ప్రతీ ఏడాది మే నెలాఖరు లేదా జూన్ మొదటివారంలో ముగియాల్సిన సమ్మర్ టూర్స్ ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. జూన్ నెల ముగుస్తున్నప్పటికీ చల్లని ప్రాంతాలకు నగరవాసుల పరుగులు ఆగడం లేదు. హైదరాబాద్ సహా దేశవ్యాప్తంగా ఉన్న అన్ని మెట్రో నగరాలకు చెందిన పర్యాటకులూ ఇదే ధోరణి కనబరుస్తున్నట్టు తాజా అధ్యయనం వెల్లడించింది.
తగ్గని వేడి...ఛలో మరి...
దేశవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు ఉపశమించే జాడలు కనిపించని పరిస్థితుల్లో జూన్ నెలలోనూ చల్లని ప్రదేశాలు రద్దీని చవిచూస్తూనే ఉన్నాయి. పర్వత ప్రాంత విహారయాత్రల పట్ల పెరిగిన ఆసక్తికి నిదర్శనంగా ఈ నెలలో సిమ్లాలోని వసతి గృహాలలో బుకింగ్‌లు గతేడాదితో పోలిస్తే ‘76 శాతం పెరిగాయని హాస్పిటాలిటీ, బ్యాక్‌ప్యాకర్ హాస్టల్ చైన్ అయిన జోస్టెల్ విడుదల చేసిన డేటా వెల్లడించింది. గతేడాది ఇదే కాలంతో పోలిస్తే శ్రీనగర్, తీర్థన్ వ్యాలీ, గాంగ్‌టక్ వంటి గమ్యస్థానాలకు వచ్చే సందర్శకుల సంఖ్యలో ఏకంగా ‘95 శాతం వృద్ధి‘ నమోదవడం విశేషమని పేర్కొంది.
గత ఏడాదితో పోలిస్తే ఈ జూన్ లో జోస్టెల్ ప్రాపర్టీలలో పర్వత ప్రాంత బుకింగ్‌లు 76 శాతం పెరిగాయి, మరియు ఆ బుకింగ్‌లలో దాదాపు సగం ప్రయాణ తేదీకి 72 గంటల లోపే జరిగాయి. దాదాపు ‘48 శాతం‘ మంది ప్రయాణానికి మూడు రోజుల ముందే బుకింగ్‌లు చేసుకున్నారు. అంటే అనుకోని విధంగా పెరుగుతున్న ఎండల నేపధ్యంలోనే ఆకస్మిక ప్రయాణాల పట్ల ఆసక్తి పెరిగినట్టు కూడా ఇది సూచిస్తోంది. హోటళ్లలో అధిక ఆక్యుపెన్సీ ఏప్రిల్ నెలలో ప్రారంభమై జూన్ నెలలోనూ కొనసాగడం గమనార్హం. కసౌలిలోని వెల్‌కమ్‌హెరిటేజ్ పార్వ్ విలాస్ రిసార్ట్ – స్పా వంటి హాస్పిటాలిటీ సంస్థలు ఈ నెలలో ఆక్యుపెన్సీ స్థాయిలు ‘15–18 శాతం‘ పెరిగాయని తెలిపాయి.
ప్రాచుర్యం లేని ప్రాంతాలకూ...
అంతగా ప్రాచుర్యం లేని పర్వత ప్రాంతాలను సైతం పర్యాటకులు ఎక్కువగా అన్వేషిస్తున్నారని, తద్వారా గమ్యస్థానాల ప్రాధాన్యతలలో మార్పు వచ్చిందని నివేదిక వెల్లడించింది. సిమ్లా అత్యధిక ఆదరణ పొందిన గమ్యస్థానంగా కొనసాగుతోంది. అయితే ఈ సీజన్ లో దోభి, రాజ్‌గుంధ కరేరి వంటి ప్రదేశాలు అత్యధిక సందర్శకుల వృద్ధిని నమోదు చేశాయి. కొత్తగా ప్రాచుర్యం పొందుతున్న ఈ ప్రాంతాలతో పాటు, శ్రీనగర్, తీర్థన్ వ్యాలీ గ్యాంగ్‌టాక్ వంటి ప్రదేశాలు కూడా ప్రధాన నగరాల పర్యాటకులను ఆకర్షించాయి. బెంగళూరు, ముంబై, పుణె, ఢిల్లీ–ఎన్ సిఆర్, హైదరాబాద్‌లు అత్యధిక పర్యాటకులను అందిస్తున్నాయని, అలాగే ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల నుంచి కూడా డిమాండ్ పెరుగుతోందని నివేదిక తేల్చింది.


