భవిష్య కిరణం | Claire Mazumdar set to succeed Kiran Mazumdar-Shaw at Biocon | Sakshi
Sakshi News home page

భవిష్య కిరణం

May 12 2026 5:39 AM | Updated on May 12 2026 6:07 AM

Claire Mazumdar set to succeed Kiran Mazumdar-Shaw at Biocon

న్యూస్‌ మేకర్‌

కొన్ని సంవత్సరాల క్రితం... ‘ఎందుకలా భయపడుతున్నావు?’ అని ఆ అమ్మాయిని అడిగారు కిరణ్‌ మజుందార్‌ షా. ‘కంపెనీ నిర్వహణకు నా వయసు  సరిపోదేమో’ అని సందేహించింది ఆ అమ్మాయి. ‘నేను బయోకాన్‌ ప్రారంభించినప్పుడు నీ కంటె చిన్నదాన్ని’ అని చెప్పి ఆమెను ఒప్పించారు కిరణ్‌. బయోకాన్‌ అనుబంధ సంస్థ ‘బికార’  ఫౌండర్‌–సీఈవోగా ఆ అమ్మాయి తనను తాను నిరూపించుకుంది. ఆ అమ్మాయి పేరు...  క్లెయిర్‌ మజుందార్‌.  కిరణ్‌ మజుందార్‌ షా మేనకోడలు. బయోకాన్‌ వ్యాపార సామ్రాజ్య  వారసురాలిగా తెర ముందుకు వచ్చారు క్లెయిర్‌ మజుందార్‌....

ప్రఖ్యాత బయోటెక్నాలజీ సంస్థ బయోకాన్‌ నిర్వహణ బాధ్యతలను చైర్‌పర్సన్‌ మజుందార్‌ షా నుంచి ఆమె మేనకోడలు క్లెయిర్‌ మజుందార్‌ షా స్వీకరించనున్నారు.

– బంగారు కుండ
‘నాకు ఒక బంగారు కుండ దొరికితే, తీవ్రమైన వ్యాధులను నయం చేసే కొత్తమందులను తయారు చేయడానికి ఆ కుండను అత్తయ్యకు ఇస్తాను’ అని ఆరేళ్ల  వయసులో ఎరిక్‌ మజుందార్‌ ఒక కుండ బొమ్మ వేసి కాగితంపై రాశాడు. ఆ అబ్బాయి క్లెయిర్‌ సోదరుడు. విశేషం ఏమిటంటే అప్పుడెప్పుడో రాసిన ఆ బొమ్మల కాగితం ఇప్పటికీ కిరణ్‌ మజుందార్‌ షా దగ్గర భద్రంగా ఉంది.
‘ఆరేళ్ల వయసులో ఎరిక్‌ నాకు పంపిన అందమైన సందేశం ఇది’ అని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు కిరణ్‌.
ఎరిక్‌ తన గౌరవనీయ అత్తయ్యకు బంగారు కుండ ఇవ్వలేదు. అయితే కిరణ్‌ మాత్రం ఎరిక్‌ సోదరి, తన ప్రియమైన కోడలు క్లెయిర్‌ మజుందార్‌కు ‘బయోకాన్‌ బాధ్యతలు’ అనే బంగారు కుండను ఇచ్చారు!

– అడుగడుగునా సవాళ్లే... అయినా సరే...
కిరణ్‌ మజుందార్‌ షా అసాధారణ విజయం రాత్రికి రాత్రి వచ్చింది కాదు. గాలివాటుగా లేదా అదృష్టవశాత్తూ వచ్చింది కాదు. ఒక గ్యారేజీలో 1978లోప్రారంభమైన ఆమె ప్రయాణం... ప్రతికూల వాతావరణం లో సవాళ్లను అధిగమిస్తూ నిరంతర పోరాటంగా సాగింది.
బయోటెక్నాలజీ అంటే పెద్దగా ఎవరికి తెలియని రోజుల్లో పెట్టుబడుల కోసం అన్వేషించడం, బయోటెక్నాలజీని పెద్దగా గుర్తించని కాలంలో పాజిటివ్‌గా ముందుకు సాగడం, స్వల్పకాలిక లాభాలపై దృష్టి సారించే మార్కెట్‌లతో పోరాడటం... ఇలా ఎన్నో అనుభవాలు కిరణ్‌కు ఉన్నాయి. ఎన్నో ప్రతికూల పరిస్థితులను తట్టుకుంటూ కూడా ఆవిష్కరణల ఆధారిత బయోటెక్‌ వ్యవస్థను నిర్మించడం అనేది సాధారణ విషయం కాదు.
‘నేను విజయం సాధించే వరకు నాకు ఎవరూ మద్దతు ఇవ్వలేదు’ అంటారు కిరణ్‌ మజుందార్‌ షా.

– క్లెయిర్‌ది నల్లేరుపై నడక కాదు
బయోకాన్‌ సామ్రాజ్య వారసురాలిగా క్లెయిర్‌ మజుందార్‌ది నల్లేరు మీద నడక కాదు. ఎన్నో సవాళ్లు ఉంటాయి. ‘సవాళ్లను అధిగమించి సత్తా చాటడంలో తన మేనత్తను గుర్తుతెస్తోంది’ అనిపించుకోవాలి.
వ్యాపారం, ఔషధ ఆవిష్కరణలో పునరావిష్కరణ(రీఇన్వేషన్‌) కిరణ్‌ కార్యాచరణ సూత్రం. కంపెనీకి సంబంధించి ప్రతి దశాబ్దంలోనూ ఒక కీలక మలుపు ఉండేది. మొదటి మలుపు... పారిశ్రామిక ఎంజైమ్‌లపై దృష్టి సారించడం.
ఆ తరువాత దశాబ్దంలో బయోకాన్‌ ఇన్సులిన్‌పై దృష్టి సారించి ప్రపంచంలోని టాప్‌ 3  ఇన్సులిన్‌ తయారీదారులలో ఒకరిగా నిలిచారు. 2009 తరువాత పేటెంట్‌ పొందిన బయోలాజికల్‌ ఔషధాల రివర్స్‌–ఇంజినీరింగ్‌ వెర్షన్‌లు అయిన బయోసిమిలర్స్‌పై దృష్టి సారించి భారతదేశపు ఏకైక గ్లోబల్‌ బయోసిమిలర్‌ సంస్థగా, ప్రపంచంలోని టాప్‌ 5 సంస్థలలో ఒకటిగా నిలిచింది బయోకాన్‌.

→ ధైర్యం ఇచ్చి... దారి చూపారు
అమెరికాలోని బయోకాన్‌ అనుబంధ సంస్థ బికారాకు నాయకత్వం వహించడానికి ఒక సీఈవో కావాలని కిరణ్‌ అనుకొని అందుకోసం తన మేనకోడలైన క్లెయిర్‌ మజుందార్‌ను ఎంపిక చేసుకున్నారు. క్లెయిర్‌ మజుందార్‌ బయోలాజికల్‌ ఇంజినీరింగ్‌లో బ్యాచిలర్‌ ఆఫ్‌ సైన్స్‌ డిగ్రీ, స్టాన్‌ఫోర్డ్‌ నుండి ఎంబీఏ, స్టాన్‌ఫోర్డ్‌ స్కూల్‌ ఆఫ్‌ మెడిసిన్‌ నుండి క్యాన్సర్‌ బయాలజీలో పీహెచ్‌డీ చేశారు.

‘థర్డ్‌ రాక్‌ వెంచర్స్‌’ అనే వెంచర్‌ క్యాపిటల్‌(వీసి) సంస్థలో సీనియర్‌ అసోసియేట్‌గా పనిచేసేవారు. బికారాలో చేరడానికి మొదట్లో ఆమె విముఖత వ్యక్తం చేశారు.
‘ఈ వయసులో అంత పెద్ద బాధ్యతలను నిర్వహించలేను’ అనేది క్లెయిర్‌ విముఖతకు కారణం. అలా అని అత్తయ్య ఊరుకోలేదు.
‘నేను బయోకాన్‌ప్రారంభించినప్పుడు నీ కంటె చిన్నదాన్ని’ అని క్లెయిర్‌ను ఒప్పించారు కిరణ్‌. 
అలా బికారలో ఫౌండర్‌–సీఈవోగా చేరి సత్తా చాటారు క్లెయిర్‌ మజుందార్‌. అమెరికాలోని వెంచర్‌ క్యాపిటల్‌ కమ్యూనిటీతో పనిచేసిన అనుభవం మూల«ధనాన్ని ఆకర్షించడంలో ఆమెకు సహాయపడింది.
కిరణ్‌ ఆరోజు ఇచ్చిన ఆ ధైర్యమే భవిష్యత్‌లో క్లెయిర్‌ మజుందార్‌ను ముందుకు నడిపించనుంది.
 
అందుకే ఆమె నా వారసురాలు
నా వారసురాలికి మూడు లక్షణాలు ఉండాలని నేను కోరుకుంటున్నాను. అవి... రిస్క్‌ తీసుకునే సామర్థ్యం, వ్యూహాత్మకంగా ఆలోచించే తత్వం, విలువను సృష్టించే నైపుణ్యం. నేను బయోకాన్‌కు యజమానిని. నా సంస్థను మంచి వ్యక్తికి అప్పగించానని నేను నిర్థారించుకోవాలి. నా మేడకోడలు క్లెయిర్‌ను నా వారసురాలిగా చూస్తున్నాను. ఆమెలో నేను కోరుకునే మూడు లక్షణాలు ఉన్నాయి.  కంపెనీని క్లెయిర్‌ విజయవంతంగా నడిపించగలదని నమ్ముతున్నాను.
– కిరణ్‌ మజుందార్‌ షా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement