కొయ్యలగూడెం: దిప్పకాయలపాడు పద్దమ్మ కోనేరు వద్ద ఈ నెల 14, 15 తేదీల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చెరువు గట్టును ఎత్తు పెంచి జంతు వ్యర్థాలతో చేపల పెంపకం నిర్వహిస్తున్నారని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కలుషిత నీరు తాగి పశువులు రోగాల బారిన పడి మృత్యువాత పడుతున్నాయని రైతులు వాపోయారు. వరద సమయంలో నీరు పోటెత్తి గొల్లగూడెం ప్రాంతం, ఇళ్లు ముంపునకు గురవుతున్నాయని, సీసీ రోడ్లు, డ్రైనేజీలు దెబ్బతింటున్నాయని ఆవేదన వెలిబుచ్చారు. చెరువును 30 ఏళ్ల క్రితం నాటి పూర్వ స్థితికి మార్చాలని, గట్టు ఎత్తు పెంచడం వల్ల ఇళ్లు కూలిపోయే ప్రమాదం ఉందని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జువ్వ గంగరాజు, చుండ్రు బాలాజీ, పదిలం వెంకటేశ్వరరావు, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.
రజకుల ఆందోళన
మరోవైపు, ఇదే కోనేరు వివాదంపై రజక కుటుంబాలు మండల పరిషత్ కార్యాలయం ఎదుట మంగళవారం భైటాయించి ధర్నా చేపట్టారు. రజక సంఘం జిల్లా అధ్యక్షుడు కడకట్ల గడ్డియ్య మాట్లాడుతూ.. దశాబ్దాలుగా ఈ కోనేరు వద్ద కులవృత్తి చేసుకుంటూ ఫలసాయం పొందుతున్నామని తెలిపారు. చెరువు గట్లు తొలగించడం, పూడ్చివేయడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ఏడాది కాలంగా ఓ వర్గంతో వివాదం నడుస్తోందని, పంచాయతీ కార్యదర్శి తమ సమస్యను పక్కదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. దీనిపై పంచాయతీ ప్రత్యేకాధికారి కె.సురేష్‌తో మాట్లాడగా, ఆయన సూచనలతో చెరువు తవ్వకం పనులను నిలిపివేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు అక్కడ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో కడెల్లి సుబ్బయ్య, ఎలమంచిలి నాగశేషు, కడకట్ల జయలక్ష్మి, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.


