
సోషల్ మీడియా వేదికగా అసామాన్య సామాన్యుల గురించి పరిచయం చేస్తుంటారు పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్రా. తాజాగా ఆయన తమిళనాడులోని పొల్లాచికి చెందిన కిట్టమ్మాళ్ గురించి పోస్ట్ పెట్టారు.శక్తికి వయసు అడ్డుకాదని నిరూపించింది 82 సంవత్సరాల కిట్టమ్మాళ్. పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్స్‌లో పాల్గొనే కిట్టమ్మాళ్ ఉత్సాహానికి కేరాఫ్ అడ్రస్.
‘ఎనభై రెండు సంవత్సరాల వయసులో ఆమె పైకెత్తేది బరువులను కాదు. మనలో దాగి ఉన్న ఆత్మవిశ్వాసాన్ని. కలలు కలడానికి, ఆ కలలు నెరవేర్చుకోవడానికి వయసు అడ్డుకాదని మరోసారి నిరూపించిన మహిళ’ అంటూ కిట్టమ్మాళ్ విల్‌పవర్‌ను కొనియాడారు ఆనంద్ మహీంద్రా.
కునియముత్తూరులో జరిగిన ‘స్ట్రాంగ్ ఉమెన్ ఆఫ్ సౌత్ ఇండియా’ పోటీలో పాల్గొన్న కిట్టమ్మాళ్ 17 మంది మహిళలతో పోటీ పడింది. ఈ మహిళలందరూ 30 కంటే తక్కువ వయసు ఉన్నవారే! డెడ్‌లిఫ్టింగ్ 50 కేజీల విభాగంలో అయిదో స్థానంలో నిలిచింది. తన మనవళ్లు రోహిత్, రితిక్ నుంచి స్ఫూర్తి పొందిన కిట్టమ్మాళ్ బామ్మ పవర్‌లిఫ్టింగ్‌లో పవర్ చాటుతోంది.
బరువులు ఎత్తడం ఆమెకు కొత్తేమీ కాదు. 25 కిలోల బియ్యం బస్తాలను అవలీలగా మోసుకెళ్లేది. ‘నేను తీసుకునే ఆహారమే నా శక్తి’ అంటున్న కిట్టమ్మాళ్ సంప్రదాయ, పోషక విలువలతో కూడిన ఆహారానికిప్రాధాన్యత ఇస్తుంది.