
మెగా హీరో రామ్ చరణ్ నటిస్తోన్న స్పోర్ట్స్ డ్రామా పెద్ది. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సనా దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రంపై మెగా ఫ్యాన్స్‌లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం చెర్రీ సరసన బాలీవుడ్ భామ, దేవర బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా మెప్పించనుంది. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు.
అయితే ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ పుణెలో జరుగుతోంది. ఈ షెడ్యూల్‌లో ఓ బ్యూటీఫుల్ సాంగ్‌ను తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ సాంగ్ షూటింగ్‌కు సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. పర్వత ప్రాంతంలో రామ్ చరణ్ స్టెప్పులు వేస్తోన్న వీడియో సోషల్ మీడియాలో లీక్ అయింది. చెర్రీ ఓ రాయిపై నిలబడి డ్యాన్స్ చేయడంపై డేరింగ్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. రామ్ చరణ్ డేరింగ్ డ్యాన్స్ అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. అయితే సాంగ్ షూట్ సీన్ లీక్ కావడం టాలీవుడ్‌లో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
ఈ పాటకు ఏఆర్ రెహమాన్ సంగీతమందిస్తుండగా.. జానీ మాస్టర్ కొరియోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే ఈ పాట విజువల్ ట్రీట్‌గా ఉంటుందని చిత్రబృందం పేర్కొన్న సంగతి తెలిసిందే. అందుకే పర్వత ప్రాంతాల్లోనే షూటింగ్ జరుగుతున్నట్లు తెలుస్తోంది. దాదాపు 60 శాతం షూటింగ్ పూర్తయిన ఈ సినిమా వచ్చే ఏడాది మార్చి 27న విడుదల కానుంది.