
నేడు బక్రీద్
ప్రతి విశ్వాసికి జీవితంలో తీపి గుర్తులుగా నిలిచి΄ోయే సందర్భాలు కొన్ని ఉంటాయి. అలాంటి వాటిలో పండుగలు కూడా ఒకటి. ఇస్లామ్ జీవన విధానంలో ముస్లింలు రెండు పండుగలు జరుపుకుంటారు. ఒకటి ఈదుల్ ఫిత్ర్ /రమజాన్, రెండవది ఈదుల్ అజ్ హా/బక్రీద్. ఈదె ఖుర్బాన్ గా పిలువబడే ఈ బక్రీద్ పర్వదినం చరిత్రలో ఒక విశిష్ట స్థానం దక్కించుకుంది.
ఇది కేవలం ఒక వేడుక మాత్రమే కాదు, ఇది భక్తి, త్యాగం, ప్రేమ, సహనం, సమానత్వం, మానవతా విలువల ఉత్కృష్ట రూపం. ఈద్ మూలసారాన్ని అర్థం చేసుకోవాలంటే, దాని చారిత్రక నేపథ్యాన్ని గుర్తుచేసుకోవాలి. ప్రవక్త ఇబ్రాహీం అలైహిస్సలాంను దైవం పరీక్షించాడు. పరీక్షలో భాగంగా తన కుమారుడు ఇస్మాయీల్ అలైహిస్సలాంను త్యాగం చేయమని ఆదేశించాడు. దైవాదేశాన్ని విన్న మరుక్షణం ఆయన ఎలాంటి తడబాటు లేకుండా అంగీకరించారు.
కుమారుణ్ని కూడా సంప్రదించారు. ఇది దేవుని ఆజ్ఞ అని అర్థమై, తండ్రికి సహకరించేందుకు సిద్ధపడ్డాడు కుమారుడు. ఇదే సమయంలో దైవం వారి నిబద్ధతను మన్నించి, వారి త్యాగానికి బదులుగా ఒక గొర్రె పొట్టేలును పంపించి, వారిని పరీక్షనుండి సురక్షితం గావించాడు. నిజాయితీ, భక్తి తత్పరత, నిబద్ధత, త్యాగనిరతి లాంటి సుగుణాలన్నీ ఎటువంటి కఠిన పరీక్షలనుంచయినా సురక్షితంగా బయట పడేయగలవని ఈ సంఘటన రుజువు చేస్తోంది.
ఈ ఘట్టాన్ని గుర్తుచేసుకుంటూ ప్రతి సంవత్సరం ముస్లింలు ఈదుల్ అజ్ హా/బక్రీద్ జరుపుకుంటారు. ఈ పండుగ కేవలం ఒక జంతువును త్యాగం చేయడం మాత్రమే కాదు. అది మన మనస్సులోని స్వార్థాన్ని, లోభాన్ని, అహంకారాన్ని త్యాగం చేయడం కూడా! మనం చేసే ఈ త్యాగం తాలూకు భక్తి శ్రద్ధలు అంటే తఖ్వా మాత్రమే దైవం చూస్తాడు, స్వీకరిస్తాడు. రక్త మాంసాలతో ఆయనకు సంబంధంలేదు.
అవసరమైతే ధర్మం కోసం, న్యాయం కోసం నాప్రాణమైనా ఇస్తాను అనే స్పష్టమైన సంకేతం ఇందులో ఉంది. ఈ విషయం ఖురాన్‌లో ఇలా ఉంది: నా నమాజు, నా త్యాగం (నుసుక్), నా జీవితం, నా మరణం సమస్తమూ సర్వలోక పాలకుడైన దైవానికే.
(పవిత్ర ఖురాన్ 6:162)’అల్లాహ్ వద్దకు మాంసం గాని, రక్తం గాని చేరవు; ఆయనకు చేరేది మీ తఖ్వా మాత్రమే’ (పవిత్ర ఖురాన్ , సూరె హజ్ : 37) ఈద్ పర్వదినాన్ని మనం ఎలా గడిపితే అది దైవానికి ఆమోదయోగ్యమవుతుందో ఆ దిశగా ప్రతి విశ్వాసి ప్రయాణం సాగాలి. త్యాగం, భక్తి, ప్రేమ, వినయం, క్షమ, సహనం, మానవత ఇవే ఈ పండుగకు మూల సారాంశం. మన తలుపు తట్టే ప్రతి అవసరమున్న హృదయాన్ని తాకే రోజు ఈదుల్ అజ్ హా కావాలి. మనం చేసే త్యాగం దైవానికి చేరాలంటే అది హృదయ పూర్వకమైనదిగా, తఖ్వాతో కూడినదై ఉండాలి.
హృదయాన్ని తాకే సందేశం
ఈ పర్వదినాన మాంసాన్ని పంచుకోవడం కూడా ఒక విశేషమైన సంప్రదాయం. పేదలకు, బంధువులకు, సొంత కుటుంబానికి ఈ మాంసాన్ని మూడు భాగాలుగా విభజించి పంచడం వల్ల పరస్పర మానవ సంబంధాలు బలపడతాయి. ఇది ఒక ఆచారమే కాదు, ఒక సాంఘిక బాధ్యత కూడా.
ఈ సందర్భంలో ప్రవక్త సల్లల్లాహు అలైహివసల్లం వారి ప్రవచనం మనకు మార్గదర్శకంగా నిలుస్తుంది: ‘తను కడుపునిండా అన్నం తిని, తన పొరుగువాడు పస్తు ఉన్నట్లయితే, అలాంటి వ్యక్తి మోమిన్ (విశ్వాసి) కాలేడు. (ముస్త్రదక్ అల్ హాకీం, 7303) ఈ హదీసు మనకు బోధించేది, మనకు తెలిసేది ఏమిటంటే ఈద్ పర్వదినం సందర్భంగా సంతోషం కేవలం మన ఇంట్లో మాత్రమే కాదు, మన చుట్టుపక్కల వారిని కూడా మన సంతోషంలో భాగస్వాములను చేయాలి.
అదే నిజమైన ఆధ్యాత్మికత. అదే నిజమైన మానవత. అలాగే, ఈద్ సందర్భంగా త్యాగం అంటే, కేవలం మాంసం పంచడం మాత్రమే కాదు, మన అవసరాలను కొంతవరకు నియంత్రించుకొని, పేదసాదల పట్ల కరుణతో, సేవాభావంతో వ్యవహరించాలి. నిజమైన త్యాగం అంటే పండుగ, పండుగ తర్వాతి కాలంలోనూ మన ప్రవర్తనలో మార్పు కనిపించాలి. మన వ్యక్తిత్వంలో, మన ఇంట్లో, మన కుటుంబంలో, మన సమాజంలో పరిశుభ్రత, నైతికత పరిఢవిల్లాలి.
ముఖ్యంగా ఈద్ రోజున మనం ఇరుగు, పొరుగును పలకరించాలి. కులమతాలు వేరయినా, మానవతా సంబంధాల పరంగా మనమంతా ఒక్కటే. పరస్పరం సోదర సంబంధమే. ఈ ఐక్యతను చాటాలి. ఈద్ ఒక ఇస్లాంకు సంబంధించిన పండుగ అయినా, దాని సందేశం విశ్వమానవీయంగా ఉంది. ప్రతి హృదయాన్ని తాకే విధంగా ఉంది. దీన్ని మత విభేదాల్ని చెరిపి, మానవతను సమీకరించే రోజుగా మార్చుకోవాలి.
– ముహమ్మద్ ఉస్మాన్ ఖాన్