కెరీర్‌ లెక్కల్లోనైనా 'మా సారు'...తగ్గేదే లే! | Director sukumar unconditional love on Buchibabu Sana On teachers day | Sakshi
Sakshi News home page

కెరీర్‌ లెక్కల్లోనైనా 'మా సారు'...తగ్గేదే లే!

Sep 5 2025 5:57 AM | Updated on Sep 5 2025 6:03 AM

Director sukumar unconditional love on Buchibabu Sana On teachers day

మాస్టారు లెక్కలు చెబితే మనసుకి బాగా ఎక్కింది... అభిమానం అనే లెక్క పెరిగింది. ఆ లెక్క చదువుకే పరిమితం కాలేదు. కెరీర్‌ లెక్కలు చూసేవరకూ తెచ్చింది. ఓ లెక్కల మాస్టారు ఓ కుర్రాడి జీవితాన్ని అంతగా ప్రభావితం చేశారు.  సినిమా ఇండస్ట్రీలో రికార్డు స్థాయి వసూళ్లు లెక్కలు చూస్తున్న డైరెక్టర్‌ సుకుమార్‌  తన శిష్యుడు బుచ్చిబాబు సానాకి కాలేజీలో లెక్కల పాఠాలు చెప్పి, డైరెక్టర్‌ని చేసి,  కెరీర్‌ వసూళ్ల లెక్కలు చూసుకునేవరకూ అండగా ఉన్నారు. ‘ఎప్పటికీ ఉంటారు’  అని శిష్యుడు అంటున్నారు. టీచర్స్‌ డే సందర్భంగా ‘ఉప్పెన’ ఫేమ్‌  డైరెక్టర్‌ బుచ్చిబాబు సానా తన గురువు సుకుమార్‌ గురించి  ‘సాక్షి’కి ఇచ్చిన ఎక్స్‌క్లూజివ్‌ ఇంటర్వ్యూ...

→ ముందుగా ఇంటర్మీడియట్‌ చదువుకున్నప్పుడు మీ గురువుకి సంబంధించిన జ్ఞాపకాలను షేర్‌ చేసుకుంటారా? 
బుచ్చిబాబు: ఆ రోజుల్లో సుకుమార్‌ సార్‌ నాలా బక్క పలచగా ఉండేవారు. తెల్లగా షార్ప్‌ మీసాలతో హ్యాండ్స్‌ వరకూ బటన్స్‌ పెట్టి, ఫుల్‌ హ్యాండ్స్‌ చొక్కాలో నీట్‌గా వచ్చేవారు. ఆయన చిరంజీవిగారి ఫ్యాన్‌ అని తెలిశాక మా సీనియర్స్‌ అందరూ ఓ 40, 50 మంది సుకుమార్‌ సార్‌ వస్తుంటే ‘మాస్టర్‌’ సినిమాలో ‘హే జు హే జు’ అని బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ కొట్టేవారు. ఆయన మురిసి΄ోయేవారు. సుకుమార్‌ సార్‌ చిరంజీవిగారి ఫ్యాన్‌ అయితే మేము సుకుమార్‌ సార్‌ ఫ్యాన్స్‌.  

→ మీరు లెక్కల మాస్టారుకే కనెక్ట్‌ అవ్వడానికి కారణం? 
స్టూడెంట్స్‌ లెక్కలకు కనెక్ట్‌ అవ్వడం రేర్‌. అలాంటిది లెక్కల మాస్టార్‌కి ఎందుకు కనెక్ట్‌ అవుతాం? అయినా ఆయనకి కనెక్ట్‌ అయ్యాం. ఎందుకంటే లెక్కలు కూడా సార్‌ అందంగా చెప్పేవారు. తెలుగు పాఠంలా విడదీసి అర్థమయ్యేలా చెప్పేవారు. సూత్రాల్ని కూడా సులువుగా చెప్పడం మా మాస్టార్‌ ప్రత్యేకత. అప్పుడు లెక్కలు చెప్పడంలో తగ్గలే. ఇప్పుడు కెరీర్‌ లెక్కల్లోనూ మా సారు తగ్గేదే లే! 

→ చదువుకునే రోజుల్లో మీ గురువుకి ఏదైనా బహుమతి ఇచ్చారా? 
నేను ఇవ్వలేదు గానీ, ఆయనే మాకు సినిమాలకి వెళ్ళమని డబ్బులిచ్చేవారు. కానీ ‘నా క్లాస్‌ వినేసి వెళ్ళండి’ అని కండీషన్‌ పెట్టేవారు. 

→ ఓ శిష్యుడిగా మీ గురువుకి బహుమతి ఇవాల్సి వస్తే ఏం ఇస్తారు? 
మా బంధం లైఫ్‌ లాంగ్‌ ఉండాలనుకుంటున్నాను. అందుకే లైఫ్‌ లాంగ్‌ నేను చేసే ప్రతీ సినిమాకి ‘సుకుమార్‌ రైటింగ్స్‌ బేనర్‌’ ఉంటుంది. ఓ శిష్యుడిగా నేను ఆయనకిచ్చే గిఫ్ట్‌ ఇదే అనుకుంటున్నాను. 

→ మీ కెరీర్‌ మొదలయ్యాక మీ గురువు మీకు ఇచ్చిన బహుమతులేమైనా?  
‘ఉప్పెన’ సినిమా అయ్యాక ఆయన ఒక లెటర్‌ రాశారు. నేను ΄÷ద్దున నిద్ర లేచి చూస్తే సుకుమార్‌ సార్‌ లెటర్‌ రాశారు అని సోషల్‌ మీడియాలో సర్క్యులేట్‌ అవుతోంది. ఫేక్‌ అనుకుని నమ్మలేదు. అయితే సుకుమార్‌ సార్‌ పక్కన ఉన్నవాళ్ళు చెప్తే నమ్మాను. ఆ లెటర్‌ నా గురువుగారు నా లైఫ్‌లో నాకు ఇచ్చిన మర్చి΄ోలేని బహుమతి.

→ లైఫ్‌లో కీలక మెట్లు అయిన చదువు, ఆ తర్వాత కెరీర్‌... ఈ రెండింటిలోనూ సుకుమార్‌గారితో మీకు కనెక్షన్‌ ఉంది. మీ ఇద్దరికీ అంత సింక్‌ కుదరడానికి కారణం? 
నేను ఇంటర్మీడియట్‌ అంటే... నా నూనూగు మీసాల వయసు నుండీ ఆయన తెలుసు నాకు. యవ్వనంలో ప్రతి ఒక్కరికీ ఒక రోల్‌ మోడల్‌ ఉంటారు కదా. నా రోల్‌ మోడల్‌ సుకుమార్‌ సారే. నాకు టెన్త్‌ వరకూ రోల్‌ మోడల్‌ ఎవరూ లేరు. ఇంటర్మీడియట్‌కి వెళ్ళిన దగ్గర నుండీ ‘సుకుమార్‌ సార్‌ నా రోల్‌ మోడల్‌’ అని చెప్పడం మొదలెట్టాను. నేను ఆయన్ని అంత ఇన్‌స్పిరేషన్‌గా తీసుకున్నాను. మా ఫ్రెండ్స్‌ ‘ఒరేయ్‌ సుకుమార్‌లా మాట్లాడుతున్నావ్‌.. ఆలోచిస్తున్నావ్‌’ అంటారు. నా లోపలకి ఆయన్ని అంత గట్టిగా తీసేసుకున్నాను. 

→ ఓ గురువుగా కెరీర్‌ గురించి మీకు ఆయన ఎలాంటి సలహాలు ఇస్తుంటారు? 
ఈ కెరీరే ఆయన సలహా. ఆయన పరిచయం కాక΄ోతే, నా క్లాస్‌కి ఆయన లెక్కలు మాస్టారు కాక΄ోయి ఉంటే నేను సినిమా వైపు వచ్చి ఉండేవాణ్ణే కాదు.  

→ సుకుమార్‌గారు కాకుండా మీరు అభిమానించే గురువులు ఎవరైనా ఉన్నారా? 
గరికిపాటి నరసింహారావుగారు కూడా నా గురువుగారే. కాకినాడ చైతన్య కాలేజ్‌లో బీఎస్సీ కంప్యూటర్స్‌ చదువుకునేటప్పుడు సంస్కృతం చెప్పేవారు. ఆయన పాఠాలు చెప్పే విధానం చమత్కారంగా ఉండేది. ఒకసారి రాజు అని నా స్నేహితుడు క్లాస్‌కి లేట్‌గా వచ్చి, ‘మే ఐ కమ్‌ ఇన్‌ సార్‌’  అన్నాడు. గరికిపాటిగారు ‘తమరి నామధేయం ఏంటో’ అని అడిగారు. 

వాడు రాజా అనగానే ‘ఏ రాజ్యానికో’ అని వెంటనే సెటైర్‌ వేశారు. వాడు క్లాస్‌ వింటూ నెత్తి మీద టోపీ తీయలేదు. ‘రాజువారు తమరి కిరీటం తియ్యాలి’ అన్నారు. ఆయన అంత చమత్కారంగా ఉండేవారు. పాఠాలను కూడా ప్రవచనాల్లా చెప్పేవారు. ఆయన చెప్పిన సంస్కృతంలోనే నాకు ఎక్కువ మార్కులు వచ్చాయి. ఇలాంటి గురువులు దొరకడం నా అదృష్టం. సినిమాలో ఒకరు, సాహిత్యంలో ఒకరు... నన్ను అమితంగా ప్రభావితం చేసిన ఇద్దరూ గొప్ప వ్యక్తులు. 

→ సుకుమార్‌ గారు, మీ మధ్య ఏమైనా చిన్ని చిన్ని మనస్పర్థలు వచ్చినప్పుడు ఎవరు ముందుగా మాట్లాడేవాళ్లు? 
‘మనం తప్పు చేశాం... ఆయన తిట్టారు. ఫోన్‌ చేసి మాట్లాడదాం’ అని ఫోన్‌ తీసేలోపే ఆయన మెసేజ్‌ ఉండేది. ‘సారీ రా ఏమనుకోకు, ఏదో మాటనేశా’ అని అంటారు. మా గురువుగారు ఎదుటోడు ఎంత పెద్ద తప్పు చేసినా ‘క్షమించడం’లో ముందుంటారు. 

→ మీ జీవితంలో మీ గురువుగారి పాత్ర అంటే... ఏం చెబుతారు? 
వ్యక్తిగా బుచ్చిబాబు సానాకి అయితే ఏం సంబంధం లేదు గానీ డైరెక్టర్‌ బుచ్చిబాబు సానా అయితే మాత్రం  మొత్తం మా గురువుగారి పాత్రే. 

→ క్లాస్‌ రూమ్‌లో మీ మాస్టారు ఎలా ఉండేవారు? 
బ్లాక్‌ బోర్డ్‌ మీద ఒక లెక్క రాసి, అది మాకు ఎక్స్‌ప్లెయిన్‌ చేశాక ‘ఎనీ డౌట్స్‌’  అని చిటికేసి గట్టిగా అరిచి, అడిగేవారు. అలా ఆ మాటతో పక్కకి ΄ోయిన మా బ్రెయిన్స్‌ని కూడా లోపలికి తీసుకొచ్చేసేవారు (నవ్వుతూ).

→ సుకుమార్‌గారు మిమ్మల్ని ఎలా పిలుస్తారు?
నన్ను ఒరేయ్‌ అనే పిలుస్తారు...అంత క్లోజ్‌ అయితే తప్ప ఒరేయ్‌ అని పిలవరు ఎవర్నీ. నాకు ఒరేయ్‌ అని పిలిపించుకోవడం అమితమైన ఆనందాన్నిస్తుంది.

→ గురువుని మించిన శిష్యుడు అనిపించు కోవాలనుకుంటున్నారా? 
గురువుని మించిన కాదు గానీ గురువు మెచ్చిన శిష్యుడు అవ్వాలనే కోరిక మాత్రం ఎప్పుడూ ఉంటుంది.

 – డి.జి. భవాని

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement