శాప్ ఆధ్వర్యంలో ఆటల పోటీలు
17న చెస్, 24 సైక్లింగ్ జట్లు ఎంపిక
ఏలూరు రూరల్: రాష్ట్ర క్రీడాప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా శాప్ లీగ్స్ పేరిట ఆటల పోటీలు నిర్వహించనున్నామని జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ అధికారి ఎస్‌ఏ అజీజ్ ఓ ప్రకటనలో తెలిపారు. మొత్తంగా 31 క్రీడాంశాల్లో జిల్లాస్థాయిలో పోటీలు చేపట్టి జిల్లా జట్లను ఎంపిక చేస్తుందన్నారు. ఈనెలలో లీగ్స్ ప్రారంభమై, 11 నెలల పాటు కొనసాగి డిసెంబర్‌లో ముగుస్తాయన్నారు. ఇందులో భాగంగా ఈ నెల 17వ తేదీన ఏలూరు ఇండోర్ స్టేడియం వెయిట్ లిఫ్టింగ్ హాల్లో జిల్లాస్థాయి చెస్ పోటీలు చేపట్టనున్నామని వివరించారు. అండర్ 13, 15, 17, 19 విభాగంలో పురుషులు, మహిళలకు పోటీలు చేపడతామని వెల్లడించారు. ఇదే క్రమంలో ఈ నెల 24వ తేదీన ఇండోర్ స్టేడియంలో జిల్లాస్థాయి సైక్లింగ్ పోటీలు చేపడతామన్నారు. ఇందులో ఎంపికై న వారు ఈ నెల 28వ తేదీ నుంచి మార్చి 1 వరకూ విజయవాడలో జరగబోయే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని పేర్కొన్నారు. వివరాలకు 90594 85538లో సంప్రదించాలని సూచించారు.


