ఎన్‌హెచ్‌–165 విస్తరణకు గ్రహణం | - | Sakshi
Sakshi News home page

ఎన్‌హెచ్‌–165 విస్తరణకు గ్రహణం

Mar 23 2026 8:32 AM | Updated on Mar 23 2026 8:32 AM

అజ్జమూరు–వీరవాసరం బైపాస్‌కు బ్రేక్‌

ఆకివీడు: జాతీయ రహదారి–165 విస్తరణ పనులు ముందుకు కదలడం లేదు. పాలకొల్లు–పామర్రు రోడ్డుగా ఉన్న దీనికి జాతీయ రహదారి హోదా ఇచ్చి నంబర్‌ కేటాయించిన తర్వాత విస్తరణ పనుల్లో పలు మార్పులు, చేర్పులు చోటుచేసుకున్నాయి. సుమారు దశాబ్ద కాలంగా రోడ్డు విస్తరణ, అభివృద్ధి అంగుళం కూడా కదల్లేదు.

పీపీ రోడ్డును ఎన్‌హెచ్‌–165గా..

పాలకొల్లు–పామర్రు రోడ్డు (పీపీ రోడ్డు)ను పామర్రు–దిగమర్రు జాతీయ రహదారి నం.165గా గుర్తించిన తర్వాత రూ.1,200 కోట్లతో అభివృద్ధి పనులకు భూమి పూజ చేశారు. పామర్రు నుంచి ఆకివీడు వరకు ఒక ప్రాజెక్టుగా, ఆకివీడు నుంచి దిగమర్రు వరకూ 46 కిలోమీటర్ల మేర రెండో ప్రాజెక్టుగా టెండర్లు పిలిచారు. వర్కు ఆర్డర్లు పొందిన తర్వాత పామర్రు నుంచి ఆకివీడు వరకు పనులు మొదలుపెట్టారు. ఏలూరు, కృష్ణా జిల్లాల్లో పనులు కొనసాగుతున్నాయి. మండవల్లి వరకు జాతీయ రహదారి విస్తరణ, అభివృద్ధి పనులు మొదటి ప్రాజెక్టులో పూర్తి చేశారు. అయితే ఆకివీడు వరకు పనులు నత్తనడకన సాగుతున్నాయి. కై కలూరు ప్రాంతంలో అక్కడక్కడా పనులు కొంత మేర జరిగాయి. బైపాస్‌ పనులు కొనసాగుతున్నాయి. ఆలపాడు వద్ద రైల్వే ఓవర్‌ బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేశారు.

ఉప్పుటేరుపై వంతెనకు బ్రేక్‌

ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల సరిహద్దుగా ఉన్న ఉప్పుటేరుపై వంతెన నిర్మాణానికి బ్రేక్‌ పడింది. సంబంధిత కాంట్రాక్టర్‌ పనులు చేయడానికి వెనుకంజ వేస్తున్నట్టు తెలిసింది. దీంతో రెండేళ్లుగా వంతెన పనులు ఆగిపోయాయి. పనులు పిల్లర్ల దశలోనే ఉన్నాయి.

ఉప్పుటేరు నుంచి అజ్జమూరు బైపాస్‌ ఓకే

ఉప్పుటేరు వంతెన నుంచి బైపాస్‌ సౌకర్యం కల్పించారు. ఉప్పుటేరు, అయిభీమవరం, ఆకివీడు మీదు గా అజ్జమూరు గరువు వరకూ బైపాస్‌ రోడ్డుకు 37.50 ఎకరాల భూమి కొనుగోలు చేశారు. దీనికి సంబంధించి రూ.35 కోట్ల మేర నిధులు చెల్లించాల్సి ఉండగా ఇప్పటికే రూ.25 కోట్లు చెల్లించారు. మరో రూ.10 కోట్లు చెల్లించాల్సి ఉంది. అయిభీమవరం రోడ్డు వద్ద వెంకయ్య వయ్యేరు కాలువపై వంతెన నిర్మించాల్సి ఉంది. కాంట్రాక్టర్‌ పనులు ప్రారంభించడానికి ముందుకు రావడం లేదని ఎన్‌హెచ్‌ అధికారులు చెబుతున్నారు. ఈ ఏడాది వేసవిలో బైపాస్‌ రోడ్డుకు మట్టి పూడిక పనులు చేపట్టకపోతే వచ్చే ఏడాదిలోనే పనులు జరిగే అవకాశం ఉంది.

ఉన్నతాధికారి పరిశీలన

ఇటీవల రాష్ట్ర రహదారుల శాఖ ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు ఆకివీడు మండలంలోని అజ్జమూరు గురువు నుంచి కలిసిపూడి, పెదమిరం మీదుగా జక్కరం వెళ్లే ప్రాంతంలో పరిశీలించారు. ఉండి ప్రాంతంలోని ప్రస్తుత జాతీయ రహదారి ప్రాంతాన్ని పరిశీలించారు. అనంతరం కొత్త అలైన్‌మెంట్‌ మార్పుపై సూచనలు రావడం బైపాస్‌కు చుక్కెదురేనని స్థానికులు భావిస్తున్నారు.

ఆకివీడు మండలం అజ్జమూరు నుంచి వీరవాసరం వరకు కొత్తగా రూపొందించిన బైపాస్‌ మార్గంపై జాతీయ రహదారుల శాఖ పునః పరిశీలన చేయాలని ప్రతిపాదనలు వెనక్కి పంపినట్టు తెలిసింది. అజ్జమూరు, పెదపుల్లేరు, సీసలి, జక్కరం మీదుగా చినమిరం, తాడేరు మీదుగా వీరవాసరం చేరుకుంటుంది. సుమారు 46 కిలోమీటర్ల రోడ్డు బైపాస్‌తో 40 కిలోమీటర్లకు తగ్గిపోయే అవకాశం ఉంది. అయితే ఈ ప్రాంతంలో అధికంగా చేపల చెరువులు, వంతెనలు, ఇతరత్రా కల్వర్టులు అధికంగా ఉండటంతో పాటు అధిక వ్యయం భూమి కొనుగోలుకు చెల్లించాల్సి ఉంటుంది. సుమారు రూ.3,200 కోట్లకు ప్రతిపాదనలు వెళ్లాయి. దీంతో ఆ శాఖ ఉన్నతాధికారులు పునఃపరిశీలనకు పంపారు. మరో మార్గం ద్వార తక్కువ భూమి కొనుగోలుకు, వ్యయం తగ్గించే మార్గాలుంటే చూడాలని జాతీయ రహదారుల శాఖ సూచించింది. దీంతో సంబంధిత కన్సల్టెంట్‌ ఆయా ప్రాంతాల్ని పరిశీలించేందుకు చర్యలు ప్రారంభిస్తున్నట్టు తెలిసింది.

అలైన్‌మెంట్‌లో మార్పులు

అజ్జమూరు–వీరవాసరం బైపాస్‌పై పునరాలోచన

ఈ ఏడాది బడ్జెట్‌ కేటాయింపులు హుళక్కే

నత్తనడక పనులతో కదలని నిర్మాణం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement