ఆవేదన మొదలైందని, జీవితంపై విరక్తితో ఆత్మహత్య చేసుకోబోయామని తెలిపారు వాళ్లు. దాంతో అధికారులు తక్షణమే ఆ పాట ప్రసారాన్ని నిలిపేశారు. వరుస ఆత్మహత్యలతో అప్పటికే బుడాపెస్ట్‌కు ఆత్మహత్యల నగరంగా పేరు వచ్చేసింది. ఆ పేరును పోగొట్టే లక్ష్యంతో పలు స్మైల్‌ క్లబ్స్‌ ఏర్పాటయ్యాయి. అందులో జాయిన్‌ అయినవారిని డిప్రెషన్‌కి దూరం చేసి, నవ్వమని ప్రోత్సహించేవారు. ఎక్కడికక్కడ అహ్లాదాన్ని కలిగించే విధంగా నవ్వుతున్న మోనాలిసా, హాలీవుడ్‌ యాక్టర్స్‌ చిత్రాలను వేలాడదీసేవారు. నవ్వుకున్న గొప్పతనంపై అవగాహన కల్పిస్తూ.. ప్రజలంతా స్మైలీ మాస్కులు ధరించేలా ప్రోత్సహించారు. నవ్వే పెదవులని ముఖానికి అతికించుకుని అద్దంలో చూసుకోమనేవారు. 

వరుస ఆత్మహత్యలు సరే.. ప్రజల స్మైలీ మాస్కులతో మరోసారి ప్రపంచం దృష్టిలో పడింది బుడాపెస్ట్‌. మొత్తానికి.. ఒక పాట మనుషుల మనసులను కకావికలం చేసి, జీవితంపై విరక్తి పుట్టించడం ఊహించని పరిణామమే. మరి, బుడాపెస్ట్‌ ఆత్మహత్యలకు కారణం ‘గ్లూమీ సండే’ పాటేనా? మరింకేదైనా మిస్టరీ ఉందా? అనేవారికి మాత్రం నేటికీ సమాధానం దొరకలేదు. అయితే లాస్లీ జావోర్‌ రాసిన మూలకథనం (ఫెయిల్యూర్‌ లవ్‌ స్టోరీ) ఆధారంగా హంగేరీలో చాలా సినిమాలు వచ్చాయి.

ఇదీ.. పాట చరిత్ర..
1933లో రెజ్సే సీరెస్‌ అనే పియానిస్ట్‌ స్వరపరచిన ఈ పాట అసలు సాహిత్యం ‘ప్రపంచం అంతమవుతోంది’ అనే పేరుతో ఉంటుంది. యుద్ధం వల్ల కలిగే నిరాశ, ప్రజల పాపాల గురించిన  ప్రార్థనతో ముగుస్తుందీ గీతం. అయితే లాస్లీ జావోర్‌ అనే కవి ఆ పాటను ‘గ్లూమీ సండే’గా మార్చి సొంత లిరిక్స్‌ను జోడించాడు. అందులో ప్రేయసి చనిపోవడంతో, ఆమె ప్రియుడి ఆత్మహత్య ఆలోచనలతో నిండిన వేదన ఉంటుంది. (అయితే లాస్లీ తన భార్యతో విడిపోయినప్పుడు ఈ పాట రాశాడనే వాదన కూడా ఉంది) 1935లో పాల్‌ కల్మర్‌ హంగేరియన్‌లో రికార్డ్‌ చేశాడు. 1936లో హాల్‌ కెంప్‌ ఆంగ్లంలో తర్జుమా చేశాడు. 1941లో ‘బిల్లీ హాలిడే’ వెర్షన్‌ పేరిట.. పాట ఆంగ్ల ప్రపంచానికీ పరిచయమై ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందింది. అయితే బీబీసీ 2002 వరకూ ఈ పాటను నిషేధించింది.  

- సంహిత నిమ్మన

చదవండి: ఈ దోమ ఎగురుతుంటే సీతాకోకచిలుకలా.. మోస్ట్‌ బ్యూటిఫుల్‌..!

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top