Earth Overshoot Day: Know History And Significance Of The Day - Sakshi
Sakshi News home page

అమెరికన్లలా జీవిస్తే 5 భూగోళాలు కావాలి..ఇక ‘పర్యావరణ లోటు బడ్జెటే’ దిక్కు!

Aug 2 2023 6:52 PM | Updated on Aug 2 2023 8:33 PM

Earth Overshoot Day: Know History And Significance Of The Day - Sakshi

ఆర్థిక వనరులకు సంబంధించి వార్షిక బడ్జెట్లు, లోటు బడ్జెట్లు, అప్పులు ఉంటాయని మనకు తెలుసు. అయితే, పర్యావరణ వనరులకు కూడా బడ్జెట్టు ఉంటుందని మీకు తెలుసా? 

గ్లోబల్‌ ఫుట్‌ప్రింట్‌ నెట్‌వర్క్‌ తాజా అంచనా ప్రకారం.. ప్రపంచ దేశాల పర్యావరణ బడ్జెట్టు ఈ ఏడాదికి ఆగస్టు 2 నాటితో పూర్తిగా ఖర్చయిపోయింది. దీన్నే ‘వరల్డ్‌ ఎర్త్‌ ఆఫ్‌షూట్‌ డే’ అని పిలుస్తున్నారు. 

అంటే.. భూగోళానికున్న జీవశక్తి పరిమితి(బయోకెపాసిటీ) అంత వరకే. నేటి (ఆగస్టు 3) నుంచి ప్రపంచ ప్రజలు వాడేదంతా భూమాత తన మూలుగను కరిగించుకుంటూ కనాకష్టంగా సమకూర్చే అప్పు మాత్రమే. 

గత ఏడాది ఆగస్టు 1తోనే బడ్జెట్‌ అయిపోయింది. కొద్దోగొప్పో పర్యావరణ స్పృహ పెరిగింది కాబట్టి, డెడ్‌లైన్‌ ఈ ఏడాది ఒక్క రోజు వెనక్కి జరిగిందన్న మాట. 

1.75 భూగోళాలు కావాలి
ప్రపంచ దేశాలన్నీ కలిసి ఇప్పుడు 175% మేరకు ప్రకృతి వనరులు వాడేస్తున్నాయి. అంటే.. మనకు అవసరమైన వనరులు సునాయాసంగా సమకూర్చాలంటే 1.75 భూగోళాలు కావాలన్నమాట. 

పర్యావరణ బడ్జెట్‌ 1971 వరకు భూగోళం ఇవ్వగలిగే పరిమితులకు లోబడి ఉండేదట. అంటే, 365 రోజులూ లోటు లేకుండా ఉండేదని గ్లోబల్‌ ఫుట్‌ప్రింట్‌ నెట్‌వర్క్‌ అంచనా వేసింది. ఆ తర్వాత నుంచి క్రమంగా ప్రపంచవ్యాప్తంగా జనాభా పెరగడంతో పాటు వినియోగంలో విపరీత పోకడల వల్ల భూగోళంపై వత్తిడి పెరిగిపోయింది. 

అమెరికన్లలా జీవిస్తే 5 భూగోళాలు కావాలి
ప్రకృతి వనరుల వినియోగం అన్ని దేశాల్లో ఒకేలా ఉండదు. సంపన్న దేశాలు ఎక్కువ వనరులను ఖర్చు చేస్తున్నాయి. ఉదాహరణకు.. అమెరికా వాసుల మాదిరిగా ప్రకృతి వనరులను వాడితే 5.1 భూగోళాలు పర్యావరణ సేవలు మనకు అవసరమవుతాయి. చైనీయుల్లా జీవిస్తే 2.4 భూగోళాలు కావాలి. 
అయితే, మన సంతోషించదగిన విషయం ఏమిటంటే.. ప్రపంచ పౌరులందరూ భారతీయుల్లా జీవిస్తే 0.8 భూగోళం చాలు. అంటే.. పర్యావరణ బడ్జెట్టు 20% మిగులులోనే ఉందన్న మాట.

