నిధులు నిల్.. సమస్యలు ఫుల్
ఎన్నికలకు వెళ్లే ధైర్యం లేదు
ఆకివీడు: పల్లెలే దేశానికి పట్టుగొమ్మలు.. దేశాభివృద్ధి గ్రామసీమలపైనే ఆధారపడి ఉంటుంది. ప్రజాపాలనలో ఎంతో ప్రాధాన్యమున్న స్థానిక సంస్థలపై రాష్ట్రంలోని చంద్రబాబు ప్రభుత్వం చిన్నచూపు చూస్తోంది. గ్రామ స్వరాజ్యమే లక్ష్యంగా గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం తీసుకువచ్చిన గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలను ఇప్పటికే నిర్వీ ర్యం చేసింది. తాజాగా గ్రామ పంచాయతీల పాలకవర్గాల గడువు ముగిసినా ఎన్నికలు నిర్వహించకుండా ప్రత్యేక అధికారుల పాలనను తీసుకువచ్చింది. ఇప్పటికే ఆయా గ్రామాలకు ప్రత్యేకాధికారులను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ప్రత్యేకాధికారులు బాధ్యతలు చేపట్టారు. మండల స్థాయిలోని అన్ని శాఖల అధికారుల్ని ప్రత్యేక అధికారులుగా నియమించారు. కొన్నిచోట్ల రెండు, మూడు గ్రామాలకు కలిపి ఒక అధికారిని ప్రత్యేక అధికారిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో జిల్లాలోని 409 పంచాయతీలకు గాను 390 పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించా రు. అత్యధిక పంచాయతీలు, వార్డు సభ్యులు వైఎస్సార్‌సీపీ మద్దతుదారులే ఉన్నారు. ఐదేళ్ల పాటు గ్రామ అభివృద్ధికి విశిష్ట సేవలందించిన ప్రజాప్రతినిధులు ఇటీవల పదవీ విరమణ చేశారు. ఈ నేపథ్యంలో సకాలంలో ఎన్నికలు నిర్వహించకుండా ప్రత్యేక అధికారుల పాలనకు తెరతీసింది.
అధికారులకు పని ఒత్తిళ్లు
కూటమి ప్రభుత్వంలో జిల్లా, మండల, గ్రామస్థా యి అధికారులకు పని ఒత్తిడి పెరిగింది. వీడియో కాన్ఫెరెన్స్‌లు, ఇతర సమావేశాలు, సంబంధిత శాఖల పనిఒత్తిళ్లతో ఇప్పటికే సతమతమవుతున్న అధికారులను గ్రామాల్లో ప్రత్యేకాధికారులుగా నియమించడంతో మరింత పనిభారం పెరిగింది. ఇప్పుడు గ్రామస్థాయి అధికారులతో పనిచేయించడం, ప్రజా సమస్యలపై దృష్టి పెట్టడం వీరికి ఇబ్బందే. మండల స్థాయిలో తహసీల్దార్, ఎంపీడీఓ, డిప్యూటీ ఎంపీడీఓ, పంచాయతీరాజ్, ఆర్‌అర్‌డబ్ల్యూఎస్, మండల విద్యాశాఖ, ఏపీఎంలు, అంగన్‌వాడీ ప్రాజెక్టు అధికారులతో పాటు ఇతర సీనియర్ అధికారులను కూడా ప్రత్యేక అధికారులుగా నియమించారు.
ఎన్నికలంటే భయమా..?
సకాలంలో స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్విహించాల్సి ఉండగా ప్రత్యేక అధికారుల పాలనతో కొంత కాలం గడిపేయాలని చంద్రబాబు ప్రభుత్వం చూస్తుందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కూటమి సర్కారు ఏర్పడి రెండేళ్లు కావస్తున్నా స్థానిక సంస్థలకు ఎన్నికల నిర్వహించడంలో వెనుకంజ వేస్తుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో రెడ్‌బుక్ రాజ్యాంగంతో ప్రజలు బెంబేలెత్తిపోయి, విసిగిపోయారు. ప్రజావ్యతిరేకత తీవ్రంగా ఉందనే భావనతో స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించడంలో సీఎం చంద్రబాబు వెనుకంజ వేస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
పంచాయతీలకు నిధులు ఆగిపోవడమే కాకుండా ఇతర గ్రాంటులు కూ డా వచ్చే అవకాశాలు కన్పించ డం లేదు. పాలకవర్గాలు లేకపోవడంతో ఆర్థిక సంఘ నిధులు వచ్చే అవకాశాలు లేవంటున్నారు. గత కొన్నేళ్లుగా పాలకవర్గం లేని కొన్ని పంచాయతీలకు ఆర్థిక సంఘ నిధులు మంజూరు కాలేదు. గ్రాంటులు చప్పబడిపోవడం, పంచాయతీ నిధులు అంతంత మాత్రంగానే ఉండటంతో పల్లెల్లో సమస్యల పరిష్కారానికి నిధుల లేమి ఏర్పడనుంది. దీంతో ప్రత్యేక అధికారులు ఖాళీ ఖజానాతో గ్రామాల అభివృద్ధికి, సమస్యల పరిష్కారానికి నిధులు ఎక్కడ నుంచి తీసుకువస్తారనే సందేహం వ్యక్తమవుతోంది. సమస్యల్ని చెప్పుకునేందుకు సచివాలయాలకు వెళ్లినా సంబంధిత ప్రత్యేక అధికారి లేరనే సమాధానాలు వస్తాయంటున్నారు. ప్రత్యేక అధికారి అందుబాటులో లేకపోవడంతో ప్రజాసమస్యలతో పరిష్కారంతో పాటు అభివృద్ధి పనుల కొనసాగింపు ప్రశ్నార్థకం కానుంది. ప్రత్యేక అధికారి దృష్టికి వెళ్లినా ఆయా సమస్యల పరిష్కారానికి నిధులలేమి అడ్డుకానుందంటున్నారు. ప్రత్యేక అధికారుల నియామకంతో చెక్‌పవర్ వచ్చినా ఆయా పనులకు సీఎంఎఫ్‌ఎస్ ద్వారా బిల్లులు తీసుకునేందుకు నిధుల కొరత ఎదురుకానుంది.
ప్రత్యేక పాలన.. పట్టాలెక్కేనా?
గ్రామాల్లో ప్రత్యేకాధికారుల పాలన
అధికారులకు మరింత ఒత్తిడి
ఇప్పటికే సచివాలయాలు నిర్వీర్యం
అడుగడుగునా ఆర్థిక నష్టాలే..
స్థానిక సంస్థలపై చంద్రబాబు నిర్లక్ష్యం
జిల్లాలో 409 పంచాయతీలు
పంచాయతీ ఎన్నికలకు వెనుకడుగు
గడువు ముగుస్తుందని తెలిసినా స్థానిక సంస్థలకు సకాలంలో ఎన్నికలు నిర్వహించే ధైర్యం లేకే ప్రత్యేక అధికారుల పాలనను చంద్రబాబు ప్రభుత్వం తీసుకువచ్చింది. సచివాలయ వ్యవస్థతో గత ప్రభుత్వంలో పల్లెలు ప్రగతి పథంలో నడిచాయి. ప్రజల ముంగిటే పాలన సాగింది. గత ప్రభుత్వంలో ఐదేళ్లూ స్థానిక సర్పంచ్‌లు, వార్డు సభ్యులు తమ సేవల్ని గ్రామాల అభివృద్ధికి వినియోగించారు. ఎప్పుడు స్థానిక సంస్థలు ఎన్నికలు నిర్వహించినా మూడొంతులకు పైగా విజయం వైఎస్సార్‌సీపీ మద్దతుదారులదే.
– పీవీఎల్ నర్సింహరాజు, వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి, ఉండి


