ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): వీఎస్‌ఎస్ పరిధిలోని భూములకు సంబంధించి ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుని అర్హులైన రైతులకు పట్టాలు మంజూరు చేయాలని వీఎస్‌ఎస్ మాజీ అధ్యక్షుడు చెరువుల వెంకటరత్నం డిమాండ్ చేశారు. మంగళవారం కలెక్టరేట్ వద్ద సీపీఐ(ఎంఎల్), అఖిల భారత రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ 1992లో లింగపాలెం మండలం వేములపల్లిలో 300 మంది సభ్యులతో అటవీ సంరక్షణ కమిటీగా ఏర్పడి, 110 ఎకరాల భూమిలోని ముళ్ల పొదలను తొలగించి సాగు యోగ్యంగా మార్చామని తెలిపారు. అయితే ఇప్పటికీ పట్టాలు రాకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, అధికారులు స్పందించి వీఎస్‌ఎస్ సభ్యులతో సమావేశం ఏర్పాటు చేసి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరారు.


