నాటి దుశ్చర్యలో వెలుగుచూడని నిజాలెన్నో..

Dr Goparaju Narayanarao Kalarekhalu Story In Funday Magazine - Sakshi

జలియన్‌వాలా బాగ్‌ సభ మీద 1919 ఏప్రిల్‌ 13న జనరల్‌ డయ్యర్‌ పేల్చిన తూటాలు 1,650. అక్కడకి 31 మైళ్ల దూరంలో ఉన్న లాహోర్‌లో 1940 మార్చి 19న ఊరేగింపుగా వెళుతున్న ఒక సమూహం మీద  డిప్యూటీ పోలీసు సూపరింటెండెంట్‌ పీసీడీ బీటీ ఆదేశాల మేరకు పోలీసులు కాల్చినవి 1,620. ముప్పయి మంది చనిపోయారని ప్రభుత్వం ప్రకటించింది. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం 200 మంది చనిపోయారు, ఛిద్రమైన శవాలను ట్రక్కుల్లోకి విసిరి తీసుకుపోయారు. నిర్బంధాలను ఎత్తివేయాలని కోరుతూ శాంతియుతంగా ప్రదర్శన జరుపుతున్న ఖక్సర్‌ తెహ్రీక్‌ కార్యకర్తలపై 1,620 తూటాలు కాల్చినట్టు అక్కడి పోలీస్‌ స్టేషన్‌ గుమాస్తా (మొహరీర్‌) నమోదు చేశాడు. కాల్పుల వార్తను ప్రపంచ పత్రికలు ప్రచురించాయి. సర్‌ డగ్లస్‌ యంగ్‌ అధ్యక్షునిగా హైకోర్టు న్యాయమూర్తులతో దర్యాప్తు సంఘం నియమించారు కూడా. కానీ నివేదిక వెలుగు చూడలేదు. ఇంతకీ ఏమిటీ ఖక్సర్‌ తెహ్రీక్‌? 

భారత స్వాతంత్య్ర సమరంలో జాతీయ కాంగ్రెస్, ముస్లింలీగ్, గదర్‌ పార్టీ, హిందూ మహాసభ, స్వరాజ్య పార్టీ హిందుస్తాన్‌ సోషలిస్ట్‌ రిపబ్లికన్‌ ఆర్మీ వంటివెన్నో కనిపిస్తాయి. అలాంటిదే ఖక్సర్‌ తెహ్రీక్‌. ఖక్సర్‌ అంటే అర్థం అణకువ కలిగినవాడు. నలభై లక్షల సభ్యత్వంతో (1942 నాటికి), దేశంలోను, విదేశాలలో కూడా శాఖలు నెలకొల్పింది. దీని మీద భయంకరమైన నిర్బంధం ఉండేది. బ్రిటిష్‌ ప్రభుత్వం అణచివేతే కాదు, మహమ్మద్‌ అలీ జిన్నా నాయకత్వంలోని అఖిల భారతీయ ముస్లిం లీగ్‌ కూడా ఖక్సర్‌ను పరమ శత్రువులాగే చూసింది. ఎంత శత్రుత్వం అంటే, 1943 జూలై 20న బొంబాయిలో జిన్నా మీద ఆయన ఇంట్లోనే హత్యాయత్నం జరిగింది. ఆ పని చేసిన రఫీక్‌ సాబిర్‌ ఖక్సర్‌ సభ్యుడని అనుమానించారు. పంజాబ్‌ ప్రీమియర్, ముస్లింలీగ్‌ ప్రముఖుడు సర్‌ సికిందర్‌ హయత్‌ఖాన్‌ కూడా ఖక్సర్‌ మీద కక్ష కట్టాడు. 

స్వరాజ్య ఉద్యమం దేనికి? బ్రిటిష్‌ పాలన అంతానికి! ఈ విషయం మీద ఉన్న స్పష్టత స్వతంత్ర భారత ప్రభుత్వం గురించి ఎక్కువమందికి లేదంటే అతిశయోక్తి కాదు. ఆ విషయం ఆలోచించిన సంస్థ ఖక్సర్‌. హిందూముస్లిం ప్రభుత్వమే స్వతంత్ర భారత్‌ను పాలించాలన్నది సంస్థ ఆశయాలలో ఒకటి. 1936 నవంబర్‌ 29న సియాల్‌కోట్‌లో నిర్వహించిన సమావేశంలో ఒక ప్రణాళికను రూపొందించుకుంది (మష్రికి మనుమడు నాసివ్‌ు యూసఫ్‌ సేకరించిన వివరాలు, ఇతర చరిత్రకారులు సేకరించిన విషయాలు ఎన్నో).

దైవం ఆధిపత్యాన్ని అంగీకరించడం, జాతీయ సమైక్యత, మానవ సేవ వంటి సిద్ధాంతాలను ఖక్సర్‌ స్వీకరించింది. సమాజంలోని అంతరాలను సరిచేయడమనే సంస్థ సూత్రాన్ని గౌరవిస్తూ పారను చిహ్నంగా తీసుకుంది. ఎక్కువ ముస్లిం సిద్ధాంతాల ఛాయలు ఉన్నా, ఖక్సర్‌లో సభ్యుడు కావడానికి మతం, ప్రాంతం, కులం, వర్ణం అడ్డు కాలేదు. కానీ వేయేళ్లు ఈ దేశాన్ని పాలించిన ముస్లింల పూర్వ వైభవం ఖక్సర్‌ ఆశయాలలో ఒకటన్నది నిజం. ఖక్సర్‌ దేశ విభజనను వ్యతిరేకించింది. అందుకే అఖండ భారత్‌ కోసం, విభజనను నిరోధించడానికి చివరి యత్నంగా 1946లో ఒక రాజ్యాంగాన్ని కూడా తెచ్చింది. మొత్తం 17 ఏళ్ల పాటు స్వాతంత్య్ర సమరంలో ఈ సంస్థ పాల్గొన్నది.

లాహోర్‌ కేంద్రంగా ఉద్యమించిన ఖక్సర్‌ తెహ్రీక్‌ను 1931లో అల్లామా ఇనాయతుల్లా అల్‌ మష్రికి (25 ఆగస్ట్‌ 1888– 27 ఆగస్ట్‌ 1963) స్థాపించాడు. సంస్థ నిబంధనలకు కచ్చితంగా లోబడి ఉండడమే కాదు, సభ్యులు ఉద్యమానికి సమయం ఇవ్వడంతో పాటు, దేశం కోసం ఎవరి వ్యయం వారే భరించాలి. అచ్చంగా బ్రిటిష్‌ పోలీసుల యూనిఫామ్‌ను పోలి ఉన్న దుస్తులు ధరించేవారు. దాని మీద సోదరత్వం అన్న నినాదం (ఉఖూవ్వాత్‌) ఉండేది. నాయకుడు సహా అంతా ఇదే ధరించేవారు. మష్రికి అనేకసార్లు కారాగారం అనుభవించాడు. 1942 జనవరి 19న వెల్లూరు జైలు నుంచి విడుదలచేసి... మద్రాస్‌ ప్రెసిడెన్సీ దాటకూడదని ఆంక్షలు పెట్టారు. సంస్కరణ, వ్యక్తి నిర్మాణం, దేశం కోసం త్యాగం ఖక్సర్‌ ఆశయాలు. ఇరుగు పొరుగులకు సేవ  కార్యక్రమంలో అంతర్భాగం. ఇక్కడ ముస్లింలు, ముస్లిమేతరులు అన్న భేదం లేదు. పరిసరాలను శుభ్రం చేస్తూ, పేదలు, వృద్ధులు, రోగులకు సేవలు అందించాలి. 

మష్రికి ఇస్లామిక్‌ పండితుడు, మేధావిగా గుర్తింపు పొందాడు. అమృత్‌సర్‌కు చెందిన ముస్లిం రాజ్‌పుత్‌ కుటుంబంలో పుట్టిన మష్రికి కేంబ్రిడ్జ్‌ నుంచి గణితశాస్త్ర పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌. 1912లో స్వదేశం వచ్చి 25 ఏళ్లకే కళాశాల ప్రిన్సిపాల్‌ అయ్యాడు. 29 ఏళ్లకి విద్యాశాఖ అండర్‌ సెక్రటరీ అయ్యాడు. మొగల్‌ దర్బార్‌లో కీలక పదవులు అనుభవించిన కుటుంబం వారిది. తండ్రి ఖాన్‌ అటా మహ్మద్‌ ఖాన్‌ న్యాయవాది. ‘వకీల్‌’ అనే పక్షపత్రిక నడిపేవారు. కాంగ్రెస్‌ స్థాపన సమయంలో దేశంలో ఎంతో ఖ్యాతి వహించిన సర్‌ సయ్యద్‌ అహ్మద్‌ ఖాన్‌ వంటివారికి అటా ఖాన్‌ సన్నిహితుడు. వీటన్నింటికీ మించి ఖురాన్‌కు మష్రికి రాసిన వ్యాఖ్యానం (తాజ్‌కిరా) నోబెల్‌ సాహిత్య బహుమానం పరిశీలనకు పంపారు. తత్త్వశాస్త్రం మీద కొన్ని రచనలు చేశాడు.  

మష్రికి 1939లో బ్రిటిష్‌ ప్రభుత్వానికి తుది హెచ్చరికలు చేయడం ఆరంభించాడు. సంవత్సరంలోనే ఖక్సర్‌ తన లక్ష్యాన్ని చేరుకుంటుందని ప్రకటించాడు. అలా జరగకపోతే సంస్థను రద్దు చేస్తానని ప్రతిజ్ఞ చేశాడు. మరొక రెండున్నర లక్షలమందిని సభ్యులుగా చేర్చాలని అనుచరులను ఆదేశించాడు. ఖక్సర్‌ ప్రమాదకరంగా తయారైందని 1939లోనే పంజాబ్‌ గవర్నర్‌ హెన్రీ డఫీల్డ్‌ వైస్రాయ్‌ లిన్‌లిత్‌గోకు ఇచ్చిన నివేదికలో వెల్లడించాడు. ఇలాంటి నివేదికే మధ్య పరగణాల నుంచి కూడా వెళ్లింది. ఒకసారి ఢిల్లీలో మాట్లాడిన తరువాత మష్రికి మీద జిన్నా తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. మష్రికి ఒక ఉన్మాది అని వ్యాఖ్యానించాడు. ఇదే బ్రిటిష్‌ ప్రభుత్వానికి ఉపకరించింది. మరింత కర్కశంగా వ్యవహరించడం మొదలుపెట్టింది.

నాటి పంజాబ్‌ ప్రీమియర్‌ హయత్‌ఖాన్, ‘రెండు రోజులలోనే ఖక్సర్‌ పనిపడతానని’ చెప్పాడని మష్రికి అనుచరుడు రజా షేర్‌ జమీన్‌ తన పుస్తకంలో నమోదు చేశాడు. రెండో ప్రపంచ యద్ధంలో పరిస్థితులను బట్టి భారత్‌లో తలనొప్పులు లేకుండా చేసుకోవడానికి హయత్‌ఖాన్‌కు ఖక్సర్‌ అణచివేతకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. దీనితోనే సంస్థ నిషేధానికి ఎత్తులు మొదలయినాయి. దుష్ప్రచారమూ మొదలయింది. జర్మనీ నాజీలతో ఖక్సర్‌కు సంబంధాలు ఉన్నాయని ‘ది ట్రిబ్యూన్‌’ పత్రికలో ఒక వ్యాసం వెలువడింది. పంజాబ్‌ అసెంబ్లీలో కూడా పథకం ప్రకారం సభ్యులు ప్రశ్నలు లేవనెత్తారు.

ఖక్సర్‌ ఉద్యమంలో మతోన్మాదమే ఉందని హయత్‌ఖాన్‌ సమాధానం ఇచ్చాడు. నిజానికి అందులో ముస్లింలు, హిందువులు, సిక్కులు కూడా ఉన్నారు. అప్పుడే లాహోర్‌లో 1940 మార్చి 19న ఖక్సర్‌ ప్రదర్శన మీద కాల్పులు జరిగాయి. ఆ రోజే నిషేధించారు.లాహోర్‌ ప్రదర్శన మీద కాల్పులు, జిన్నా మీద హత్యాయత్నం రెండూ పథకం ప్రకారం జరిగినవేననీ, వాటి వెనుక, బ్రిటిష్‌ ప్రభుత్వం, జిన్నా ఉన్నారంటూ మష్రికి 1943లో పత్రికా ప్రకటన ఇచ్చాడు. ఒక దశలో జిన్నా రాజకీయంగా బలహీనపడినప్పుడు ఖక్సర్‌ సభ్యులు లీగ్‌ జెండా కిందకు రావాలని ఆశించాడని చెబుతారు. 

1947 జూలై 4న సంస్థను మష్రికి రద్దు చేశాడు. అయినా అతడి మరణానంతరం పాకిస్తాన్‌లో దానిని పునరుద్ధరించారు. 

- డా. గోపరాజు నారాయణరావు

చదవండి: 900 యేళ్లనాటి ఈ గ్రామానికి రెండే ద్వారాలు... కారణం అదేనట..

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top