మహిళా స్వాతంత్య్రాన్నీ ఆకాంక్షించిన గాంధీజీ

Gandhiji aspired  Women To Excel In Politics Gandhi Jayanti 2020 - Sakshi

స్త్రీల శక్తిపై గాంధీజీకి నమ్మకం. ‘ఇన్ని సీట్లు ఇచ్చేయడం కాదు..అన్ని సీట్లలోకీ రానివ్వాలి’ అనేవారు! సీట్లతో పరిమితం చెయ్యొద్దని. పోటీకొస్తుంటే అడ్డు పడొద్దని..స్త్రీల పాలనా సామర్థ్యాలను తక్కువగా చూడనే చూడొద్దని..  ఇంకోమాట కూడా అనేవారు పురుషుల అనుగ్రహాలు స్త్రీలకు జరిగే న్యాయాలేం కావని. స్త్రీ సాధికారతకూ గాంధీమార్గం ఉంది.  ఆ మార్గంలో నడవాల్సింది పురుషులే.

అడిగింది ఇవ్వడం ఇష్టం లేకపోతే, ‘కూర్చొని మాట్లాడుకుందాం రండి’ అని పిలుస్తారు అధికారంలో ఉన్నవారు. గాంధీజీని అలాగే రౌండ్‌ టేబుల్‌ సమావేశానికి పిలిచారు బ్రిటిష్‌ వాళ్లు. సమావేశం లండన్‌లో. ‘మమ్మల్ని మేం పరిపాలించుకుంటాం’ అంటారు గాంధీజీ. అంటే, మీరు మీ దేశానికి వెళ్లిపోండని బ్రిటిష్‌ వాళ్లకు మృదువుగా చెప్పడం. 1930 నుంచి 32 వరకు మొత్తం మూడు ‘రౌండ్‌’ల సమావేశాలు జరిగాయి. రెండో రౌండ్‌కు మాత్రమే వెళ్లారు గాంధీజీ. మొదట , మూడవ రౌండ్‌లలో ఆయన గానీ, మనవాళ్లలో ముఖ్యులు గానీ ఎవరూ కూర్చోలేదు. రెండో రౌండ్‌ సమావేశానికి వెళ్లే ముందు 1931 సెప్టెంబర్‌ 17న గాంధీజీ  ఒక మాట అన్నట్లు చెబుతుంటారు. ‘‘భారతదేశ చట్టసభలో కనుక మహిళలకు తగిన భాగస్వామ్యం లేకపోతే నేను ఆ సభలోకే అడుగు పెట్టను’’ అని గాంధీజీ అన్నట్లుగా చరిత్రలో ఉన్న ఆ మాట మన దగ్గర చివరిసారిగా వినిపించింది 2010 మార్చి 9న రాజ్యసభలో మహిళా రిజర్వేషన్‌ బిల్లు ఆమోదం పొందినప్పుడు. ‘స్త్రీ పురుష సమానత్వం కోసం గాంధీజీ కనిన కల సాకారం అయింది’ అని కూడా ఆ బెంచీల  లోంచి ఎవరో పెద్దగా అరిచారు. దేశానికి స్వాతంత్య్రాన్ని కోరుకున్నట్లే, దేశంలోని మహిళల స్వాతంత్య్రాన్నీ గాంధీజీ కోరుకున్న మాట నిజమే. అసమానతల నుంచి ఆ స్వాతంత్య్రం. అయితే రిజర్వేషన్‌లతోనే మాత్రమే దానిని మనం సాధించగలం అని గాంధీజీ చెప్పలేదు. మహిళలకు మనం ఏదైనా ఇస్తున్నామూ అంటే , అది ఏనాడో వారికి దక్కవలసి ఉండింది మాత్రమేనని గాంధీజీ అభిప్రాయపడేవారు. ‘‘సమానత్వం అంటే వాళ్లకు కొన్ని సీట్లు వేసి కూర్చోమనడం కాదు, పోటీ పడి పోరాడే అవకాశం ఉండటం. స్త్రీకి.. పురుషుడితో సమానమైన శక్తి ఉంది. అంతకన్నా ఎక్కువ శక్తి కూడానేమో. ఆ శక్తిని అడ్డుకునే పురుషాధిక్య ప్రదర్శనకు రాజకీయాల్లో గానీ, ఇంకెక్కడైనా కానీ తావు ఉండకూడదు’’ అనేవారు గాంధీజీ.

దేశానికి స్వాతంత్య్రం రాకముందే దేశ స్వాతంత్య్రాన్ని ఎలా తీర్చిదిద్దుకోవాలో గాంధీజీ స్పష్టమైన రూపురేఖలు గీసుకున్నారు. ఎవరూ ఎవరికీ బానిసలుగా ఉండకూడదు. ఎవరూ ఎవరిపై అధికారం చెలాయించకూడదు. పురుషులతో సమానంగా స్త్రీలూ స్వేచ్ఛాస్వాతంత్య్రాలను అనుభవించాలి. పరాయి పాలన నుంచి దేశానికి విముక్తి లభించినా, పురుషాధిపత్యాల నుంచి స్త్రీలకు విముక్తి లభించనిదే స్వాతంత్య్రం పరిపూర్ణమైనట్లు కాదు. ఇలా భావించారు గాంధీజీ. దేశ స్వాతంత్య్రం కోసం కలిసి తిరుగుబాట్లు, కలిసి ఉద్యమాలు, కలిసి పోరాటాలు చేసిన స్త్రీ పురుషులు.. స్వాతంత్య్రం తర్వాత ఎక్కువ తక్కువల పౌరులు అయేందుకు వీలే లేదని స్వాతంత్య్రానికి మునుపే ఆయన భారతీయ సమాజానికి హెచ్చరిక చేశారు. పరాయి పాలన నుంచి అహింస ద్వారా దేశానికి స్వతంత్రాన్ని సాధించడం ఎలా, సాధించిన స్వాతంత్య్రంతో సమాజంలోని అన్ని వర్గాల వారూ సమాన ఫలాలను పొందడం ఎలా అని గాంధీజీ 18 కీలకాంశాలతో కూడిన ఒక విప్లవాత్మక కార్యాచరణను సిద్ధం చేసుకున్నారు. అందులోని ఒక అంశం.. దైనందిన, సామాజిక జీవితంలోని ప్రతి హక్కులోనూ స్త్రీలు సమ భాగస్వామ్యం కలిగి ఉండటం! అంత ముందుచూపు గాంధీజీది. ‘‘స్త్రీలు ఒక విధమైన బానిసత్వంలో ఉన్నారు. ఎప్పటికైనా ఆ బానిసత్వం నుంచి తాము బయట పడతామో లేదోనన్న భయంలోనూ ఉన్నారు’’ అనీ ఆయన వ్యాఖ్యానించారు! స్వాతంత్య్రం వచ్చి 73 ఏళ్లు అయ్యాయి. గాంధీజీ ఊహించినట్లు (భయపడినట్లు అనాలి) నేటికింకా మహిళలు స్వేచ్ఛా సమానత్వం కోసం పోరాడుతూనే ఉన్నారు. స్వాతంత్య్ర సంగ్రామంలో పురుషులకు స్త్రీలు తోడున్నారు. స్వేచ్ఛ కోసం స్త్రీలు ఇప్పుడు ఒంటరి పోరాటం చేస్తున్నారు.
 
భారతదేశ స్వాతంత్య్ర ప్రకటనకు ఏడాది ముందు కూడా మహిళల విషయమై గాంధీజీ చింతాక్రాంతులై ఉన్నారని అంటారు. మహిళల రాజకీయ భాగస్వామ్యాన్ని పురుషులు అడ్డకోవడం ఆయన ఆవేదనకు కారణం అయింది. ‘‘ఎందుకు మీరింతగా స్త్రీ పురుష సమానత్వం కోసం ఆరాట పడుతున్నారు?’’ అని ఒక ప్రశ్న కూడా ఆయనకు ఎదురైంది. ‘‘ఇన్నాళ్లూ వాళ్లు పురుషుల వెనుక నడిచారు. సంగ్రామంలో పురుషుల పక్కన నడిచారు. ఇప్పుడు పురుషులకు ముందు నడవాల్సిన తరుణం వచ్చింది’’ అని గాంధీజీ సమాధానం. మహిళలు ముందు నడవడం అంటే దేశాన్ని ముందుకు నడిపించడం అని ఆయన ఉద్దేశం. ‘‘వాళ్లమీద కురుస్తున్న అనుగ్రహాలేమీ లేవు. వాళ్లకేదైనా మేలు జరుగుతోందంటే స్త్రీలు అయిన కారణంగా వాళ్లకు జరిగిన అన్యాయానికి ఆలస్యంగా న్యాయం లభించడం మాత్రమే ఆ మేలు’’ అని అంటారు గాంధీజీ. నేడు ఆ మహాత్ముని, మహిళాన్వితుని జయంతి.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top