కాలువ గట్టుపై ఆగని ‘పచ్చ’ దందా | - | Sakshi
Sakshi News home page

కాలువ గట్టుపై ఆగని ‘పచ్చ’ దందా

Feb 11 2026 7:43 AM | Updated on Feb 11 2026 7:43 AM

కాలువ

కాలువ గట్టుపై ఆగని ‘పచ్చ’ దందా

ద్వారకాతిరుమల: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కొందరు పచ్చ నేతల దందాలకు, దౌర్జన్యాలకు అడ్డూ అదుపూ లేకుండా పోయింది. సంపాదనే ధ్యేయంగా ప్రకృతి వనరులను సైతం దోపిడీ చేస్తూ రూ.కోట్లకు పడగలెత్తుతున్నారు. ఈ దోపిడీకి ద్వారకాతిరుమల మండల పరిధిలోని పోలవరం కుడి కాలువ గట్టు కేంద్రంగా మారింది. అధికారాన్ని అడ్డంపెట్టుకుని ఎర్ర మట్టిని యథేచ్ఛగా తవ్వుకుని, అమ్ముకుంటున్నారు. అయినా అధికారులు ఆ వైపు కన్నెత్తి చూడకపోవడంపై ప్రజలు మండిపడుతున్నారు.

నిత్యం మట్టి అక్రమ తవ్వకాలే..

పంగిడిగూడెం నుంచి గుణ్ణంపల్లి వరకు పోలవరం కుడి కాలువ గట్టుపై నిత్యం అక్రమ మట్టి తవ్వకాలు జరుగుతూనే ఉన్నాయి. స్థానికులు ఫిర్యాదులు చేస్తున్నా సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడంతో మట్టి దందా యథేచ్ఛగా సాగుతోంది. మండలంలోని నారాయణపురం పంచాయతీ గుళ్లపాడు గ్రామ పరిధిలోని పోలవరం కుడి కాలువ గట్టుపై కొద్ది రోజులుగా మట్టి తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. ఓ పచ్చ ముఠా రాత్రి, పగలు అనే తేడా లేకుండా జేసీబీ సహాయంతో ఎంతో విలువైన ఎర్ర మట్టిని తవ్వి ట్రాక్టర్ల ద్వారా చుట్టుపక్కల గ్రామాలకు తరలిస్తోంది. ఈ మట్టిని ఆయిల్‌పామ్‌ తోటల్లో రోడ్ల నిర్మాణానికి వినియోగిస్తున్నట్టు పలువురు చెబుతున్నారు. అలాగే టిప్పర్ల ద్వారా పెద్ద ఎత్తున మట్టి కాలువ కింద రొయ్యలు, చేపల చెరువులకు తరలిపోతోంది. ఒక్కో ట్రాక్టర్‌ గ్రావెల్‌ రూ.800కు, ఒక్కో టిప్పర్‌ మట్టిని రూ.10 వేలకు విక్రయించి, సొమ్ము చేసుకుంటున్నట్టు స్థానికులు చెబుతున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులెవరూ ఆ వైపు కన్నెత్తి చూడటం లేదు.

పునాదుల పేరుతో..

ఇంటి పునాదులకంటూ కొందరు పచ్చ నేతలు ఇష్టానుసారంగా మట్టిని కొళ్లగొట్టి, అమ్ముకుని, జేబులు నింపుకుంటున్నారు. పైకి గ్రామ అభివృద్ధికి, ప్రజల అవసరాలకని పెద్దపెద్ద మాటలు చెబుతున్నారు. కానీ వేలాది రూపాయలకు మట్టిని అమ్ముకుంటున్నారు. వాస్తవానికి సామాన్య ప్రజల అవసరాలకు ఈ మట్టి ఉపయోగపడటం లేదని స్థానికులు అంటున్నారు. ఈ మట్టి అక్రమ తవ్వకాలపై కాలువ జేఈ బాపూజీని వివరణ కోరేందుకు ప్రయత్నించగా ఆయన అందుబాటులోకి రాలేదు.

ద్వారకాతిరుమల మండలం గుళ్లపాడు వద్ద పోలవరం కుడి కాలువ గట్టుపై అక్రమంగా జరుగుతున్న ఎర్ర మట్టి తవ్వకాలు, ట్రాక్టర్‌లో తరలిపోతున్న గ్రావెల్‌

పోలవరం కుడి కాలువ గట్టుపై యథేచ్ఛగా ఎర్ర మట్టి తవ్వకాలు

ట్రాక్టర్లు, టిప్పర్ల ద్వారా వివిధ ప్రాంతాలకు తరలింపు

ఆ వైపు కన్నెత్తి చూడని అధికారులు

కాలువ గట్టుపై ఆగని ‘పచ్చ’ దందా 1
1/1

కాలువ గట్టుపై ఆగని ‘పచ్చ’ దందా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement