ధోరణి
‘పెళ్లికి మేం రెడీ. కానీ మాకు ఈ సమస్య ఉంది’ అని ప్రీమేరిటల్ కౌన్సెలింగ్‌కు హాజరవుతున్న 25 నుంచి 40 ఏళ్ల మధ్య జంటలు అధికమయ్యారని మేరేజ్ కౌన్సెలర్లు తెలియచేస్తున్నారు. గత ఐదేళ్లలో వీరి సంఖ్య 40 శాతం పెరిగిందని చెబుతున్నారు. పెళ్లి నిర్ణయం తల్లిదండ్రుల నుంచి పిల్లల చేతుల్లోకి మారడమే దీనికి కారణమంటున్నారు. మరి పెళ్లికి ముందు జంటలు వ్యక్తం చేస్తున్న సమస్యలు ఏమిటి?
మొదట మనం కొందరిని పరిచయం చేసుకోవాలి. వారు– రిలేషన్‌షిప్ కౌన్సెలర్, క్లినికల్ సైకాలజిస్ట్, సైకో థెరపిస్ట్... బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ వంటి నగరాల్లో ప్రస్తుతం ఈ రంగాల్లో ఉన్న వారికి డిమాండ్ పెరిగింది. వివాహం చేసుకోవాలని భావిస్తున్న, నిర్ణయించుకున్న వారు ఎటు పోయి ఎటు వస్తుందో ముందు ఒకసారి ‘ప్రీమేరిటల్ కౌన్సిలింగ్’ తీసుకుందాం అని అనుకుంటున్నారు. ‘దీని వల్ల మంచే జరుగుతుంది.
ఇది గట్టెక్కే జంటనా లేకుండా తర్వాత తిప్పలు పడే జంటనా ముందే తేల్చేయొచ్చు’ అంటున్నారు ఈ ‘వివాహ నిపుణులు’. గతంలో అబ్బాయి ఇష్టం, అమ్మాయి ఇష్టం పట్టింపు లేకుండా తల్లిదండ్రులు తాము మంచి అనుకున్నది నమ్మి పెళ్లిళ్లు జరిపించేవారు. తర్వాత పిల్లల ఇష్టాలు గట్టి పట్టు పట్టాయి. ఇప్పుడు పెద్దల ప్రమేయం దాదాపు లేని స్థితి వచ్చింది. పెళ్లి నిర్ణయం ఏకంగా అబ్బాయి, అమ్మాయి తమ నిర్ణయానుసారం తీసుకుంటున్నారు. ఆ నిర్ణయ భారం వారికి భయం కూడా కలిగిస్తోంది. అందుకే పెళ్లికి ముందు కావాల్సిన కౌన్సెలింగ్ హాజరయ్యి వివాహ నిపుణుల జేబులు నింపుతున్నారు.
→ ఎవరు కౌన్సెలింగ్‌కి వస్తున్నారు?
→ లివ్ ఇన్ రిలేషన్‌లో ఉన్నవారు
→ లాంగ్‌టర్మ్ రిలేషన్‌లో ఉన్నవారు
→ సింగిల్‌గా ఉన్నవారు
→ ఎంగేజ్‌మెంట్ అయినవారు
వీరంతా కౌన్సెలింగ్ కోసం వస్తున్నారు.
→ 25 నుంచి 40 మధ్య...
గతంలో ప్రిమేరిటల్ కౌన్సెలింగ్‌కి అధికశాతం 25 నుంచి 35 ఏళ్ల వయసు వాళ్లు వచ్చేవారు. ఇప్పుడు 40 ఏళ్ల వరకూ అవివాహితులుగా ఉన్నవారు కూడా వస్తున్నా రు. అంటే పెళ్లి చేసుకునే వయసు చాలానే పెరిగిందన్న మాట. ‘వీరి కంటే కూడా మా దగ్గరకు వచ్చేవారిలో 70 శాతం మంది రెండో వివాహం కోసం వస్తున్నవారే’ అని అనలైజ్ చేస్తున్నారు ఈ కౌన్సెలర్లు.
→ ఇవీ సందేహాలు– సమస్యలు
ఇష్టాలు ఏర్పడి, రిలేషన్‌షిప్‌లో ఉన్నా కూడా ‘పెళ్లి’ అనేసరికి చాలా సందేహాలు స్త్రీ, పురుషులకు వస్తున్నాయి. వాటిలో ఎక్కువ సమస్యలుగా భావిస్తున్నవి ఇవి.
→ పిల్లలు కనాలా వద్దా
→ ఆర్థిక వ్యవహారాల్లో ఎవరి వైఖరి ఏమిటి
→ కెరీర్ విషయంలో త్యాగం ఎవరిది
→ కాపురం ఎక్కడ చేయాలి
→ అత్తామామలు/తల్లిదండ్రులతో కలిసి ఉండాలా వద్దా
పెళ్లి చేసుకోవాలనుకున్న వారిలో ఇద్దరికీ ఏకాభిప్రాయం లేకపోతే పైన పేర్కొన్న ప్రతిదీ గుదిబండై కూచుంటుంది అంటున్నారు కౌన్సిలర్లు. ‘కొందరికి పిల్లలు కావాలి.. కొందరికి వద్దు... కొందరికి అత్తమామలతో ఉండటం ఇష్టం ఉండదు... ప్రమోషన్లు, ట్రాన్స్‌ఫర్లు, కెరీర్ మార్చడాలు కూడా సమస్యలే. ఇవన్నీ ముందు మాట్లాడుకుంటే రాబోయే రోజుల్లో ఎదురయ్యే నిస్పృహలు, కొట్లాటలు తగ్గుతాయి’ అంటున్నారు నిపుణులు.
→ తాడో పేడో...
కౌన్సెలర్లు దాదాపుగా జంటలను కలపాలని చూస్తున్నా కొన్ని జంటలని గమనించాక ‘మీరు చేసుకోకపోవడమే మంచిది’ అని తెగేసి చెబుతున్నారు. ‘ఒక జంటలో అబ్బాయి జాయింట్ అకౌంట్ ఉండాలని పట్టుబట్టాడు. అమ్మాయికి ఇష్టం లేదు. ఆ పెళ్లి కేన్సిల్ అయ్యింది. మరో జంటలో ఆమెకు పిల్లలు వద్దు. అతనికి కావాలి. ఆ పెళ్లి కూడా కేన్సిల్ అయ్యింది. చేసుకున్నాక విడాకుల కంటే చేసుకోక ముందు కేన్సిల్ చేసుకోవడమే మంచిది’ అంటున్నారు ఈ కౌన్సిలర్లు. ‘ఎంగేజ్‌మెంట్ అయ్యాక పెళ్లి ఎంత ఆర్భాటంగా చేయాలి... ఎంత ఖర్చు చేయాలి అనే విషయంలో మంకుపట్టు పట్టే అబ్బాయి, అమ్మాయిల పెళ్ళిళ్లు కూడా కేన్సిల్ అవుతున్నాయి. కొన్ని జంటల్లో మత ఆచారాలు ఆచరించాలా వద్దా అనే విషయం దుమారం రేపుతోంది’ అని తెలిపారు కౌన్సెలర్లు.
→ రెండో వివాహం
మొదటి వివాహం విఫలమై రెండో వివాహం చేసుకోవాలనుకునేవారు ఎక్కువగా కౌన్సెలింగ్‌కు హాజరవుతున్నారు. ‘వీరికి గత వివాహాల బరువు, భయం... అలాంటి భంగపాటు మళ్లీ ఎక్కడ ఎదురవుతుందోనన్న భంగపాటు ఇవి వెంటాడుతుంటాయి. ఇక పిల్లలు ఉంటే మొదటి భర్త/భార్య వాళ్లతో కాంటాక్ట్‌లో ఉంటే ఈ రెండో వివాహంలో ఆ విషయమై కూడా స్త్రీ, పురుషులకు ఎంతో అవగాహన అవసరం. కౌన్సెలింగ్ వారికి మార్గం చూపిస్తుంది’ అంటున్నారు నిపుణులు.
పెళ్లంటే నూరేళ్ల పంట అన్నారు పెద్దలు. పెళ్లి సంబంధాలు కుదరడం, జంట కలవడం, పెళ్లికి సిద్ధమవడం... ఇవన్నీ ఇప్పుడు అనుకున్నంత సులువుగా లేవు. పెళ్లికి సంబంధించిన సందేహాలు, పెళ్లయ్యాక జీవన భాగస్వామితో ఆ భాగస్వామి కుటుంబంతో వ్యవహార శైలి ఎలా ఉండాలనేది కౌన్సెలింగ్ ద్వారా తెలుసుకుంటే తప్పేమీ లేదు. గతంలో ఇవన్నీ ఇంగితజ్ఞానం, అంతరజ్ఞానంతో ఆటోమేటిక్‌గా తెలిసేవి. లేదంటే పెద్దలు చెప్పేవారు. ఇప్పుడు కౌన్సిలర్ల ద్వారా తెలుసుకోవాల్సి వస్తోంది.


