పాత పద్ధతిలోనే చదువులు కొనసాగించాలి | - | Sakshi
Sakshi News home page

పాత పద్ధతిలోనే చదువులు కొనసాగించాలి

Jun 20 2026 5:52 AM | Updated on Jun 20 2026 5:52 AM

బుట్టాయగూడెం: రాష్ట్రంలోని అన్ని గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో పాత పద్ధతిలోనే గిరిజన బిడ్డలు చదువులు సాగించేలా ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు అన్నారు. మండలంలోని మారుమూల గ్రామమైన పులిరామన్నగూడెంలో పాఠశాల కుదింపును నిరసిస్తూ గ్రామస్తులు చేస్తున్న నిరసన ఆందోళన కార్యక్రమానికి శుక్రవారం మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా గ్రామస్తులతో పాటే నేలపై కూర్చుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం జీఓ నంబర్‌ 57ను తీసుకొచ్చి రేషనలైజేషన్‌ పేరుతో గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలను కుదిస్తే గిరిజన పిల్లలు చదువులకు దూరమయ్యే పరిస్థితి ఉందన్నారు. కొత్త విధానం వల్ల గిరిజన విద్యార్థులు బడులకు దూరమై మళ్లీ అడవిలోకి వెళ్లే పరిస్థితి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ అనాలోచిత చర్యల వల్ల గిరిజన విద్యార్థుల భవిష్యత్‌ ప్రశ్నార్థకంగా మారుతుందన్నారు. విద్యా శాఖ మంత్రి నారా లోకేష్‌ తీసుకునే అనాలోచిత నిర్ణయాల వల్ల గిరిజన విద్యార్థులు చదువుకు దూరమవుతున్నా రన్నారు. ప్రభుత్వం పునరాలోచన చేసి పాత పద్ధతిని కొనసాగించాలని కోరారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ పాలనలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గిరిజన ప్రాంతంలో మూత పడిన అనేక పాఠశాలలను తెరిపించి ప్రతి గిరిజన విద్యార్థికీ చదువు అందేలా కృషి చేశారన్నారు. కూటమి ప్రభుత్వం తీరు మార్చుకోకపోతే 2029లో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మళ్లీ పాత పద్ధతిలోనే అన్ని పాఠశాలల్లో గిరిజన విద్యార్థులకు చదువులు అందేలా కృషి చేస్తామని తెల్లం బాలరాజు హామీ ఇచ్చారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యుడు మొడియం రామతులసి, వైస్‌ ఎంపీపీ గగ్గులోతు మోహన్‌రావు, వైఎస్సార్‌ సీపీ నాయకులు యోహాన్‌ నాయక్‌, షేక్‌ ముత్తూ సాహెబ్‌, న్యాయవాది ఏసుబాబు, సీపీఐ నాయకులు బేతి కిశోర్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement