హైదరాబాద్‌లో బస్‌పాస్‌కు రూ.1200.. ఇలా చేస్తే బెటరేమో!

TSRTC Will Likely Issues Route Passes In Hyderabad For All Categories - Sakshi

నచ్చిన మార్గానికి బస్‌పాస్‌

జీబీటీలకు ప్రత్యామ్నాయంగా రూట్‌పాస్‌లు

ఉద్యోగులు, విద్యార్థులకు ప్రయోజనం

ఆర్టీసీకి  అదనపు ఆదాయం

గ్రేటర్‌లో 5 లక్షలకు పైగా బస్‌పాస్‌లు  

సాక్షి, హైదరాబాద్‌:  సిటీబస్సుల్లో రూట్‌పాస్‌లు అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటి వరకు కేవలం పదోతరగతి వరకు చదివే విద్యార్థులకే పరిమితమైన  రూట్‌పాస్‌లను అన్ని కేటగిరీలకు చెందిన విద్యార్థులకు, సాధారణ ప్రయాణికులకు కూడా విస్తరించేందుకు ఆర్టీసీ సన్నాహాలు చేపట్టింది. కోరుకున్న దూరానికే పాస్‌లు ఇవ్వడం వల్ల ప్రయాణికులకు  డబ్బు  ఆదా అవుతుంది. అలాగే  ఆర్టీసీకి గణనీయంగా ఆదాయం పెరిగే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఇంటి  నుంచి  ప్రభుత్వ, ప్రైవేట్‌ కార్యాలయాలకు రాకపోకలు సాగించే  ఉద్యోగులు ప్రతి నెలా రూ.1200 పైన చెల్లించి  సాధారణ  బస్‌పాస్‌లు  తీసుకోవలసి వస్తోంది. వీటిపై  సిటీలో ఎక్కడి నుంచి ఎక్కడ వరకైనా ప్రయాణం చేయవచ్చు.
చదవండి: TSRTC: దసరా పండగకు ప్రయాణికులకు తీపికబురు..

కానీ ఉద్యోగులు, విద్యార్థులు చాలా వరకు ఇంటి నుంచి కార్యాలయాలు, స్కూళ్లు, కాలేజీలకు మాత్రమే ప్రయాణం చేస్తారు. దీంతో సాధారణ పాస్‌లపైన  తాము ప్రయాణం చేయని దూరానికి కూడా అదనంగా డబ్బు చెల్లించవలసి వస్తోంది. దీంతో బస్‌పాస్‌ల అవసరం ఉన్నప్పటికీ డిమాండ్‌ కనిపించడం లేదు. గ్రేటర్‌లో లక్షలాది మంది చిరుద్యోగులు, ప్రభుత్వ, ప్రైవేట్‌ రంగాల్లో పని చేసేవారు ఉన్నారు. అలాగే నగర శివార్లలోని  కళాశాలలకు రాకపోకలు సాగించే విద్యార్థుల సంఖ్య కూడా గణనీయంగానే ఉంది. కానీ బస్‌పాస్‌ వినియోగదారుల సంఖ్య మాత్రం 5 లక్షలకు పైగా ఉంది. సాధారణ పాస్‌లతో పాటు ప్రయాణికులు కోరుకున్న రూట్‌ వరకు పాస్‌ ఇవ్వడం వల్ల ఈ వినియోగదారుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
చదవండి: TSRTC: ఉద్యోగులకు ఆర్టీసీ బంపర్‌ ఆఫర్‌ 

ఉభయ తారకంగా... 
ముషీరాబాద్‌కు చెందిన  సురేష్‌ ప్రతి రోజు  కోఠి వరకు సిటీ బస్సులో ప్రయాణం చేస్తాడు. అందుకోసం అతడు  ప్రతి నెలా  రూ.1150 వరకు వెచ్చించి సాధారణ మెట్రో బస్‌పాస్‌ (జీబీటీ) తీసుకోవలసి వస్తుంది. కానీ అదే మార్గంలో అతనికి రూట్‌పాస్‌ తీసుకొనే సదుపాయం ఉంటే కేవలం రూ.800 లోపే  లభిస్తుంది. ప్రతి నెలా రూ.350 వరకు ఆదా అవుతుంది.  

ఈ తరహా రూట్‌పాస్‌లను ఆర్టీసీ అందజేస్తే  ఉద్యోగులు, విద్యార్థులతో పాటు నిర్ణీత స్థలాలకు రాకపోకలు సాగించే చిరువ్యాపారులకు  కూడా ప్రయోజనంగా ఉంటుంది. ఎక్కువ మంది పాస్‌లు తీసుకోవడం వల్ల ఆర్టీసీకి ముందస్తుగానే ఆదాయం  లభిస్తుంది. ప్రస్తుతం  ప్రభుత్వ ఉద్యోగులకు  ఎన్జీవో పాస్‌లు ఉన్నాయ. అలాగే  విద్యార్థులకు జీబీటీలతో పాటు పరిమిత సంఖ్యలో రూట్‌పాస్‌లు, గ్రేటర్‌ పాస్‌లు అందుబాటులో ఉన్నాయి. ఇప్పటికే కొన్ని స్కూళ్లు, కాలేజీలు పని చేస్తున్నాయి. దసరా తరువాత మరిన్ని విద్యాసంస్థలు తెరుచుకునే అవకాశం ఉంది. దీంతో రూట్‌పాస్‌లను విస్తరించాలని  అధికారులు  భావిస్తున్నారు. 
చదవండి: ఆర్టీసీ బస్సులకు కొత్త రంగులు

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top