సుజలాం సుఫలాం

18 awards under Swachh Bharat Mission - Sakshi

వీరు సు‘జల’శక్తిమంతులు 

ఇంట్లో నీటి సమస్యను తీర్చడానికి దేశంలో చాలా చోట్ల మహిళలు పడే అవస్థల గురించి మనకు తెలిసిందే. అలాంటి ఊరందరి నీటి సమస్యను తీర్చాలంటే ఇంకెంత అవస్థ పడాలి. తమ గ్రామాలకు వచ్చిన నీటి కష్టం తీరాలంటే పూడుకుపోయిన చెరువును పునరుద్ధరించాలని, నదిని పునరుజ్జీవింపచేయాలని, కుళాయిలను ఏర్పాటు చేయాలనే ఆలోచనలు చేసి, దానిని అమలు చేస్తున్నారు గంగా రాజ్‌పుత్, గాయత్రీదేవి, శారదాదేవి, అనితా చౌదరి, కె.ఆశా. వీరిని కేంద్ర జల శక్తి మంత్రిత్వ శాఖ గుర్తించి ఈ యేడాది స్వచ్ఛ్‌ సుజల శక్తి సమ్మాన్‌ పురస్కారంతో సన్మానించింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శనివారం ఢిల్లీలో వీరికి అవార్డులు అందజేశారు. దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన ఈ మహిళలు పురుషాధిపత్యం పైనే కాదు, మూఢనమ్మకాలపైనా పోరాడుతూ తమ గ్రామాల్లో నీటి ఎద్దడి సమస్యను తీర్చడానికి నడుం కట్టారు.

గంగా ప్రవాహం...
మధ్యప్రదేశ్‌లోని ఛతర్‌పూర్‌కు చెందిన 35 ఏళ్ల గంగా రాజ్‌పుత్‌ తన గ్రామంలో తీవ్ర నీటి కొరతను తీర్చడానికి ఒక చెరువును పునరుద్ధరించాలని ఆలోచన చేసింది. ఈ క్రమంలో అయితే, ఆమె ఆలోచనను అమలులో పెట్టడానికి పితృస్వామ్యంపైనే కాదు మూఢనమ్మకాలపై కూడా పోరాడాల్సి వచ్చింది.

దశాబ్దాల క్రితం జరిగిన ఓ దుర్ఘటన కారణంగా గ్రామస్తులు చెరువును వదిలేశారు. దానిని పునరుద్ధరిస్తే ఎవరికైనా చెడు జరుగుతుందని స్థానికుల గట్టి నమ్మకం. దాంతో ఆ గ్రామంలో నీటి సంక్షోభం రోజు రోజుకూ తీవ్రతరం అవుతోంది. ఆ నీటి ఎద్దడిని తీర్చే ఏకైక ఆధారం ఆ చెరువే. ‘మూఢనమ్మకాలతో కన్నా నీటి కోసం చనిపోవడం మేలు’ అని అభ్యంతరం చెప్పిన ప్రతీసారి గ్రామస్తులకు పదే పదే చెబుతూ వచ్చింది గంగ. మెల్లగా ఓ పాతిక మంది మహిళలతో కూడిన బృందాన్ని ఏర్పాటు చేసింది. స్థానిక ఎన్జీవోల మద్దతుతో చెరువును శుభ్రం చేసి, పునరుద్ధరణ పనులు చేపట్టింది. ఊరికి నీటి ఎద్దడి తీరింది.

నదికి జీవకళ
గంగా రాజ్‌పుత్‌ మాదిరిగానే రాజస్థాన్‌లోని జైపూర్‌లో ఉంటున్న గాయత్రీదేవి సంభార్‌ సరస్సు చుట్టూ ఉన్న 15 గ్రామాలకు చెందిన మహిళలకు వర్షపు నీటి సంరక్షణలో సహాయం చేయడానికి కృషి చేస్తోంది. అలాగే, ఉత్తరప్రదేశ్‌లోని లలిత్‌పూర్‌కు చెందిన శారదాదేవి కూడా తన గ్రామంలోని నీటి ఎద్దడిని పరిష్కరించడానికి స్థానిక బారువా నదిని పునరుజ్జీవింపజేయడానికి తోటివారిని కార్యోన్ముఖులను చేసి విజయం సాధించింది. 

మధ్యప్రదేశ్‌లోని చింద్వార్‌ జిల్లాకు చెందిన అనితా చౌదరి తన గ్రామంలోని ఇతర మహిళలు నీటి కోసం పడే కష్టాలను చూసింది. ఈ సమస్యను పరిష్కరించే అవకాశం వచ్చినప్పుడు ఆమె వెనకడుగువేయలేదు. రెండేళ్లుగా తన గ్రామమైన గర్మౌలో ప్రభుత్వ హర్‌ ఘర్‌ జల్‌ పథకాన్ని అమలు చేయడానికి కృషి చేసింది. మరో అవార్డు గ్రహీత తమిళనాడులోని తిరువళ్లూరుకు చెందిన కె.ఆశా, తన గ్రామంలో ఏ ఇంటì  వద్ద కుళాయి నీటి సరఫరాలో చిన్న సమస్య వచ్చినా వెంటనే పరిష్కరిస్తుంది. 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top