నూజివీడు: పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా వంట గ్యాస్ కొరత నెలకొనడం ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. గృహ వినియోగ సిలిండర్‌పై ప్రభుత్వం రూ.60 పెంచినా సిలిండర్లు మాత్రం దొరకడం లేదు. ఇప్పటికే కమర్షియల్ సిలిండర్ల సరఫరాను నిలిపివేయడంతో హోటళ్లు, టిఫిన్ బండ్లు, నూడిల్స్, ఫ్రైడ్ రైస్ బండ్ల వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. తాజాగా వంట గ్యాస్ సిలిండర్ కోసం సైతం బుక్ చేసుకున్న తర్వాత వారం రోజుల నుంచి పది రోజులు ఆగాల్సిందేనని గ్యాస్ ఏజెన్సీల యజమానులు చెబుతున్నారు.
నూజివీడులో రెండు గ్యాస్ ఏజెన్సీలు ఉన్నాయి. సిలిండర్ బుక్ వేసి వారం కావస్తున్నా ఇప్పటికీ డెలవరీ కాలేదని, దీనిపై అడిగితే లోడు రావడం లేదని ఏజన్సీ నిర్వాహకులు చెబుతున్నారు. ప్రభుత్వం ఒకవైపు రెండు రోజుల్లోపు సరఫరా చేయాలని, గ్యాస్ కొరత లేదని చెబుతున్నా వాస్తవ పరిస్థితులు అందుకు విరుద్ధంగా ఉన్నాయి. రెండు ఏజెన్సీలలో కలిపి దాదాపు 45 వేల వరకు గ్యాస్ కనెక్షన్‌లున్నాయి. గ్యాస్ ఏజెన్సీల నంబర్లు కలవకపోవడంతో ఏజెన్సీల వద్దకు వెళ్లి గ్యాస్ బుక్ చేసుకోవాల్సి వస్తోంది. తర్వాత సిలిండర్ కోసం వేచి చూడాల్సివస్తోంది.
బ్లాక్ మార్కెట్‌లో రూ.3 వేలు
నూజివీడులో బ్లాక్‌లో సిలిండర్‌ను రూ.3 వేలకు, కమర్షియల్ సిలిండర్ రూ.3,500కు విక్రయిస్తున్నారు. బుక్ చేసుకున్న వినియోగదారులకు రాని వంట గ్యాస్ సిలిండర్లు బ్లాక్‌లో విక్రయించడానికి ఎలా వస్తున్నాయనేది అంతుబట్టడం లేదు. ఓటీపీ చెప్పిన తర్వాతే సిలిండర్ డెలివరీ చేస్తామని ప్రభుత్వం చెప్పినప్పుడు బ్లాక్ మార్కెట్‌కు సిలిండర్లు ఎలా వెళ్తున్నాయనేది ప్రశ్నార్థకం. గ్యాస్ బుక్ చేసుకున్నా.. ఓటీపీ రాకపోతే డెలివరీ బాయ్స్ సిలిండర్ ఇవ్వడం లేదని వినియోగదారులు వాపోతున్నారు. ఏజెన్సీ నిర్వాహకుల వద్దకు వెళ్లి అడిగితే ఇచ్చేశామంటూ సమాధానం చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
హోటళ్లలో పెరిగిన ధరలు
గ్యాస్ కొరతతో పట్టణంలోని హోటళ్ల యజమానులు అల్పాహారం ధరలను అమాంతం పెంచేశారు. ప్రతి ఐటమ్‌పై రూ.10 వరకూ అదనంగా వసూలు చేస్తున్నారు.
వంటకు తంటా
బ్లాక్ మార్కెట్‌లో సిలిండర్లు
రూ.3 వేల నుంచి రూ.3,500 వరకు..
సిలిండర్ సరఫరాలో ఆలస్యం
హోటళ్లలో పెరిగిన అల్పాహారం ధరలు


