ఈస్టర్ స్పెషల్
దేవుడు తన బలాతిశయము చేత క్రీస్తును మృతులలో నుండి లేపాడు (ఎఫెసీ 1:20,21). అన్నదే విశ్వసించదగ్గ అపొస్తలుల సువార్త సంబంధిత బోధయై ఉంది.
సత్యవాక్యమను రక్షణ సువార్తగా కూడా ఇది ఉంది. లేచాడు అన్నది సువార్త కాదు. సర్వశక్తి సంపన్నుడైన అద్వితీయ సత్య దేవుని చేత యేసు మృతులలో నుండి సజీవంగా లేపబడ్డాడు అనునదే లేఖనానుసార సత్య సువార్త. తండ్రికి విలువిచ్చే క్రీస్తు అపార విధేయతను ఇదే ఘనంగా చాటుతుందనుటలో ఎలాంటి సందేహం అవసరం లేదు.
’వాక్యము నీ వద్దను, నీ నోటను, నీ హృదయములోను ఉన్నది. అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే. అదేమనగా – యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన యెడల నీవు రక్షింపబడుదువు’ (రోమా 10: 8–10). యేసు సజీవుడుగు దేవుని కుమారుడైన క్రీస్తు అనేది అపొస్తలుల అమూల్య విశ్వాసం. దేవుని కుమారుడు అంటే ఆయన ఆత్మ సంబంధ ఇశ్రాయేలీయుల రాజు అని అర్థం.
యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని నమ్ముతూ ఆయన నామమందు జీవము పొందాలి అన్నదే ప్రతి ఒక్కరి ఆత్మ సంబంధ విజయానికి మూలం. ఈ లోకం మీద విజయం యేసు దేవుని కుమారుడు అనుటలోను , ఆయన్ను దేవ దేవుడు ఈ లోకానికి శరీరధారిగా పంపాడని విశ్వసించుటలోనే విజయం దాగి ఉంది (1యోహాను 5:5 ).
మరి క్రీస్తు విజయానికి మూలం ఎక్కడ అన్నది లోతుగా పరీశీలన చేస్తే అది ఒక్క ఆయన విధేయతే అనేది బహు తేటగా వెల్లడవుతూ ఉందన్నది ఆశ్చర్యకర విశేషం.
ఆజ్ఞలకు లోబడి పాపం చేయకపోవడం ద్వారా పరిశుద్ధత, దాని విధేయత ఈ రెండూ ఎప్పుడు నిలుపుకొనే వేకువ ప్రార్థనలతో అవిశ్రాంత విన్నపాలతో క్రీస్తు అసాధారణ విజయుడిగా, జగజ్జేతగా చరిత్రకెక్కాడు.
దేవుడు తనకు అత్యంత విధేయుడైన తన కుమారుడను మరణంలో నుండి జీవములోనికి దాటించాడు. మరణంలోనుండి జీవములోనికి రావడం, పునరుత్థానం చెందడం ఇలా యేసు మరణాన్ని జయించడం దేవుని గొప్ప సంకల్పం.
అయితే తనను మరణం నుండి రక్షింపగల తండ్రియైన దేవునికి ప్రార్థనలు, యాచనలు సమర్పించినందున యేసు అంగీకరించబడ్డాడనేది ఇదే ఆయన సాహసోపేత విజయానికి మూలం అయ్యింది. ఇక్కడ మరణం అంటే సిలువ మరణం కాదు, ఆత్మ సంబంధ మరణం. యేసుకు సిలువ మరణం తప్పదు. ఎందుకంటే ఇది దేవుని సంకల్పం. ఆయన మరి ఎలాంటి మరణం మీద గురిపెట్టి విజయం సాధించాలనుకున్నాడు అన్నది చూస్తే అదే ఆత్మ సంబంధ మరణం. ఆయన పరిశుద్ధుడు గనుక మరణం ఆయన మీద ఏలుబడి చేయుటకు అన్ని కోణాల్లో అన్ని దారులు వెదకి అది బాగా అలసిపోయింది. పారదర్శకంగా పరిశుద్ధ జీవితం ఆచరించి చూపుతూ యేసు మరణానికి సంపూర్తిగా తలవంచాడు. అంతే, మరణం ఆయన ముందు తలవంచి మోకరిల్లి సాగిలపడింది.
మతంతో సంబంధం లేని మార్గం
మన తోటి ఇరుగు పొరుగు వాని చుట్టురా ఉన్న సమాజం మేలుకై ప్రతి పని, పరిచర్య, సేవా విధానం శుద్ధ హృదయంతో ఆచరించుట ద్వారానే దేవుని మెప్పు పొందగలం. నిత్య సత్య జీవమనే క్రీస్తు మార్గం మతంతో ఎలాంటి సంబంధం లేనిది. ఇదొక ఆత్మ సంబంధ అసాధారణ ఆధ్యాత్మిక జీవన విధానం. ఇందులో వ్యక్తిగతమైన స్వయం స్వశక్తితో కూడిన పాప నివారణ సంబంధిత పరిశుద్ధ అభ్యాస ప్రయత్నాలు మచ్చుకైన కనపడవు. క్రీస్తును బట్టి దేవుని మీద ఆధారపడిన జీవితాలు ఏంతో పురోగమనం సాధించే స్థితిలో ఉంటుంటాయి. తమ మానవ జ్ఞానంతో ముడిపెట్టక తమ మంచి చెడ్డల విచక్షణ విషయమైన జ్ఞానం దేవునికే అప్పగించి అన్నింటా దేవునికే మహిమ చెందేలా ఆయన్ను ఘన పరచుటే అతి శ్రేష్టమైన సద్భక్తి జీవిత విధానం.
నిత్యజీవము పొందుటకు నేనేం చేయాలి? అన్నదానికి సమాంతర ప్రశ్నయే ‘మరణంలో నుండి జీవంలోనికి దాటుట ఎట్లు?’ అనేది. మరణంలో నుండి జీవములోనికి దాటుటలో గొప్ప అనుభవం సంపాదించినవాడు, అత్యంత ప్రతిభ, ప్రభావ సంపన్నుడు యేసు మాత్రమే అన్న సర్వసత్యాన్ని బహు తేటగా గ్రహించినవారై మొదటగా ఆయన శిష్యులైన అపొస్తలులు ఆ తదుపరి ఆదిమ సంఘము ఆయన అడుగుజాడలలోనే నడిచి అన్నింటా గెలిచింది.
ఆ ఆదిమ సంఘాన్ని అనుసరించి ఒక్కటే క్రీస్తు శరీరమను సంఘాలు నేడునూ పాపం నుండి పరిశుద్ధతలోనికి అనగా మరణంలో నుండి జీవములోనికి విజయవంతంగా దాటుతున్నాయి. అనేకులను దాటించుటలో పేరొందిన గొప్ప సువార్త పరిచర్యను అవి నిరంతరాయంగా చేస్తూ వారివలె ముందుకు కొనసాగిస్తూ విధేయంగా ఎంతో శ్రమిస్తున్నాయి. దేవదేవుడు తనదైన బలాతిశయం చేత యేసును మృతులలో నుండి లేపాడు అన్నదే నేటి పునరుత్థాన దినం. ఇదే క్రైస్తవ నిరీక్షణ జీవితానికి గొప్పదైన పునాది. సమభావపు ఏకత్వం కలిగించే ఒక్కటే నిరీక్షణయందుండుటకు పిలువబడిన వారు ధన్యులు అంటుంది గ్రంథము.
‘‘నా మాట విని నన్ను పంపిన వానియందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు. వాడు తీర్పులోనికి రాక ‘మరణములో నుండి జీవము లోనికి’ దాటి యున్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను’’
– యేసుక్రీస్తు
– జేతమ్


