హలేబీడు ఉలి చెక్కిన గ్రంథం, ఆసక్తికర విషయాలు | Belur Halebeedu Shravanabelagola chesk these important details | Sakshi
Sakshi News home page

హలేబీడు ఉలి చెక్కిన గ్రంథం, ఆసక్తికర విషయాలు

Dec 9 2024 10:09 AM | Updated on Dec 9 2024 11:06 AM

Belur Halebeedu Shravanabelagola chesk these important details

హలేబీడు ఈ ప్రదేశాన్ని ఒకటిగా పలకడం పర్యాటకరంగానికి అలవాటు ఉండదు. బేలూరు– హలేబీడు అని పలుకుతారు. ఈ రెండు ప్రదేశాల మధ్య దూరం 17కిలోమీటర్లు. ఈ రెండు ప్రదేశాల్లోని నిర్మాణాలు ఒకేరీతిలో ఉంటాయి. ఒకే రాజవంశానికి చెందిన కట్టడాలు. హొయసల రాజవంశం దక్షిణభారతదేశాన్ని దాదాపు 200 ఏళ్లు పాలించింది. యుద్ధాలు లేని ప్రశాంత సమయంలో ఈ నిర్మాణాలన్నీ జరిగాయి. 

హొయసలుల ఆలయాలన్నీ మహాభారతం, రామాయణం, భాగవత గ్రంథాలకు శిల్పరూపాలు. వేదవ్యాసుడు, వాల్మీకి రాసిన గ్రంథాలను శిలల్లో ఆకర్షణీయంగా చెక్కిన శిల్పులు కూడా అంతటి మహోన్నతులే అని చేతులెత్తి దండం పెట్టాలనిపిస్తుంది. పదకొండవ శతాబ్దంలో ఈ స్థాయిలో విరాజిల్లిన ప్రదేశం ఆ తర్వాత రాజకీయ సంక్లిష్టతల దుష్ప్రభావాన్ని ఎదుర్కొన్నది. ఇప్పుడు కనిపిస్తున్నది 14 శతాబ్దంలో అల్లాఉద్దీన్‌ ఖిల్జీ, మహమ్మద్‌ తుగ్లక్‌ల దాడిలో విధ్వంసం అయిన తర్వాత మిగిలిన రూపాలే. ఆ విగ్రహాలకు పూర్వవైభవం తీసుకురావడానికి ఆర్కియాలజీ డిపార్ట్‌మెంట్‌ మెరుగులు దిద్దుతోంది.

కళకు శిలాసాక్ష్యాలు
హొయసల రాజవంశం కళాభిరుచికి ప్రతీకలు ఆలయాలు. వీటిని హొయసల టెంపుల్స్‌గా వ్యవహరిస్తారు. హలేబీడులో హొయసలేశ్వర ఆలయంతోపాటు కేదారేశ్వరాలయం, జైన్‌ ఆలయాలు ప్రసిద్ధం. హొయసలుల ఆలయ నిర్మాణం ప్రత్యేకంగా ఉంటుంది. వేస్‌మెంట్‌ నక్షత్రం ఆకారంలో ఉంటుంది. హొయసలేశ్వర ఆలయం ట్విన్‌ టెంపుల్‌. శైవంతోపాటు వైష్ణం, శాక్తేయంతోపాటు వేదాలన్నింటికీ ప్రతిరూపం. దేవతల విగ్రహాలు, మునుల విగ్రహాలతోపాటు ఏనుగులు, సింహాలు, గుర్రాలు, పూలతీగలు అడవిలో చెట్టును అల్లుకున్నట్లు రాతిలో సజీవరూపంలో ఉంటాయి. ఈ నిర్మాణాల్లో రాణి కేతలాదేవి చొరవ ప్రశంసనీయం. ఇక జైన ఆలయాల్లో పార్శ్వనాథుడు, శాంతినాథ, ఆదినాథ ఆలయాలున్నాయి. హొయసలేశ్వర ఆలయం ఆవరణలో బాహుబలి ప్రతిరూపాన్ని కూడా చూడవచ్చు. అసలు బాహుబలి (గోమఠేశ్వరుడు) విగ్రహం శ్రావణబెళగొళ లోని వింధ్యగిరి కొండల్లో ఉంది.

మెట్లబావి కూడా ఉంది
బెంగళూరు నుంచి 200 కిమీల దూరంలో ఉంది హలేబీడు. ఈ టూర్‌లో బేలూరులోని చెన్నకేశవాలయాన్ని కూడా కవర్‌ చేయవచ్చు. హలేబీడుకు కిలోమీటరు దూరంలో హులికెరె అనే గ్రామంలో స్టెప్‌వెల్‌ ఉంది. రాణీకీవావ్, అదాలజ్‌ వావ్‌ వంటి గొప్ప స్టెప్‌వెల్స్‌కి గుజరాత్‌ ప్రసిద్ధి. ఢిల్లీలో కూడా అగ్రసేన్‌ కీ బావోలీ ఉంది. ఐదేళ్ల కిందట తెలంగాణ జిల్లాల్లో కూడా స్టెప్‌వెల్‌లు బయటపడ్డాయి. కర్నాటకలో మెట్లబావుల సంస్కృతి తక్కువే. కానీ చూడాల్సిన ప్రదేశం. నిర్మాణ శైలిలో ఒక  ప్రాంతానికి మరొక ప్రాంతానికీ ఉన్న తేడాలను అర్థం చేసుకోవాలంటే చూసి తీరాలి. టూర్‌ ఆపరేటర్‌లను ముందుగా అడిగి ఇవన్నీ కవర్‌ చేసేలా మాట్లాడుకోవాలి.
 

ఆభరణాల నంది
టెంపుల్‌ కాంప్లెక్స్‌లో ఏర్పాటు చేసిన మ్యూజియంలో 15 వందలకు పైగా శిల్పాలు, ఇతర కళా రూపాలున్నాయి. నంది విగ్రహం ధరించిన ఆభరణాలను నిశితంగా పరిశీలించడానికి కనీసం పది నిమిషాల సమయం పడుతుంది. సాధారణంగా శివాలయాల్లో శిల్ప సౌందర్యానికి అద్దం పట్టేది నంది విగ్రహమే. ఆంధ్రప్రదేశ్‌లోని లేపాక్షి, తెలంగాణలోని రామప్ప ఆలయాల్లో కూడా నంది విగ్రహాలు ప్రత్యేకంగా చెప్పుకోవాల్సినంత గొప్పగా ఉంటాయి. శిల్పులు తమ నైపుణ్యాన్ని శివలింగాన్ని చెక్కడంలో వ్యక్తం చేయడానికి ఏమీ ఉండదు. అందుకే నంది విగ్రహం, ఆ విగ్రహానికి ఆభరణాల కోసం ఉలికి పని చెప్తారు. దాంతో ఆ శిల్పి చాతుర్యం అంతా నందిలో కనిపిస్తుంది.  

– వాకా మంజులారెడ్డి,  సాక్షి ఫీచర్స్‌ ప్రతినిధి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement