
రెండేళ్లలో పెరిగిన ప్రయాణికులు తగ్గుముఖం పట్టిన సిటీ బస్సులు
డొక్కు బస్సుల స్థానంలో రీప్లేస్‌మెంట్‌తో సరి
గ్రేటర్‌లో సుమారు 40 శాతం బస్సుల కొరత
100 ప్రయాణికులుశాతం బస్సులు 60 శాతం మాత్రమే
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ మహానగరం పరిధి ట్రిపుల్ ఆర్ వరకు పెరిగింది. ఫ్యూచర్‌సిటీ ఇప్పటి నుంచే అరచేతిలో వైకుంఠాన్ని చూపిస్తోంది. రానున్న రోజుల్లో హైదరాబాద్ అతి పెద్ద గ్లోబల్‌సిటీగా అవతరించనుందని ప్రభుత్వం పదే పదే ప్రస్తావిస్తోంది. కానీ ఈ విస్తరణకు తగినవిధంగా ప్రజారవాణా సదుపాయాల అభివృద్ధిపైన మాత్రం దృష్టి సారించడం లేదు. మెట్రో రెండో దశకు డీపీఆర్‌లు సిద్ధమైనప్పటికీ కేంద్రం నుంచి అనుమతులు లభించకపోవడంతో ఆ ప్రాజెక్టు ఊగిసలాడుతోంది. రోజురోజుకూ పెరుగుతున్న ప్రయాణికుల అవసరాలు, ఔటర్‌ను దాటుకొని ట్రిపుల్ ఆర్ వరకు విస్తరిస్తున్న కాలనీలు, జనావాసాల దృష్ట్యా రవాణా రంగానికి చెందిన నిపుణుల అంచనాల ప్రకారం హైదరాబాద్ మహానగరానికి ఇప్పటికిప్పుడు కనీసం 6 వేల బస్సులు అవసరం. కానీ పదేళ్లుగా కొత్త బస్సులు రోడ్డెక్కలేదు. కాలం చెల్లిన వాటి స్థానంలో ఎలక్ట్రికల్ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్, ఏసీ కేటగిరీలకు చెందిన అద్దె బస్సులను ప్రవేశపెట్టడం మినహా ప్రజావసరాలకు అనుగుణంగా సిటీబస్సులు అందుబాటులోకి రాలేదు. మరోవైపు ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా మహాలక్ష్మి పథకం ప్రవేశపెట్టిన తరువాత అన్ని బస్సులు ఇంచుమించు 100 శాతం ఆక్యుపెన్సీతో నడుస్తున్నాయి. కానీ 60 శాతం బస్సులే రవాణా సదుపాయాన్ని అందజేస్తున్నాయి. రెండేళ్లలో సుమారు 40 శాతం బస్సులు తగ్గాయి. బస్సుల కొరత క్రమంగా పెరుగుతోంది.
ఇదీ చదవండి: 2027లో సుప్రీంకోర్టు చరిత్రలోనే రికార్డు సృష్టించనున్నది ఎవరో తెలుసా?
కొత్త బస్సులేవి..?
నగరంలో ఒకవైపు సొంత వాహనాల సంఖ్య గణనీయంగా పెరిగినప్పటికీ మరోవైపు సిటీబస్సుల వినియోగం కూడా పెరిగింది. మెట్రో రైళ్లు తిరిగే కారిడార్‌లలో మినహాయించి నగరం నలువైపులా ప్రయాణికులు బస్సులపైనే ఆధారపడి రాకపోకలు సాగిస్తున్నారు. విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులు, దినసరి కూలీలు తదితర వర్గాలకు చెందిన ప్రయాణికులు వివిధ ప్రాంతాల మధ్య రాకపోకలు సాగించేందుకు సిటీ బస్సులను ఎక్కువగా వినియోగిస్తున్నారు. ప్రత్యేకించి మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయం అందుబాటులోకి వచ్చిన తరువాత ప్రయాణికుల సంఖ్య బాగా పెరిగింది. రెండేళ్ల క్రితం సుమారు 16 లక్షల మంది ప్రయా ణం చేయగా, ఇప్పుడు ఆ సంఖ్య సుమారు 22 లక్షలకు చేరినట్లు అంచనా. కేవలం ఈ రెండేళ్ల కాలంలోనే ఇంచుమించు 6 లక్షల మంది పెరిగారు.
2023 డిసెంబర్‌లో ఉచిత ప్రయాణ సదుపాయాన్ని ప్రవేశపెట్టిన తరువాత మెట్రోల్లో ప్రయాణం చేసే మహిళలు, సొంత వాహనాలను వినియోగించేవారు సైతం సిటీబస్సుల వైపు మళ్లారు. మరోవైపు తెలంగాణలోని వివిధ ప్రాంతాల నుంచి నగరానికి వచ్చే మహిళా ప్రయాణికుల సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది. ఇదే సమయంలో బస్సుల సంఖ్య మాత్రం పెరగడం లేదు. నగరంలోని 28 డిపోల పరిధిలో 2800 బస్సులు మాత్రమే ఉన్నాయి. దీంతో ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రయాణికుల రద్దీతో కిక్కిరిసిపోతున్నాయి.శివారు ప్రాంతాలు, కాలనీలకు బస్సుల కొరత తీవ్రంగా ఉంది. వందలాది ప్రాంతాలకు ఉదయం, సాయంత్రం ఒకటి, రెండు ట్రిప్పుల చొప్పున మాత్రమే తిరుగుతున్నాయి. దీంతో మిగతా సమయాల్లో ప్రయాణికులు సెవెన్ సీటర్ ఆటోలు ఇతర ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించాల్సి వస్తోంది. కొత్తగా కొన్ని బస్సులను ప్రవేశపెట్టినప్పటికీ కాలం చెల్లిన వాటి స్థానంలో అందుబాటులోకి వచ్చినవే కానీ పెరుగుతున్న ప్రయాణికులు, విస్తరిస్తున్న హైదరాబాద్ మహానగరం అవసరాల మేరకు ప్రవేశపెట్టినవి కాదని ఆర్టీసీ అధికారి ఒకరు అభిప్రాయపడ్డారు.
ఇదీ చదవండి: ఇల్లు అమ్ముకుని లక్షలు పంచుకున్నారు, అమ్మానాన్నలను గెంటేశారు!
మెట్రో నగరాలతో పోటీ ఎక్కడ?
ముంబయి, ఢిల్లీ, బెంగళూరు, తదితర మెట్రో నగరాల్లో సబర్బన్ రైళ్లు, మెట్రో రైళ్లతో పాటు సిటీ బస్సులను కూడా గణనీయంగా పెంచారు. దీంతో లక్షలాది మంది ప్రయాణికులు ఎక్కడి నుంచి ఎక్కడి వరకైనా తేలిగ్గా ప్రయాణం చేసే సదుపాయం ఉంది.
దేశ రాజధాని ఢిల్లీలో ప్రస్తుతం 8,121 బస్సులు ఉన్నాయి. వచ్చే రెండేళ్లలో మరో 2000 బస్సులను కొనుగోలుచేయాలనే ప్రణాళికలు ఉన్నాయి.
ముంబయిలో ప్రస్తుతం 3,228 బస్సులు అందుబాటులో ఉన్నాయి.2027 నాటికి ఈ సంఖ్యను 8000 లకు పెంచేందుకు కార్యాచరణ చేపట్టారు.
బెంగళూరులో 6,835 బస్సులు అందుబా టులో ఉన్నాయి. మరో 1000 బస్సులను కొత్తగా కొనుగోలు చేసే ప్రతిపాదన ఉంది.
హైదరాబాద్‌లో 2,800 బస్సులు తిరుగుతున్నాయి. ఈ ఏడాది కొత్తగా మరో 500 బస్సులను అద్దె ప్రాతిపదికన ఏర్పాటు చేయాలనే ప్రణాళికలు ఉన్నాయి.