
అది 2018 ఫిబ్రవరి ఒకటో తేదీ. హైదరాబాద్‌లోని ఉప్పల్ చిలుకానగర్ ప్రాంతం... తెల్లవారుతూనే క్యాబ్ డ్రైవర్ రాజశేఖర్ ఇంటి పైన మూడు నెలల చిన్నారి తల ఉందనే వార్త దావానలంలా వ్యాపించింది. ఆ ఇంటి ఎదురుగా నివసించే ఒక మెకానిక్ ఈ కేసులో ప్రధాన అనుమానితుడిగా పోలీసుల విచారణ ఎదుర్కొన్నాడు. అసలు నిందితులు చిక్కే వరకు నానా ఇబ్బందులు పడ్డాడు. దీనికంతటికీ కారణం ఒక ఎలుక!
చిలుకానగర్ మైసమ్మ దేవాలయం సమీపంలో నివసించే రాజశేఖర్ వృత్తిరీత్యా క్యాబ్ డ్రైవర్. ఎప్పటిలాగే 2018 ఫిబ్రవరి ఒకటో తేదీన తన క్యాబ్ తీసుకుని బయటకు వెళ్లిపోయాడు. అతడి అత్త బాలలక్ష్మి ఉదయం 11 గంటల ప్రాంతంలో ఉతికిన దుస్తులను ఆరేసేందుకు డాబాపైకి వెళ్లింది. అక్కడ ఒక చిన్నారి తల కనిపించడంతో హడలిపోయి, కేకలు వేస్తూ కిందికి పరిగెత్తుకు వచ్చింది. పక్కింట్లో ఉండే నరహరికి ఈ కేకలు వినిపించాయి. ఏం జరిగిందో తెలుసుకోవడానికి ఆమె వద్దకు వచ్చాడు. బాలలక్ష్మి విషయం చెప్పడంతో పైకి వెళ్లి తలను చూసి, దగ్గర వరకు వెళ్లి పరిశీలించి వచ్చాడు. ఆపై విషయాన్ని ఫోన్ ద్వారా రాజశేఖర్‌కు తెలిపాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. అంతకు ముందురోజు అమావాస్య కావడంతో ఇది నరబలిగా అనుమానిస్తూ ఆ కోణంలో దర్యాప్తు ప్రారంభించారు.
ఈలోపు అక్కడకు చేరుకున్న రాజశేఖర్, అతడి భార్య శ్రీలత సైతం తీవ్ర ఆందోళనకు గురయ్యారు. తమ ఇంటి చుట్టుపక్కల వాళ్లే ఎవరో నరబలి ఇచ్చి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. ఘటనాస్థలికి క్లూస్‌టీమ్స్‌తో పాటు డాగ్ స్క్వాడ్‌ను కూడా పోలీసులు రప్పించారు. పోలీసు జాగిలాలు రాజశేఖర్ డాబా పైనుంచి కిందికి వచ్చి ఎదురుగా ఉన్న నరహరి ఇంటి వద్దకు చేరాయి. అక్కడ నుంచి సమీపంలోని రోడ్డు మీదకు వచ్చి ఆగాయి. ఈ కేసు దర్యాప్తులో భాగంగా రాజశేఖర్, శ్రీలతలతో పాటు నరహరిని, మరికొందరినీ పోలీసులు ప్రశ్నించారు. ఒక్కో రోజు గడిచే కొద్దీ పోలీసులపై ఒత్తిడి పెరుగుతూ పోయింది. ఒక పక్క నిందితుల కోసం, మరోపక్క మొండెం కోసం గాలించడం మొదలెట్టారు.
పోలీసులు అదే ఏడాది ఫిబ్రవరి 9న నరహరి ఇంట్లో గాలిస్తుండగా దుర్వానస వస్తున్నట్లు గమనించారు. నరబలి కోసం పూజలు చేసి, అక్కడే చిన్నారిని చంపి ఉండవచ్చని అనుమానించారు. మొండేన్ని కూడా అక్కడే దాచి ఉండటంతో కుళ్లి దుర్వాసన వస్తోందని భావించారు. అతడే ప్రధాన అనుమానితుడిగా మారడంతో మరోసారి వివిధ కోణాల్లో లోతుగా విచారించారు. ఇలా రెండు రోజులు గడిచాక ముందు మొండేన్ని లేదా కొన్ని ఆధారాలను వెలికి తీయాలని నిర్ణయించుకున్నారు. ఆ పని చేస్తే కేసు కొలిక్కి వచ్చినట్లే అనే భావనతో క్లూస్‌టీమ్‌తో కలిసి ఆ గదిలో అణువణువూ తనిఖీ చేశారు. చివరకు గదిలో సామాను కింద చనిపోయిన ఎలుక దొరకడంతో అదే దుర్వాసనకు కారణమని తేల్చారు.
ఘటనాస్థలికి వచ్చిన జాగిలాలు అతడి ఇంట్లోకి ఎందుకు వెళ్లాయనేది ఆరా తీశారు. ఇంటి పైన ఉన్న చిన్నారి తలను చూసిన బాలలక్ష్మి అరుస్తూ కిందికి పరిగెత్తుకు వచ్చింది. అప్పటికే రాజశేఖర్ తన క్యాబ్ తీసుకుని వెళ్లిపోయాడు. అరుపులు విన్న ఎదురింట్లో ఉండే నరహరి డాబా పైకి వచ్చాడు. అక్కడున్న తలను చూసి, దగ్గర నుంచి పరిశీలించాడు. ఆపై అతడే ఫోన్ ద్వారా విషయాన్ని రాజశేఖర్‌కు సమాచారం ఇచ్చి తన ఇంటికి వెళ్లిపోయాడు. అలా అక్కడ అతడి వాసన ఉండిపోయింది. ఈ నేపథ్యంలోనే ఘటనాస్థలికి వచ్చిన పోలీసు జాగిలాలు వాసన చూస్తూ నరహరి ఇంట్లోకే వెళ్ళాయి. ఈ పూర్వాపరాలను మరోసారి సరిచూసుకున్న అధికారులు అతడికి క్లీన్ చిట్ ఇచ్చి వదిలిపెట్టారు.
ఆధారాల కోసం పోలీసులు మరోసారి ఘటనాస్థలికి పరిశీలించారు. రాజశేఖర్ ఇంటి లోపలి భాగాన్ని ఫోరెన్సిక్ నిపుణులతో కలిసి తనిఖీ చేసిన పోలీసులు కొన్ని రక్తపు మరకలు కనుగొన్నారు. తల భాగం దొరికిన డాబా పైన కూడా తనిఖీలు చేస్తున్నప్పుడు పోలీసుల దృష్టి ఓ చీపురుపై పడింది. ఇంటిలోకి ఎండ, వర్షం నీరు పడకుండా సన్‌షేడ్ మాదిరిగా ఏర్పాటు చేసిన రేకులపై అది కనిపించింది. దాన్ని తీసిన పోలీసులు వెదురు ఆకులతో చేసిందిగా గుర్తించారు. దగ్గరగా పరిశీలించగా ఆకుల మధ్య కుంకుమ కనిపించడంతో పూజలు చేసిన ఆనవాళ్లుగా భావించారు. వీటన్నింటినీ మించి ఆ చీపురును ఓ దారంతో పాటు ఎండు గరికతో కలిపి కట్టడంతో అనుమానం బలపడింది. నమూనాలనూ ఫోరెన్సిక్ పరీక్షలకు పంపి క్షుద్రపూజల విషయం నిర్థారించుకున్నారు. రాజశేఖర్, శ్రీలతల పాత్ర రూఢి కావడంతో ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని విచారిస్తే, తన భార్య ఆరోగ్యం కోసం నరబలి ఇచ్చినట్లు అంగీకరించాడు.
ఈ హత్య వెలుగులోకి వచ్చిన రోజే పోలీసు జాగిలాలు డాబా పైనుంచి వాసన చూసుకుంటూ నేరుగా రాజశేఖర్ ఇంట్లోకే వెళ్లాల్సి ఉంది. అయితే, 2018 జనవరి 31న చిన్నారిని కిడ్నాప్ చేసిన రాజశేఖర్ నేరుగా ప్రతాపసింగారం వెళ్లి అక్కడే చిన్నారిని హత్య చేసి మొండాన్ని మూసీలో పడేశాడు. అక్కడ నుంచి తలను ఇంటికి తీసుకువచ్చి నట్టింట్లో పెట్టి తన భార్య శ్రీలతతో కలిసి పూజలు చేశాడు. ఆపై తలను ఇంటి పైన పెట్టి, భార్యతో కలిసి ఇల్లంతా కడిగేశాడు. వాసనను బట్టి ముందుకు వెళ్లే పోలీసు జాగిలాలు నీళ్లతో కడిగిన ప్రాంతంలో వాసన గుర్తించలేవు. రాజశేఖర్ తన ఇంటిని ఫ్లోర్ క్లీనర్లతో పూర్తిగా కడిగేసిన కారణంగానే జాగిలాలు అతడి ఇంటి లోపలకు వెళ్లకుండా సమీపంలో తిరిగాయి. 2018 ఫిబ్రవరి 15న రాజశేఖర్, శ్రీలతల్ని పోలీసులు అరెస్టు చేశారు.
∙