ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): జంగారెడ్డిగూడెం ఆర్టీసీ డిపో డ్రైవర్ బి. రామారావుపై విధించిన అక్రమ సస్పెన్షన్‌ను వెంటనే రద్దు చేయాలని ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ విజయవాడ జోనల్ సెక్రటరీ వై. శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. ఎంప్లాయీస్ యూనియన్ ఏలూరు రీజినల్ అధ్యక్షుడు కొలుసు వీరరాఘవులు అధ్యక్షతన మంగళవారం కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఎలాంటి సంబంధం లేని ఘటనలో డ్రైవర్ రామారావును సస్పెండ్ చేయడం అన్యాయమన్నారు. ముందుగా ఆర్టీసీ కార్మికులు కపర్ధి భవన్ నుంచి గ్యారేజ్, జిల్లా పరిషత్ కార్యాలయం మీదుగా కలెక్టరేట్ వరకు ప్రదర్శన నిర్వహించారు. అనంతరం ఏలూరు రీజినల్ డిపిటిఓ షబ్నమ్‌కు వినతిపత్రం అందజేశారు. ధర్నాకు అమరావతి జేఏసీ జిల్లా అధ్యక్షుడు కె.రమేష్ కుమార్, ఐఏటీయూసీ జిల్లా కార్యదర్శి రెడ్డి శ్రీనివాస్ డాంగే, ఉపాధ్యక్షుడు బండి వెంకటేశ్వరరావు సంఘీభావం తెలిపారు.
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): విద్యార్థుల్లో సైన్స్ పట్ల ఆసక్తి, సృజనాత్మకతను పెంపొందించేందుకు నిర్వహించే ఇన్‌స్పైర్ మనక్ పోటీల దరఖాస్తు గడువును అక్టోబర్ 10వ తేదీ వరకు పొడిగించినట్లు జిల్లా సైన్స్ అధికారి ఎస్.వి.ఎస్. సోమయాజులు తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. జిల్లా నుంచి ఇప్పటివరకు 1,462 దరఖాస్తులు వచ్చాయని, మరింత మంది విద్యార్థులు పాల్గొనేలా విద్యాశాఖాధికారులు, ప్రధానోపాధ్యాయులు ప్రోత్సహించాలని కోరారు.


