‘ఓపెన్‌’గా మాట్లాడితే! | Betaal and Vikramarka talks on Bank Locker Opened story | Sakshi
Sakshi News home page

‘ఓపెన్‌’గా మాట్లాడితే!

May 29 2026 6:10 AM | Updated on May 29 2026 6:10 AM

Betaal and Vikramarka talks on Bank Locker Opened story

హ్యూమరమరాలు

ఆ బ్యాంక్‌ పేరు... భద్రం బీకేర్‌ఫుల్‌ బ్రదర్‌. ఒకరోజు ఆ బ్యాంకులో సేఫ్టీలాకర్‌ ఎంతకీ ఓపెన్‌ కావడం లేదు. నగరంలో పేరున్న మెకానిక్‌లను పిలిపించారు. నో... ఫలితమ్‌. ‘సేఫ్టీ లాకర్‌ను సేఫ్‌గా ఓపెన్‌ చేయడం ఎలా?’ అని యూట్యూబ్‌లో ఎన్నో వీడియోలు చూసి ట్రై చేశారు. నో.... ఫలితమ్‌. ‘ఇలా కాదుగానీ అతడిని పిలిపించాల్సిందే’ అన్నాడు బ్యాంకులో సీనియర్‌ ఉద్యోగి శీనయ్య పటేల్‌. ‘ఎవరు అతడు?’ అని అడిగాడు కొత్త మేనేజర్‌.

‘అతడి పేరు... ఓపెనర్‌ కుమార్‌ (ఓ.కె) అసలు పేరేమిటో తెలియదు కానీ అందరూ ఓ.కే అని పిలుస్తారు’ అని చెప్పాడు శీనయ్య. మారుమూల పల్లెటూరులో ఉండే ఓ.కే.ను పిలిపించారు. సేఫ్‌ లాకర్‌ను ఓ.కె. అవలీలగా ఓపెన్‌ చేశాడు. ఆనందం తట్టుకోలేక అందరూ చప్పట్లు కొట్టారు. ‘నీది మామూలు టాలెంట్‌ కాదు తమ్ముడూ! ఇదిగో పదివేలు...గిఫ్ట్‌గా ఇస్తున్నాను’ అని ఆప్యాయంగా ఓ.కె భుజం తట్టాడు మేనేజర్‌. అంతే...ఓ.కే.లో ఒక్కసారిగా మార్పు వచ్చింది. అతడి కళ్లలో అగ్నిపర్వతాలు ఢమాల్, ఢమాల్‌ అని రెండుసార్లు పేలాయి. వీరావేశంతో బ్యాంక్‌ మేనేజర్‌ను మ«ధ్యయుగాల నాటి కిరాతకమైన తిట్లు తిట్టడం ప్రారంభించాడు.
ఆ తరువాత ఇలా అన్నాడు: ‘................ .......  .........  .............. ......... ............ ........’
  
‘విక్రమార్కా.... ఆ బ్యాంక్‌ మేనేజర్‌ ఓ.కే.ను పల్లెత్తు మాట అనలేదు. పైగా ప్రశంసించాడు. అంతేకాదు, గిఫ్ట్‌క్యాష్‌ ఇవ్వబోయాడు. మరి అతడిని పట్టుకొని తిట్టినతిట్టు తిట్టకుండా తిట్టడమేమిటి? ఇంతకీ ఓ.కె. కోపానికి కారణం ఏమిటి? పనిలో పనిగా పై ఖాళీని పూరించు. ఓ..కె ఏమన్నాడో చెప్పు. చెప్పకపోయావో...’ అని ఎప్పటిలాగే హెచ్చరించాడు భేతాళుడు. ‘పై ఖాళీలో ఓ.కె. చెప్పిన డైలాగ్‌ చెబుతాను. అందులోనే నీకు సమాధానం దొరుకుతుంది’
‘అలాగే చెప్పు’ అన్నాడు భేతాళుడు.

సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌
‘ఏమయ్యా బ్యాంకు మేనేజర్, నేను ఇంట్లో సుఖంగా ఉండడం, హాయిగా ఇంటి భోజనం చేయడం నీకు నచ్చడం లేదా! మళ్లీ ఆ జైల్లో చిప్పకూడు తినాలా? ఈ డబ్బులకు ఆశపడే కదయ్యా చిప్పకూడు తిన్నాను. గతంలో ఒకసారి సేఫ్‌ లాకర్‌ ఓపెన్‌ చేసినందుకే చా...లా సంవత్సరాలు జైల్లో ఉండి చచ్చాను’ ఆవేశంగా, ఆవేదనగా, ఆందోళనగా అన్నాడు ఓ.కె.
‘మరి అప్పుడు నిన్ను ఏ బ్యాంక్‌ వాళ్లు పిలిచారు?’ అడిగాడు అక్కడున్న ఒక వ్యక్తి. ‘ఎవరూ పిలవలేదు. ఒక అర్ధరాత్రి నేనే సరదాగా వచ్చాను. పోలీసులకు దొరికిపోయాను’ అసలు విషయం చెప్పాడు ఓ.కె. ఎలియాస్‌ ఓపెనర్‌ కుమార్‌.

–యాకుబ్‌ పాషా
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement