జంగారెడ్డిగూడెం: ప్రభుత్వ ఆసుపత్రులలో రోగులకు అందుతున్న వైద్యసేవలుపై ప్రజల్లో సంతృప్తి స్థాయి మరింత పెరగాలని, ఆసుపత్రి నిర్వహణపై రోగుల నుంచి ఏ ఒక్క ఫిర్యాదు వచ్చినా శాఖాపరమైన కఠిన చర్యలు తప్పవని రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ సోళ్ల బొజ్జిరెడ్డి స్పష్టం చేశారు. జంగారెడ్డిగూడెం ప్రభుత్వ ఆస్పత్రిని శుక్రవారం ఆయన కమిషన్ సభ్యులతో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని బాలింతల వార్డు, అవుట్ అండ్ ఇన్ పేషెంట్ల వార్డులు, సమాచార కేంద్రం తదితర విభాగాలను క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రికి గిరిజన ప్రాంతాల నుండి ఎక్కువ మంది వస్తుంటారని, వారికి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎస్టీ కమిషన్ సభ్యులు కాకి లక్ష్మి, గొర్లె సునీత, ఐటీడీఏ పీఓ కె.రాములు నాయక్, డీసీహెచ్‌ఎస్ సీహెచ్. బేబీకమల తదితరులు పాల్గొన్నారు.
భీమవరం: గత పన్నెండేళ్లలో కేంద్ర ప్రభుత్వం సాధించిన ప్రగతి, సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువ చేయడంలో మీడియా పాత్ర అత్యంత కీలకమని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమలశాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ అన్నారు. శుక్రవారం భీమవరం డీఎన్నార్ కళాశాల వద్ద ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) జర్నలిస్టుల కోసం ఏర్పాటు చేసిన వార్తాలాప్ వర్క్‌షాప్‌ను శ్రీనివాసవర్మ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ పాకా వెంకట సత్యనారాయణ, కలెక్టర్ చదలవాడ నాగరాణి, పీఏబీ డైరెక్టర్ సురేష్ కుమార్ పాల్గొన్నారు.
తణుకు అర్బన్: ప్రమాదవశాత్తూ కాలువలో పడి వ్యక్తి మృతి చెందిన ఘటన తణుకు మండలం మండపాకలో శుక్రవారం చోటు చేసుకుంది. ఆచంట గ్రామానికి చెందిన కవ్వల నాగరాజు (51) గత మూడు రోజుల క్రితం పైడిపర్రులోని బంధువుల ఇంటికి వచ్చారు. గురువారం సాయంత్రం మండపాక కాలువలో స్నానం కోసం దిగి ప్రమాదవశాత్తూ గల్లంతయ్యాడు. గురువారం మండపాక వద్ద నాగరాజు మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు తణుకు రూరల్ పోలీసులకు సమాచారం అందించారు. మృతుడి కుమారుడు కవ్వల రాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు రూరల్ హెడ్ కానిస్టేబుల్ నాగభూషణం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు నాగరాజు గంగిరెద్దులతో సంచార జీవనం గడుపుతున్నట్లుగా పోలీసులు తెలిపారు.
కుక్కునూరు: రోడ్డు ప్రమాదంలో యువకుడు గాయాల పాలైన ఘటన శుక్రవారం మండలంలోని కమ్మరిగూడెం గ్రామంలో చోటు చేసుకుంది. వివరాల ప్రకారం కివ్వాక గ్రామానికి చెందిన యువకుడు బంజరగూడెం గ్రామం వైపు బైక్‌పై వెళ్తుండగా కమ్మరిగూడెం వద్ద ట్రాక్టర్‌ను ఓవర్ టెక్ చేసే క్రమంలో ట్రాక్టర్‌ను ఢీకొన్నాడు. దీంతో యువకుడి తలకు గాయమైంది. వెంటనే స్థానికులు యువకుడిని అమరవరం ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.
బాలికపై బ్లేడుతో
యువకుడి దాడి
తణుకు అర్బన్: బాలికపై యువకుడు దాడికి పాల్పడిన ఘటన తణుకులో శుక్రవారం చోటు చేసుకుంది. వివరాల ప్రకారం తణుకు పాతవూరులో నివసిస్తున్న బాలిక ఇంట్లోకి ప్రవేశించిన యువకుడు జాషువా తన కూడా తెచ్చుకున్న మడత బ్లేడుతో దాడికి దిగాడు. బాలిక తణుకులోని ఒక కళాశాలలో ఇంటర్మీడియేట్ రెండో సంవత్సరం చదువుతుంది. అదే ప్రాంతంలో ఉంటున్న యువకుడు జాషువా గత కొన్ని నెలలుగా బాలిక వెంటపడుతున్నాడు. 6 నెలల క్రితం వేధింపులకు దిగిన సందర్భంలో పోలీసులకు ఫిర్యాదు చేయగా జాషువాను స్టేషన్‌కు రప్పించి హెచ్చరించారు. అయితే శుక్రవారం ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి దాడికి దిగినట్లుగా తెలుస్తోంది. ఈ దాడిలో బాలికకు స్వల్పగాయాలు కావడంతో బాధిత కుటుంబ సభ్యులు ఊపిరిపీల్చుకున్నారు. ప్రస్తుతం బాలిక తణుకు జిల్లా కేంద్ర ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది. ఘటన జరిగిన వెంటనే పట్టణ సీఐ జె.వెంకటరమణ, పట్టణ ఎస్సై సత్యనారాయణ ఆస్పత్రికి వచ్చి బాధిత బాలికను విచారించి స్టేట్‌మెంట్ తీసుకున్నారు.


