దివికేగిన వివాదరహితుడు | - | Sakshi
Sakshi News home page

దివికేగిన వివాదరహితుడు

Sep 16 2026 3:25 AM | Updated on Sep 16 2026 3:25 AM

ఆత్మీయుడిని కోల్పోయా

రాజకీయ ప్రస్థానం

గుండెపోటుతో మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని కన్నుమూత

ఏలూరులో తీవ్ర విషాదం

సాక్షి ప్రతినిధి, ఏలూరు: మూడు దశాబ్దాలపాటు క్రియాశీల రాజకీయాల్లో కొనసాగి, ఏలూరు అభివృద్ధిలో తనదైన ముద్ర వేసి, వివాదరహితుడిగా పేరొందిన మాజీ ఉప ముఖ్యమంత్రి, ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్‌ (నాని) మంగళవారం గుండెపోటుతో విశాఖపట్నంలో మృతి చెందారు. ఆయన పార్థివ దేహాన్ని రాత్రి ఏలూరులోని శ్రీరామ్‌నగర్‌ నివాసానికి తీసుకురావడంతో నగరంలో తీవ్ర విషాదఛాయలు అలముకున్నాయి.

నగర అభివృద్ధిలో కీలక పాత్ర : ఏలూరు ఎమ్మెల్యేగా, మంత్రిగా ఆయన నగర అభివృద్ధికి ఎనలేని కృషి చేశారు. తమ్మిలేరు రిటైనింగ్‌ వాల్‌ నిర్మాణం, తాగునీటి సమస్య పరిష్కారానికి 100 ఎకరాల్లో సమ్మర్‌ స్టోరేజ్‌ ట్యాంక్‌ ఏర్పాటు చేశారు. ప్రతిష్టాత్మక ఏలూరు ప్రభుత్వ వైద్య కళాశాలను వేగవంతంగా పూర్తిచేసి అడ్మిషన్లు ప్రారంభించడంలో ఆయన పాత్ర కీలకం.

ఏలూరుకు నాని పార్థీవదేహం

నాని తండ్రి, సోదరుడు కూడా గతంలో గుండెపోటుతోనే మరణించగా, ఇప్పుడు ఆయన కూడా అదేరీతిలో కన్నుమూయడంతో కుటుంబసభ్యులు తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయారు. వైఎస్సార్‌సీపీ ఏలూరు సమన్వయకర్త మామిళ్లపల్లి జయప్రకాష్‌, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి తదితరులు ఆయన నివాసానికి చేరుకుని నివాళులర్పించి, నాని భార్య ఫణిరేఖ, సోదరుడు సురేష్‌లను పరామర్శించారు. విదేశాల నుంచి ఆయన కుమారులు బుధవారం రాత్రికి చేరుకున్న అనంతరం, గురువారం అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు.

చిరకాల మిత్రుడు ఆళ్ల నానిని కోల్పోవడం అత్యంత దురదృష్టకరం. యువజన కాంగ్రెస్‌ నుంచి సన్నిహితంగా ఉండేవాళ్ల. దురదృష్టవశాత్తు ఆయన మరణించారనే నిజాన్ని నమ్మలేకపోతున్నాను. ఆయన జ్ఞాపకాలు ఎప్పటికీ మా హృదయాల్లో నిలిచి ఉంటాయి. ఏలూరు ప్రజలకు ఆయన అందించిన సేవలు కూడా చిరస్మరణీయంగా ఉంటాయి.

– మామిళ్ళపల్లి జయప్రకాష్‌, వైఎస్సార్‌ సీపీ ఏలూరు నియోజకవర్గ సమస్వయకర్త

1994లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన ఆళ్ల నాని.. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రోత్సాహంతో కాంగ్రెస్‌ పార్టీలో బలమైన నేతగా ఎదిగారు. ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసి 2004, 2009 ఎన్నికల్లో వరుసగా విజయం సాధించారు. 2013లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడిగా సేవలు అందించారు. 2017లో ఎమ్మెల్యే కోటాలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. 2019లో ఎమ్మెల్యేగా గెలుపొంది, వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంత్రివర్గంలో ఉప ముఖ్యమంత్రిగా, వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. 2024 ఎన్నికల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలై గతేడాది తెలుగుదేశం పార్టీలో చేరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement