జంగారెడ్డిగూడెం (చింతలపూడి): గురవాయిగూడెం మద్ది ఆంజనేయస్వామి దేవస్థానంలో మంగళవారం ఆలయ అర్చకులు విశేష పూజలు నిర్వహించారు. సుదూర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు 108 ప్రదక్షిణలు చేసి స్వామిని దర్శించి తమ మొక్కుబడులు చెల్లించుకున్నారు. స్వామివారికి వివిధ సేవల రూపంలో రూ.2,10,650 ఆదాయం సమకూరినట్లు అధికారులు తెలిపారు. సుమారు 2,706 మంది భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు.
20 నుంచి గర్భాలయ దర్శనం నిలిపివేత
మద్ది ఆంజనేయ స్వామి దేవస్థానంలో ఈ నెల 20 నుంచి 23వ తేదీ వరకు పవిత్రోత్సవాలు నిర్వహించనున్నట్లు ఆలయ వర్గాలు తెలిపాయి. ఉత్సవాల్లో గర్భాలయ దర్శనాన్ని తాత్కాలికంగా నిలిపివేయనున్నట్లు పేర్కొన్నారు. తిరిగి ఈ నెల 23న బుధవారం మధ్యాహ్నం 3 గంటల నుంచి భక్తులకు స్వామి వారి గర్భాలయ దర్శనం పునః ప్రారంభిస్తామని ఆలయ ధర్మకర్తల మండలి అధ్యక్షుడు రాజాన సత్యనారాయణ, ఆలయ అసిస్టెంట్ కమిషనర్, కార్యనిర్వహణాధికారిణి ఆర్‌వీ చందన ఒక ప్రకటనలో తెలియజేశారు.