ఖతర్‌ బడ్జెట్‌ ఫిబ్రవరి 10నే ఖతం!
ప్రపంచవ్యాప్తంగా సగటున తలసరి వార్షిక పర్యావరణ వనరుల లభ్యత (బయోకెపాసిటీ) 1.6 గ్లోబల్‌ హెక్టార్లు (బయోకెపాసిటీని, ఫుట్‌ప్రింట్‌ని ‘గ్లోబల్‌ హెక్టార్ల’లో కొలుస్తారు). దీనికన్నా ఎక్కువ ఖర్చు (ఫుట్‌ప్రింట్‌) ఎక్కువగా ఉంటే పర్యావరణ బడ్జెట్‌ అంత తక్కువ రోజుల్లోనే అయిపోతుంది. ఇది ఒక్కో దేశంలో ఒక్కోలా ఉంటుంది. ఉదాహరణకు భారత్‌లో తలసరి వార్షిక పర్యావరణ బడ్జెట్‌ 1.04 గ్లోబల్‌ హెక్టార్లు. లభ్యత కన్నా ఖర్చు తక్కువగా ఉంది కాబట్టి.. మనం 20% మిగులు బడ్జెట్‌లోనే ఉన్నాం. అందువల్లనే కంట్రీ ఓవర్‌షూట్‌ డేస్‌ జాబితాలో మన దేశం పేరు ఉండదు. 
అత్యంత సంపన్న ఎడారి దేశం ఖతర్‌ పర్యావరణ బడ్జెట్‌ ఫిబ్రవరి 10నే అయిపోయింది. కెనడా, యుఎఈ, అమెరికాల బడ్జెట్‌ మార్చి 13తో సరి. మే 1న చైనా, ఆగస్టు 12న బ్రెజిల్‌.. డిసెంబర్‌ 20న జమైకా బడ్జెట్లు ఖర్చయిపోతున్నాయి. 

ప్రకృతి వైపరీత్యాలన్నీ ఇందుకే..
వనరులు సమకూర్చే శక్తి భూగోళానికి లేకపోయినా మనం వాడుకుంటూనే ఉన్నాం కాబట్టి భూగోళం అతలాకుతలమైపోతోంది. ఎన్నడూ ఎరుగనంత ఉష్ణోగ్రతలు, కుండపోత వార్షాలు, కరవు కాటకాలు.. ఈ ప్రకృతి వైపరీత్యాలన్నీ మనం అతిగా కొల్లగొడుతున్న దాని ఫలితమే. 

ఏం చేద్దాం..?
పర్యావరణ లోటు బడ్జెట్టుతో అల్లాడుతున్న భూగోళాన్ని స్థిమితపరిచి మన భవిష్యత్తును బాగు చేసుకోవాలంటే.. అంటే.. పర్యావరణ బడ్జెట్టు 365 రోజులూ సరిపోవాలంటే.. మానవాళి మూకుమ్మడిగా జీవన విధానాన్ని మార్చుకోవాలి. వనరులను పొదుపుగా వాడాలి. 
ముఖ్యంగా ఐదు పనులు చేయాలి.. పర్యావరణ హితమైన ఇంధనాలు వాడాలి. ఆహారోత్పత్తి పద్ధతులను పర్యావరణ హితంగా మార్చుకోవాలి. నగరాల నిర్వహణలో ఉద్గారాలు, కాలుష్యం తగ్గించుకోవాలి. భూగోళంపై ప్రకృతి వనరులకు హాని కలిగించని రీతిలో పారిశ్రామిక కార్యక్రమాలు చేపట్టాలి. అన్నిటికీ మించి, జనాభా పెరుగుదలను అదుపులో ఉంచుకోవాలి.
– పంతంగి రాంబాబు, సీనియర్‌ న్యూస్‌ ఎడిటర్, సాక్షి సాగుబడి డెస్క్‌
prambabu.35@gmail.com     

 

Advertisement
 
Advertisement
Advertisement