
ప్రకృతి ప్రేమికుడిగా.. పర్యావరణ పరిరక్షణకు జీవితాన్ని అంకితం చేసిన వ్యక్తి మన వనజీవి రామయ్య. అలాంటి వనజీవే పశ్చిమ బెంగాల్ పూరులియాలో ఒకరున్నారు. తన 12వ ఏట నుంచి వన సంరక్షణకు కృషి చేస్తున్నారాయన. ఆ సేవను గుర్తించే కిందటి ఏడాది భారత ప్రభుత్వం ఆయనకు పద్మశ్రీ ఇచ్చి గౌరవించింది. అయితే.. ప్రభుత్వం నుంచి ఎలాంటి తోడ్పాటు లేకపోవడంతో కూలిన స్థితిలో ఉన్న పూరిగుడిసెలోనే ఆయన జీవనం వెల్లదీస్తున్నారు.
బీడుభూమిగా ఉన్న అజోధ్యా హిల్స్ ప్రాంతాన్ని.. పచ్చటి వనంగా తీర్చి దిద్దిన వ్యక్తి దుఖు మాఝీ. అలాంటి వ్యక్తి చందాల మీద అతికష్టంగా గడుపుతున్నారు. శిథిలావస్థలో ఉన్న ఆ గుడిసె బయట పద్మశ్రీ పురస్కార గ్రహీత అనే బోర్డు ఉంటుంది. ఆ పక్కనే పాత సైకిల్ ఉంటుంది.

స్థానికంగా గచ్చ్ దాదూ(Tree Grandfather)గా పేరున్న దుఖు మాజీ.. భార్య, దివ్యాంగుడైన కొడుకుతో కలిసి ఓ పూరీ గుడిసెలో ఉంటున్నాడు. అది వర్షాలకు తడిసి ముద్దవుతూ ఏ క్షణమైనా కూలిపోయే స్థితికి చేరింది. దీంతో గ్రామస్తులు చందాలు వేసుకుని వెదురు బొంగులు, పైన కప్పే టార్పాలిన్ షీట్ అందించారు. సోషల్ మీడియా స్పందనతో ప్రతిపక్ష నేత సువేందు అధికారి రూ.2 లక్షల సహాయం ప్రకటించి, శాశ్వత గృహ నిర్మాణానికి హామీ ఇచ్చారు.
అదే సమయంలో ఆయనకు ఇప్పటిదాకా సొంతిల్లు లేకపోవడంతో..ప్రభుత్వంపై విమర్శలు మొదలయ్యాయి. పలుమార్లు ప్రభుత్వానికి అర్జీ పెట్టుకున్నా ఇల్లు దక్కలేదన్నది ఆ విమర్శల సారాంశం. విమర్శల వేళ అధికారులు స్పందించారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద గతంలోనే ఆయనకు శాశ్వత నివాసం మంజూరైనట్లు చెప్పారు. ఇదే విషయాన్ని ఆయన కూడా ధృవీకరించారు. అయితే తన పెద్ద కొడుకు వివాహం చేసుకుని ఆ ఇంట్లో నివాసం ఉంటున్నాడని చెప్పాడాయన. దాతలు దయ తలిస్తే తన స్థలంలోనే సొంతిల్లు కట్టుకుంటానని వేడుకుంటున్నాడు.
మొక్కలను రక్షిస్తేనే మనం స్వచ్ఛమైన గాలి పీల్చగలం అని ఓ పోలీసు అధికారి పంద్రాగష్టున ఇచ్చిన ప్రసంగం ఆయన్ని ఎంతగానో ఆకర్షించిందట. అలా చిన్నతనం నుంచే ఆయన మొక్కల్ని నాటుతూ.. చెట్ల సంరక్షణకు పాటుపడుతున్నారు. ఐదు వేలకు పైగా మొక్కలు నాటి వృక్షాలుగా ఎదిగేదాకా సంరక్షణ చూసుకున్నారాయన. ఈయన జీవితాన్ని రుఖూ మాటి దుఖు మాఝీ పేరిట డాక్యుమెంటరీగా తీస్తే.. అది జాతీయ అవార్డు దక్కించుకుంది కూడా.