Acid Attack Survivor Yasmeen: దేశంలోనే తొలి యాసిడ్‌ సర్వైర్‌ నర్స్‌

From acid attack survivor to AIIMS nursing officer - Sakshi

Acid Attack Survivor Yasmeen Mansoori: ఎవరో మూర్ఖంగా చేసిన పనికి ముఖం కాలిపోయింది, కళ్లు తెరవలేని పరిస్థితి. అయినా జీవితం మీద ఆశలు వదులుకోలేదు. ఇరవై సర్జరీలు చేయించుకున్నా, ముఖం పూర్వస్థితికి రాలేదు. ఏ మాత్రం నిరాశపడకుండా కష్టపడి చదివి ఏకంగా ఎయిమ్స్‌లో నర్సింగ్‌ ఆఫీసర్‌ అయ్యింది యాస్మిన్‌ మన్సూరి. చిన్నపాటి కష్టాలను సాకులుగా చూపుతూ లక్ష్యం లేకుండా, నిర్లక్ష్యంగా బతుకుతోన్న ఎంతోమందికి ప్రేరణగా నిలుస్తోంది యాస్మిన్‌.

అది 2004.. ఉత్తర్‌ ప్రదేశ్‌లో షామిలీ జిల్లాలో ఉంటోన్న యాస్మిన్‌ వాళ్ల కుటుంబం జీవనం ఎంతో ఆనందంగా సాగిపోతుంది. అప్పుడు యాస్మిన్‌కు పదహారేళ్లు. ఒకరోజు వారిమీద కిట్టని వాళ్లెవరో యాసిడ్‌ పోశారు. ఈ దుర్ఘటనలో యాస్మిన్‌ చర్మం మూడు పొరల లోతు వరకు కాలిపోయింది. కళ్లు తెరిచే పరిస్థితి లేదు. తనతోపాటు ఉన్న చెల్లి శరీరం కూడా కాలింది. మంచి వైద్యం తీసుకునేందుకు యూపీ నుంచి ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్‌ ఆసుపత్రికి తరలించారు వారిని. కొన్నాళ్లు కుటుంబం మొత్తం అక్కడే ఉంటూ మెరుగైన వైద్యం చేయించుకున్నారు. చికిత్స తర్వాత ఇంటికి వచ్చాక కూడా ఆసుపత్రికి వెళ్లక తప్పని పరిస్థితి వారిది.

దీంతో రెండు వారాలకొకసారి ఢిల్లీ వెళ్లడం యాస్మిన్‌ జీవితంలో ఒక భాగమైంది. చికిత్సలో వాడే మందులు కొన్ని సైడ్‌ ఎఫెక్ట్స్‌ చూపించడంతో చాలా ఇబ్బందులకు గురైంది. ఈ అక్క చెల్లెళ్లను చూసిన వాళ్లు ‘‘ఈ పిల్లలను ఎవరు పెళ్లి చేసుకుంటారు, వీరికి అసలు పెళ్లి అవుతుందా?’’ అని గుసగుసలాడుకునేవారు. ఒకపక్క శారీరక బాధ, మరోపక్క గుండెల్లో గుచ్చుకునే మాటలు మానసికంగా బలహీన పరిచేవి. కొన్నాళ్లకు ఇలా కాదు. అయ్యిందేదో అయ్యింది. దానిని మార్చలేము కాబట్టి అలాగే ముందుకు సాగాలని నిర్ణయించుకుంది యాస్మిన్‌.
 

సేవలు నచ్చి...
సఫ్దర్‌ జంగ్‌ తర్వాత చికిత్స కోసం ఎయిమ్స్‌కు వెళ్లింది యాస్మిన్‌. అక్కడ కొంతమంది నర్సులు రోగుల పట్ల వ్యవహరిస్తున్న తీరు నచ్చడంతో తను కూడా నర్స్‌ అయ్యి సేవలందించాలనుకుంది. అనుకున్న వెంటనే దూరవిద్య ద్వారా ఇంటర్మీడియట్‌ చదువుతూనే, మరోపక్క కంప్యూటర్‌ కోర్సు చేసింది. ఆ తరువాత ఢిల్లీ యూనివర్సిటీలో బిఏలో చేరింది. ఒకపక్క బిఏ చేస్తూనే ‘జామియా హమ్దార్ద్‌ యూనివర్సిటీ’లో నర్సింగ్‌లో చేరింది. అయితే ఆర్ట్స్‌ సబ్జెక్ట్‌ చదవడం వల్ల నర్సింగ్‌ బాగా కష్టంగా అనిపించేది తనకు. మొదటి ప్రయత్నంలో ఫెయిల్‌ అయినప్పటికీ నిరాశ పడకుండా తరువాతి ప్రయత్నంలో పాస్‌ అయ్యింది.  

ఉత్తమ ఉద్యోగిగా
నర్సింగ్‌ అయిపోయిన వెంటనే  2014లో హకీమ్‌ అబ్దుల్‌ అహ్మద్‌ సెంటెనరీ ఆసుపత్రిలో ఉద్యోగం దొరికింది. ఇక్కడ రెండేళ్లు పనిచేసాక, మరో ఆసుపత్రిలో చేరింది. ఇక్కడ యాస్మిన్‌ సేవలకు గుర్తింపుగా ‘బెస్ట్‌ ఎంప్లాయీ అవార్డు’ వచ్చింది. ఒకపక్క ప్రైవేటు హాస్పిటల్స్‌లో చేస్తూనే మరోపక్క ప్రభుత్వ ఉద్యోగానికి ప్రిపేర్‌ అయ్యేది. ఇదే సమయంలో ఎయిమ్స్‌లో నర్సులు కావాలన్న ప్రకటన చూసి అప్లై చేసింది,. అర్హతలన్నీ ఉన్నప్పటికీ డిజెబిలిటీ నిబంధనలకు ఆమె సరిపోదని తిరస్కరించారు.

దీంతో యాసిడ్‌ సర్వైవర్‌ను కూడా డిజెబిలిటీ విభాగంలో చేర్చాలని ఢిల్లీ హైకోర్టులో పిటీషన్‌ వేసింది. ధర్మాసనం 2016లో డిజెబిలిటీ చట్టంలో కొన్ని సవరణలు చేసి యాసిడ్‌ సర్వైర్స్‌ను కూడా ఈ చట్టపరిధిలోకి చేర్చింది. దీంతో రెండేళ్ల తరువాత ఎయిమ్స్‌లో ఉద్యోగాన్ని పొంది, ‘‘దేశంలోనే తొలి యాసిడ్‌ సర్వైర్‌ నర్స్‌’’ గా రికార్డు సృష్టించింది. ఇక్కడ రోగులకు మంచి సేవలందించడంతో ‘ఫిజికల్లీ హ్యాండీక్యాప్డ్‌ పర్సన్‌’ విభాగంలో ‘బెస్ట్‌ ఎంప్లాయీ’ అవార్డును అందుకుంది.

‘‘ప్రస్తుతం దేశంలో ఎంతోమంది అమ్మాయిలు ఇప్పటికీ వెనుకబడే ఉన్నారు. అమ్మాయిల జీవితంలో పెళ్లి అతిముఖ్యమైన అంశంగా చూస్తారు. అది సరికాదు. పెళ్లికి ముందు మనకెన్నో కలలు ఉంటాయి. వాటిని నిజం చేసుకుని ఆ తర్వాతే, జీవితంలో ముందుకు సాగాలి’’ అని యువతకు చెబుతోంది.  
 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top