కాంతివంతమైన మెరిసే ముఖం కోసం..! | Beauty Tips: Vinotherapy: restore skin's health | Sakshi
Sakshi News home page

కాంతివంతమైన మెరిసే ముఖం కోసం..!

May 10 2026 5:06 PM | Updated on May 10 2026 5:06 PM

Beauty Tips: Vinotherapy: restore skin's health

పెదవుల ఆకృతిని మార్చుకోవడానికి ఫిల్లర్‌ చికిత్సలపై ఆధారపడే మహిళలకు ఒక అద్భుతమైన ప్రత్యామ్నాయం అందుబాటులోకి వచ్చింది. ప్రముఖ బ్యూటీ టెక్నాలజీ సంస్థ సిల్కెన్‌ పెదవుల సంరక్షణ, అందం కోసం ‘లూమిలిప్స్‌ ఎల్‌ఈడీ లిప్‌ మాస్క్‌’ను మార్కెట్‌లోకి ప్రవేశపెట్టింది.

ఫేస్‌ మాస్క్‌లు సాధారణంగా ముఖం అంతటికీ కాంతిని అందిస్తాయి. కానీ, ఈ లూమిలిప్స్‌ మాస్క్‌ ప్రత్యేకంగా పెదవులు, వాటి చుట్టూ ఉండే చర్మంపై దృష్టి పెడుతుంది. ఇది కాంతి కిరణాల సహాయంతో పెదవులలోని కొవ్వు పొరను లక్ష్యంగా చేసుకుని, రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. దీనివల్ల పెదవులు సహజంగానే మృదువుగా, నిండుగా కనిపిస్తాయి. ఈ పరికరం రెండు మోడ్లలో పనిచేస్తుంది. ఒకటి: వాల్యూమ్‌ యాంటీ ఏజింగ్‌ మోడ్‌. ఇది పెదవుల చుట్టూ ఉండే ముడతలు, స్మైల్‌ లైన్స్‌, వయసురీత్యా వచ్చే మార్పులను తగ్గిస్తుంది. 

మరొకటి: గ్లో అండ్‌ సూతింగ్‌ మోడ్‌. ఇది చర్మ ఛాయను మెరుగుపరచడమే కాకుండా, పెదవులకు సహజమైన మెరుపును ఇస్తుంది. ఈ మాస్క్‌ని రోజుకు 3 నుంచి 5 నిమిషాలు ఉపయోగిస్తే చాలు. కేవలం రెండు వారాల్లోనే  స్పష్టమైన మార్పును గమనించవచ్చు. దీనిని ఉపయోగించినప్పుడు ఎలాంటి నొప్పి ఉండదు.

వైనో థెరపీ..
వైన్‌ తాగడం పురాతన కాలం నుంచి మామూలే! కానీ పురాతన కాలంలో వైన్‌ను ఒక సౌందర్య సాధనంగా కూడా ఉయోగించేవారు. రోమన్‌ మహిళలు ద్రాక్ష గింజలు, తొక్కలతో చేసిన మాస్క్‌లను ముడతలు పోగొట్టుకోవడానికి వాడేవారు. అలాగే ద్రాక్ష గుజ్జును బుగ్గలకు మంచి రంగు రావడం కోసం వాడేవారట! తరువాత 17వ శతాబ్దంలో ఫ్రాన్స్‌లోని ఉన్నత వర్గాల మహిళలు చర్మం కాంతిమంతంగా మెరవడానికి రెడ్‌ వైన్‌తో ముఖం కడుక్కునేవారట! 

ముఖ్యంగా ఈ ప్రక్రియకే ఆధునికులు ‘వైనోథెరపీ’గా పేరుపెట్టారు. వైనోథెరపీ ఎక్కువగా ప్రాచుర్యంలోకి వచ్చింది మాత్రం 1990లో. ఫ్రాన్స్‌కి చెందిన మథిల్డే థామస్, ఆమె భర్త బెర్ర్‌టాండ్‌ థామస్‌ ఈ ఆధునిక వైనోథెరపీకి మూలకారకులు. ఫ్రాన్స్‌లో మొదలైన ఈ వైనోథెరపీ ఇప్పుడు జపాన్, అర్జెంటీనా, అమెరికా, భారత్‌ వరకు విస్తరించింది.

అతి జాగ్రత్తలే అసలు సమస్య!
జుట్టు ఆరోగ్యంగా ఉండాలని ఒక్కోసారి మనం అతి జాగ్రత్తలతో చేసే పనులు సమస్యను తగ్గించడానికి బదులుగా మరింత పెంచుతాయి. జుట్టు జిడ్డుగా మారుతుందని తరచు షాంపూలతో తలస్నానాలు చేస్తుంటారు. దీనివల్ల తలలో సహజంగా ఉండే నూనెలు పోతాయి. చర్మం మరింత పొడిబారి, ఇంకా ఎక్కువ నూనెను ఉత్పత్తి చేస్తుంది. అందువల్ల మైల్డ్‌ షాంపూలను మాత్రమే ఉపయోగించాలి. అలాగే వేసవిలో చాలామంది జుట్టును బిగుతుగా ముడి వేస్తుంటారు. 

దీనివల్ల తలలో చెమట, వేడి పెరిగి జుట్టు కుదుళ్లు బలహీన పడతాయి. అలాగే డ్రై షాంపూలు, స్ప్రేలు వాడినప్పుడు అవి చెమటతో కలిసి తల మీద ఒక పొరలా పేరుకుపోతాయి. ఇవి చర్మరంధ్రాలను మూసివేసి ఇన్ఫెక్షన్లకు దారితీస్తాయి. అందువల్ల తలపై పేరుకుపోయిన వ్యర్థాలను తొలగించడానికి సున్నితమైన స్క్రబ్‌ను వాడాలి. 

ఎండలో వెళ్లేటప్పుడు హ్యాట్, లేదా స్కార్ఫ్‌ ధరించాలి. సూర్యరశ్మి వల్ల తల చర్మం దెబ్బతినకుండా ఉంటుంది. మన ముఖ చర్మం లాగే, తల చర్మం కూడా చాలా ముఖ్యం. అందువల్ల తలపై దురద పెడుతున్నా, జుట్టు పల్చబడుతున్నా, జిడ్డుగా ఉంటున్నా– అది మీ సహాయం కోరుతోందని అర్థం. అందువల్ల సమస్య చిన్నగా ఉన్నప్పుడే సరైన జాగ్రత్తలు తీసుకోవడం వల్ల జుట్టు రాలడాన్ని అరికట్టవచ్చు. 

Advertisement
 
Advertisement
Advertisement