
అడూర్ గోపాలకృష్ణన్.. సినీఫైల్స్ ముఖ్యంగా న్యూవేవ్ మూవీ లవర్స్‌కి అభిమాన దర్శకుడు. స్క్రిప్ట్ రైటర్,ప్రోడ్యూసర్ కూడా అయిన అడూర్ గోపాలకృష్ణన్.. ‘స్వయంవరం’ సినిమాతో మలయాళ చిత్రపరిశ్రమలో న్యూవేవ్ మూవీకి రీళ్లు పరిచాడు. అంతేకాదు ‘చిత్రలేఖ ఫిల్మ్ సొసైటీ అండ్ చలచిత్ర సహకరన సంఘం’ను స్థాపించి చిత్రనిర్మాణంలో కో ఆపరేటివ్ సెక్టార్‌కు ఆద్యుడిగా నిలిచాడు. అంతటి దూరదృష్టి కల అడూర్ అనవసరంగా నోరుపారేసుకుని అతని అభిమానుల ఆగ్రహానికీ పాత్రుడయ్యాడు.
ఏమన్నాడంటే..
కేరళ రాష్ట్ర ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్.. షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలు, మహిళా ఫిల్మ్‌మేకర్స్‌ను ప్రోత్సహించేందుకు కోటిన్నర రూపాయల ఫండ్‌ను అందిస్తోంది. ఈ ఫండ్ అనుకున్న అవుట్‌కమ్‌ను అందించట్లేదు కాబట్టి దీన్ని పునరుద్ధరించడమే కాక, ఆ ఫండ్‌ను ఇచ్చేముందు వాళ్లకు నిపుణుల చేత మూడు నెలల పాటు శిక్షణనిప్పించాలని అంటాడు అడూర్ గోపాలకృష్ణన్.
వాళ్లకిస్తున్న ఫండ్ ప్రజల సొమ్మని.. క్వాలిటీ ఫిల్మ్స్ తీయడానికి ఉపయోగించాలనే స్పృహ వాళ్లకు కల్పించాలనీ కామెంట్ చేశాడు. అలాగే సినిమారంగంలోకి అడుగుపెట్టే మహిళల విషయంలో కూడా ఓ మాట విసిరాడు. మహిళలు అయినంత మాత్రాన ఫండ్ ఇవ్వకూడదని.. వాళ్లకూ సునిశిత శిక్షణనిచ్చాకే ఫండ్‌ను గ్రాంట్ చేయాలన్నాడు. అంతేకాదు ఒక్కొక్కరికీ కోటిన్నర రూపాయలు ఇచ్చేబదులు రూ. యాభై లక్షల చొప్పున ముగ్గురికి పంచాలనే సలహా కూడా ఇచ్చాడు.
ఏ సందర్భంలో అన్నాడంటే..
మలయాళ చిత్రపరిశ్రమలో వివక్షను రూపుమాపేందుకు తీసుకురావాల్సిన పాలసీ మీద కేరళరాష్ట్ర ప్రభుత్వం తిరువనంతపురంలో ఇటీవల రెండు రోజుల సమావేశమొకటి నిర్వహించింది. దానికి హాజరైన అడూర్ గోపాలకృష్ణన్ అలా మాట్లాడి సంచలనానికి కేంద్రమయ్యాడు. అతని ఈ వ్యాఖ్యల పట్ల దళిత రచయితలు, యాక్టివిస్ట్‌లు, స్త్రీవాదులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు.
ఏదైనా మాట్లాడొచ్చు అనుకోవడం కరెక్ట్ కాదు
ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా ఎన్నో పథకాలను ప్రవేశపెడుతుంది. వాటి అమలులో ఎంతోకొంత ప్రజాధనం వృథా అవుతుంది. అలాగే ఆర్ట్, కల్చర్, ఫిల్మ్‌మేకింగ్‌లో ఎస్సీ, ఎస్టీ, మహిళలను ప్రోత్సహించడానికి కేరళ ప్రభుత్వం అందిస్తున్న ఫండ్‌ను ఎవరూ వ్యతిరేకించాల్సిన పనిలేదు. ఆ ఫండ్‌ను ఇచ్చే ముందు మూడునెలలు వాళ్లకు సినిమాతీయడమెలాగో నేర్పించాలి అనేది ఇంపాజిబుల్ థింగ్. సినిమా క్రాఫ్ట్‌ను నేర్పించగలరమో కానీ.. ఏం తీయాలన్నది ఎవరూ ఎవరికీ నేర్పించలేరు. ఏం తీయాలన్నది వ్యక్తిగత చాయిస్.
తరతరాలుగా వాళ్లు పడ్డ బాధ, అనుభవించిన వేదనను ఎలా పిక్చరైజ్ చేయాలో మనమెలా చెబుతాం? వాళ్ల ఆలోచనలకు తెరరూపం కల్పించే అవకాశమివ్వడంలో తప్పేముంది! పైగా ఓ కమిటీని పెట్టి, స్క్రూటినీ చేసి, అర్హులైన వాళ్లకే ఇస్తామంటున్నారు. ఇంక ప్రాబ్లమేంటీ? నేను ఎస్సీ, ఎస్టీ.. అమ్మాయిని అని చెప్పుకోగానే ఫండ్ గ్రాంట్ చేయట్లేదు కదా! వందల ఏళ్లుగా మహిళలు, షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల వాళ్లు అనుభవిస్తున్న పీడన, చేస్తున్న స్ట్రగుల్‌కి ఎంతిచ్చినా తక్కువే. అలాంటి వాళ్లను ప్రోత్సహించడానికి ప్రభుత్వం చొరవ తీసుకున్నప్పుడు బాధ్యతగల ఫిల్మ్‌మేకర్‌గా అడూర్ గోపాలకృష్ణన్ అలా మాట్లాడకూడదు.
ఆయన ఇనీషియల్ డేస్‌లో ఆయనేం తీస్తారో తెలియకుండానే కదా ఆయనకు ఫస్ట్ చాన్స్ వచ్చుంటది! అలాగే ఇప్పుడు వీళ్లలోంచీ అద్భుతమైన ఫిల్మ్‌మేకర్స్ రావచ్చు.. కళాకారులు రావచ్చు. గవర్నమెంట్ ఒక మంచి ప్రయత్నం చేస్తుంటే ప్రశంసించాలి కానీ నీరుగార్చకూడదు. పెద్దవాళ్లం కాబట్టి, చేతిలో నాలుగు అవార్డులున్నాయి కాబట్టి ఏదైనా మాట్లాడొచ్చు అనుకోవడం కరెక్ట్ కాదు నా ఉద్దేశంలో. – కరుణ కుమార్, సినీ దర్శకుడు, నటుడు