గురువులపై ఆటోమేషన్‌ కత్తి | - | Sakshi
Sakshi News home page

గురువులపై ఆటోమేషన్‌ కత్తి

Feb 7 2026 10:01 AM | Updated on Feb 7 2026 10:01 AM

గురువులపై ఆటోమేషన్‌ కత్తి

గురువులపై ఆటోమేషన్‌ కత్తి

గురువులపై ఆటోమేషన్‌ కత్తి

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రభుత్వ ఉపాధ్యాయులను ముప్పుతిప్పలు పెడుతోంది. తాజాగా పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల్లో ఇన్విజిలేషన్‌ బాధ్యతలకు సంబంధించి కొత్తగా ఆటోమేషన్‌ విధానాన్ని తీసుకువచ్చింది. దీంతో ఇన్విజిలేషన్‌ విధులు భారం కానున్నాయని ఉపాధ్యాయ వర్గాల్లో తీవ్రంగా చర్చ నడుస్తోంది. ఈ విధానం వల్ల పరీక్షల నిర్వహణే ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం ఉందని ఉపాధ్యాయ సంఘాల నాయకులు చెబుతున్నారు. ఉపాధ్యాయులు, విద్యాశాఖ అధికారుల ప్రమేయం లేకుండా ఆటోమేషన్‌ ద్వారా ఇన్విజిలేషన్‌ విధులు కేటాయించడం అనే ప్రక్రియ పూర్తిగా అసంబద్ధమని ఉపాధ్యాయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

గతంలో వెసులుబాటు

సాధారణంగా జిల్లా విద్యాశాఖ అధికారి, మండల విద్యాశాఖ అధికారులు టెన్త్‌ పరీక్షలకు సంబంధించి ఇన్విజిలేషన్‌ విధులకు అర్హులైన ఉపాధ్యా యులను ఎంపిక చేసి కేటాయిస్తారు. ఇందులో దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు, గర్భిణులు, బాలింతలు, దివ్యాంగ ఉపాధ్యాయులకు మినహాయింపు ఇచ్చేవారు. అలాగే పిల్లల పరీక్షల నిమిత్తం లేదా తల్లిదండ్రులను ఆస్పత్రులకు తీసుకువెళ్లాల్సి వచ్చే వారికి కూడా అభ్యర్థన మేరకు వెసులుబాటు ఉండేది. అలాగే ఆస్పత్రుల్లో వైద్య సేవలు పొందుతున్న వారికి కూడా మినహాయింపు లభించేది. అయితే ఆటోమేషన్‌ ప్రక్రియ ద్వారా ఆయా వర్గాలకు మినహాయింపు లభించే పరిస్థితి లేదు.

సాఫ్ట్‌వేర్‌ పరిధిలోకి..

ఆటోమేషన్‌ ప్రక్రియ వల్ల ఇన్విజిలేషన్‌ విధులన్నీ సాఫ్ట్‌వేర్‌ పరిధిలోకి వెళతాయని ఉపాధ్యాయులు అంటున్నారు. టీచర్ల జాబితా సాఫ్ట్‌వేర్‌లో అప్‌లోడ్‌ చేస్తే సబ్జెక్టు, కేంద్రాలను బట్టి ఉపాధ్యాయులకు ఇన్విజిలేషన్‌ విధులను కేటాయిస్తుంది. దీని వల్ల ఉపాధ్యాయులు దూరంగా ఉన్న కేంద్రానికి వెళ్లి విధులు నిర్వహించాల్సి ఉంటుందని, ప్రత్యేక మినహాయింపులు, వెసులుబాటులు ఉండవని టీచర్లు ఆందోళన చెందుతున్నారు. ఇది ప్రభుత్వ కక్ష సాధింపు అని ఉపాధ్యాయ సంఘాలు గళమెత్తుతున్నాయి. ఉపాధ్యాయ సంఘాలతో ఏమాత్రం చర్చించకుండా కూటమి ప్రభుత్వం నియంతృత్వ ధోరణితో వ్యవహరిస్తోందని అంటున్నారు. ప్రభుత్వం తీసుకుంటున్న ఏకపక్ష నిర్ణయాలు రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం కలిగిస్తున్నాయన్నారు. గతంలో బలవంతపు శిక్షణల పేరుతో కొందరు ఉపాధ్యాయులను బలి తీసుకున్న ప్రభుత్వం ఇప్పుడు సాఫ్ట్‌వేర్‌ నిర్దేశిత ఇన్విజిలేషన్‌ విధుల రూపంలో మరికొందరిని బలి కోరుకుంటుందా అని ప్రశ్నిస్తున్నారు.

టెన్త్‌ పరీక్షలకు ఆటోమేషన్‌లో ఇన్విజిలేషన్‌ బాధ్యతలు

ఆరోగ్యం, కుటుంబ పరిస్థితులకు అతీతంగా విధులు

దూర ప్రాంతాలను కేటాయించే అవకాశం

ఉపాధ్యాయుల్లో ఆగ్రహ జ్వాలలు

విధులను బహిష్కరించే ఆలోచన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement