ఒక ఫొటో ఆమెకు నిద్ర లేకుండా చేస్తోంది!

Bengali Actor And MP Nusrat Jahan Receives Death Threats - Sakshi

కోల్‌కతా: తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ యువ ఎంపీ నుస్రత్‌ జహాన్‌ బొట్టు పెట్టుకుంటే హిందూ మహిళలా ఉంటారు. నుస్రత్‌ సినీ నటి. రాజకీయాల్లోకి వచ్చి ఏడాదే అయింది. కులమతాలు పట్టించుకునే అమ్మాయి కాదని చెప్పి, బీజేపీ క్యాండిడేట్‌ని ఘోరంగా ఓడించి మరీ ఆమెను గెలిపించుకున్నారు బసిర్హాట్‌ నియోజకవర్గ ప్రజలు. ప్రస్తుతం ఆమె ఓ బెంగాలీ చిత్రం షూటింగ్‌ కోసం లండన్‌లో ఉన్నారు. పార్లమెంట్‌ సమావేశాలు ముగిశాక సెప్టెంబర్‌ 27న లండన్‌ వెళ్లారు. అక్టోబర్‌ 15 వరకు అక్కడే షూటింగ్‌ లో ఉంటారు. ఇండియా నుంచి వెళ్లే ముందే సెప్టెంబర్‌ 17 న ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో, ట్విట్టర్‌లో కొన్ని ఫోటోలు పోస్ట్‌ చేశారు.  (ప్రజాప్రతినిధులపై భారీగా క్రిమినల్‌ కేసులు)

ఆ ఫొటోల్లోని ఒక ఫొటో ఇప్పుడు లండన్‌లో ఆమెకు నిద్ర లేకుండా చేస్తోంది! దుర్గామాతలా నుస్రత్‌ జహాన్‌ బొట్టు పెట్టుకుని, త్రిశూలం పట్టుకున్న ఫొటో అది. వెయ్యికి పైగా కామెంట్‌లు వచ్చాయి. ఎక్కువగా బంగ్లాదేశ్‌వి. అందులో ఒక కామెంట్‌ ఇలా ఉంది: ‘నీ అంతము సమీపించినది. మరణించిన పిదప మాత్రమే నువ్వు నీ తప్పిదము తెలుసుకొనెదవు’. ఇలాంటివే మిగతావి. నుస్రత్‌ వెంటనే ఈ హెచ్చరికలను పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వం దృష్టికి తెచ్చారు. బెంగాల్‌ ప్రభుత్వం లండన్‌లో ఆమెకు అదనపు భద్రతను కల్పించే ఏర్పాట్లు చేస్తోంది. మనోభావాల మధ్య మనుగడ సాగిస్తున్నప్పుడు కొన్ని ఫొటోలను పర్సనల్‌ ఆల్బమ్‌ నుంచి బయటికి తియ్యక పోవడమే మంచిదని నుస్రత్‌ ఇప్పటికైనా గ్రహించి ఉండాలి. ఈ లౌకికవాది.. గాఢ విశ్వాసాలకు భంగం కలిగించి విమర్శల పాలవడం ఇది మొదటిసారేమీ కాదు. 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top