Bathukamma Song: ఏమేమి పువ్వొప్పునే గౌరమ్మ.. అమ్మనే అడిగి.. ఆమెకిష్టమైన విధంగా!

Bathukamma 2022: Song Lyrics While Making Bathukamma - Sakshi

తెలంగాణ ఆడబిడ్డల సంబురం బతుకమ్మ పండుగకు సమయం ఆసన్నమైంది. ఆదివారం(సెప్టెంబరు 25) ఎంగిపూల బతుకమ్మతో సందడి మొదలు కానుంది. తీరొక్క పూలతో సిబ్బిలో బతుకమ్మ పేర్చి.. గౌరమ్మను మధ్యలో పెడతారు. 

సాధారణంగా గుమ్మడిపువ్వు, తంగేడు, కట్లపూలు, గోరంట పూలు, పట్టుకుచ్చులు(సీతజడలు), రుద్రాక్షలు, పొన్నపూలతో బతుకమ్మ పేరుస్తారు. ఈ పూల పండుగ అంటేనే ఆటపాటలు కదా! బతుకమ్మ ఆడేటపుడే కాదు పేర్చేటపుడు కూడా ఇలా పాట పాడుకుంటారు ఆడబిడ్డలు. ఏయే పూలతో నిన్ను కొలవాలమ్మా అంటూ గౌరమ్మనే అడిగి ఆమెకిష్టమైన విధంగా బతుకమ్మ పేర్చినట్లు మురిసిపోతారు. ఈ పండుగకు ఉన్న ప్రత్యేకతల్లో పాటలు ప్రధానమైనవన్న సంగతి తెలిసిందే.

‘‘ఏమేమి పువ్వొప్పునే గౌరమ్మ...
ఏమేమి కాయొప్పునే గౌరమ్మ 

గుమ్మాడి పువ్వొప్పునే గౌరమ్మ...
గుమ్మాడి కాయొప్పునే గౌరమ్మ 

గుమ్మాడి చెట్టుకింద గౌరమ్మ...
ఆట చిలకల్లారా ..పాట చిలకల్లారా
బమ్మశ్రీమాడలూ గౌరమ్మ 
కందొమ్మ గడ్డలూ గౌరమ్మ...

ఎనుగూల కట్టెలూ గౌరమ్మ  
తారు గోరంటాలు గౌరమ్మ...
ఎర్రొద్దురాక్షలు గౌరమ్మ 
పోను తంగేడుపూలు గౌరమ్మ...
రాను తంగేడుపూలు గౌరమ్మ 
ఘనమైన పొన్నపూలే గౌరమ్మ...
గజ్జాల వడ్డాణమే గౌరమ్మ 

తంగేడు చెట్టుకింద గౌరమ్మ...
ఆట చిలకల్లారా..  పాట చిలకల్లారా
బమ్మశ్రీమాడలూ గౌరమ్మ 
కందొమ్మ గడ్డలు ఎనుగూల కట్టెలు గౌరమ్మ

తారు గోరంటాలు ఎర్రొద్దురాక్షలు
పోను తంగేడుపూలురాను తంగేడుపూలు
ఘనమైన పొన్నపూలేగజ్జాల వడ్డాణమే
కాకర చెట్టుకింద ఆట చిలుకాలార 
పాట చిలుకాలార బమ్మశ్రీమడలూ 
తారు గోరంటాలు ఎర్రొద్దురాక్షలు 

పోను తంగేడుపూలురాను తంగేడుపూలు 
ఘనమైన పొన్నపూలే గజ్జాల వడ్డాణమే 
రుద్రాక్ష చెట్టుకింద ఆట చిలుకాలార 
పాట చిలుకాలార కలికి చిలుకాలార 
కందొమ్మ గడ్డలూ బమ్మశ్రీమాడలూ 
తారు గోరంటాలు తీరు గోరంటాలు 
ఎనుగూల కట్టె ఎర్రొద్దురాక్షలు 

రాను తంగెడు పువ్వు పోను తంగెడు పువ్వు 
ఘనమైన పొన్నపూలే గజ్జాల వడ్డాణమే 
ఆ పూలు తెప్పించి పొందుగా పేరిచి 
గంధములు పూయించి పసుపు కుంకుమలు పెట్టి 
నీ నోము నీకిత్తునే గౌరమ్మ
నా నోము నాకియ్యవే గౌరమ్మ’’ అంటూ పాడుకుంటారు తెలంగాణ ఆడపడుచులు! ఇక బతుకమ్మ పేర్చిన తర్వాత ఊరంతా ఒక్కచోట చేరి.. చప్పట్లూ కొడుతూ పాటలు పాడుతూ అమ్మవారిని కొలుస్తారు.

చదవండి: Bathukamma: బతుకమ్మ పండుగ.. నేపథ్యం గురించి తెలుసా?

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top