బ్రౌన్‌ స్కిన్‌ బార్బీ.. భారతీయ మహిళ ఆహార్యంలో..! | Sakshi
Sakshi News home page

బ్రౌన్‌ స్కిన్‌ బార్బీ.. భారతీయ మహిళ ఆహార్యంలో..!

Published Sat, Jul 9 2022 9:29 AM

Deepika Muthyala Indian Skin Tone Barbie - Sakshi

‘బ్రౌన్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌’ అనే పదాన్ని ఇప్పుడు ప్రపంచమంతా గుర్తిస్తుంది. బ్రౌన్‌ స్కిన్‌ మేకప్‌ను ప్రాచుర్యంలోకి తేవడానికి దక్షిణాసియా బార్బీ డాల్‌ అమెరికన్‌ సీఇవో దీపికా ముత్యాల ఫస్ట్‌ ఇండియన్‌ స్కిన్‌టోన్‌ బార్బీని ఆవిష్కరించి తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును పొందింది. మహిళల హిస్టరీ మంత్‌ వేడుకలో భాగంగా ఈ యేడాది మార్చిలో తన బ్యూటీ బ్రాండ్‌ను ఆవిష్కరిస్తూ చూపిన ఈ రూపం ఇప్పటికీ ప్రజల నుంచి విశేష స్పందన అందుకుంటోంది.  

బార్బీ అనగానే తెల్లగా, నీలికళ్లతో ఉండే నాజూకైన రూపంతో ఉండే బొమ్మ మన మనసులో కదలాడుతుంది. ‘ఈ బార్బీని చూడండి. ఆమె చర్మం ముదురు గోధుమ రంగు, ఆమె కళ్లు పెద్దవి, వెడల్పాటి కనుబొమ్మలు, జూకాలు, గాజులు ధరించి పవర్‌సూట్‌తో సగర్వంగా ఉంటుంది. ఆమె ఈ ప్రపంచ సవాళ్లను తీసుకోవడానికి సిద్ధంగా ఉంది. ఇది ఆమె గుర్తింపు. ఆమె సాంస్కృతిక అడ్డంకులను విచ్ఛిన్నం చేస్తుంది. ఉన్నత లక్ష్యాలు, సానుభూతి, దయతో ఈ ప్రపంచాన్ని నడిపిస్తుంది’ అంటూ నేటి ఆధునిక భారతీయ మహిళ ఆహార్యాన్ని ఈ కొత్త బార్బీ రూపంలో తన ఇన్‌స్టాగ్రామ్‌ పేజీ ద్వారా పరిచయం చేసింది. దీనికి వ్యూవర్స్‌ నుంచి ఎన్నో ప్రశంసలు అందుతున్నాయి. ఇప్పుడు దీపికను అంతా ‘బ్రౌన్‌ బ్యూటీ ఇన్‌ఫ్లుయెన్సర్‌’ అని పిలుస్తున్నారు.  

దక్షిణాసియా సమాజంలోని చర్మ రంగులను, విదేశాల్లో ఉన్న బ్యూటీ ప్రమాణాలను రెండింటినీ అంచనా వేసిన దీపికా ఈ రంగంలో ఏదైనా కొత్తదనం తీసుకురావాలనుకుంది. తన చిన్నతనంలో నీలిరంగు కళ్లతో తెల్లగా ఉండే బార్బీని గుర్తుచేసుకుంది. ఈ బొమ్మకు భారతీయ శైలికి తగినవిధంగా రూపొందించాలనుకుంది. అందుకు బొమ్మ రంగును ముదురు గోధుమ వర్ణంలో తీర్చింది. దీపికా ముత్యాల బ్రౌన్‌ స్కిన్‌ మేకప్‌ని ప్రాచుర్యంలోకి తెచ్చిన లైవ్‌ టిండెడ్‌ బ్యూటీ బ్రాండ్‌ ఫౌండర్‌ కూడా. ‘ప్రజలు ఈ బొమ్మను తమదిగా చేసుకోవడానికి, అలాగే ముదురు గోధుమ రంగుకు ఉన్న ప్రాధాన్యతను ప్రపంచం ముందుంచడానికి చేసిన ప్రయత్నం ఇది’ అని చెబుతుంది ఈమె.

నిజానికి చాలా బ్యూటీ ప్రొడక్ట్‌లు రంగులను దృష్టిలో ఉంచుకుని తయారు చేయరు. ఈ విషయాన్ని స్పష్టం చేస్తూ 2015లో ముదురు గోధుమ రంగు చర్మంపై పై బ్యూటీ ఉత్పత్తులను ఎలా ఉపయోగించాలో చెబుతూ ఆమె చేసిన వీడియో వైరల్‌ అయ్యింది. 2018లో ఈ విభాగంలోనే ఆన్‌లైన్‌ కమ్యూనిటీని ప్రారంభించింది. 2019 నాటికి ఆల్‌–ఇన్‌–వన్‌ కలర్‌ కారెక్టర్, లిప్‌స్టిక్, ఐ షాడో, బ్లష్‌ను అభివృద్ధి చేయడానికి అనేకమంది నుంచి అభిప్రాయాలను సేకరించి, బార్బీని ఇలా ఆవిష్కరించింది. ప్రపంచ దృష్టిని ఆకట్టుకునేలా ఓ కొత్త ఆలోచనతో ఇండియన్‌ బార్బిని ఆవిష్కరించిన దీపికకు అభిమానులు ఇంకా విస్తృతస్థాయిలో తమ అభినందనలు తెలియజేస్తున్నారు.  
 


 

Advertisement
 
Advertisement
 
Advertisement