తెలంగాణలో మొదలై.. ‘తూర్పు’లో ముగిసి.. | - | Sakshi
Sakshi News home page

తెలంగాణలో మొదలై.. ‘తూర్పు’లో ముగిసి..

Feb 7 2026 10:01 AM | Updated on Feb 7 2026 10:01 AM

తెలంగాణలో మొదలై.. ‘తూర్పు’లో ముగిసి..

తెలంగాణలో మొదలై.. ‘తూర్పు’లో ముగిసి..

తెలంగాణలో మొదలై.. ‘తూర్పు’లో ముగిసి..

ముగిసిన పెద్దపులి ప్రయాణం

17 రోజులపాటు పంజా విసిరిన వైనం

పట్టిసీమ మీదుగా గోదావరి దాటి..

కూర్మాపురంలో బంధించిన అధికారులు

బుట్టాయగూడెం: తెలంగాణలోని కావిడిగుండ్లలో మొదలైన పెద్దపులి ప్రయాణం తూర్పుగోదావరి జిల్లా రాయవరం మండలం కూర్మాపురంలో ముగిసింది. దాదాపు 17 రోజులపాటు ఏలూరు, తూర్పుగోదావరి జిల్లాల ప్రజలను హడలెత్తించిన పులిని ఎట్టకేలకు రెస్క్యూ టీమ్‌ సురక్షితంగా బంధించింది. గతనెల 21న తెలంగాణలోని అశ్వారావుపేట మండలం కావిడిగుండ్లలో రెండు ఆవులపై దాడి చేసి చంపిన పులి 22న ఏలూరు జిల్లాలోకి ప్రవేశించింది. బుట్టాయగూడెం మండలం పందిరిమామిడిగూడెం, గుబ్బల మంగమ్మ గుడి మార్గం వైపు తిరుగుతూ హడలెత్తించింది. అదేరోజు అంతర్వేదిగూడెం సమీపంలో ఆవు, లేగ దూడలపై పంజా విసిరి హతమార్చింది. 23న నాగులగూడెం సమీపంలో మూడు ఆవులపై దాడి చేసి చంపేసింది. అటవీ అధికారులు ఏర్పాటుచేసిన ట్రాప్‌ కెమెరాల్లో చిక్కిన పెద్దపులిని చూసి అందరూ వణికిపోయారు. సుమారు 4 అడుగుల ఎత్తు, మీటన్నర పొడవు ఉండటంతో బెంబేలెత్తారు. అదే రోజు మధ్యాహ్నం అంతర్వేదిగూడెం సమీపంలో, రాత్రి కొండ ప్రాంతంలోని గాడిదబోరు సమీపంలో సంచరించింది. 24న బుట్టాయగూడెం మండలం గుర్రప్పగూడెంలో గేదైపె, కోట నాగవరంలో లేగ దూడలపై దాడి చేసింది. అక్కడి నుంచి కంసాలికుంట, అల్లికాల్వ మీదగా రాయిగూడెం వెళ్లి అక్కడ మరో గేదె దూడను హతమార్చింది.

13 పశువులను హతమార్చి..

రాయిగూడెం నుంచి కొయ్యలగూడెం మండలం బిల్లుమిల్లి చేరుకుని ఆవులను హతమార్చింది. రెండు రోజులపాటు అక్కడే మకాం వేసిన పెద్దపులి 26న మళ్లీ రావిగూడెం చేరుకుని గేదె దూడను చంపింది. అక్కడి నుంచి కండ్రికగూడెం, అమ్మపాలెం వెళ్లి రెండు గేదెలను చంపి తినేసింది. 27న బుట్టాయగూడెం మండలం లంకపల్లి రామ నర్సాపురం మీదుగా అటవీ ప్రాంతంలోకి ప్రవేశించింది. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అయితే 30న అటవీ ప్రాంతంలో మాటేసిన పెద్దపులి అక్కడికి వచ్చిన ఆవుపై దాడి చేసి చంపేసింది. 31న పోలవరం మండలం ఇటుకులకోటలో లేగ దూడలను హతమార్చి పట్టిసీమ ఎత్తిపోతల పథకం పరిసర ప్రాంతాల నుంచి గోదావరి ఈదుకుంటూ అటుగా వెళ్లింది. మొత్తంగా ఏలూరు జిల్లాలో 13 పశువులను పులి హతమార్చింది. పోలవరం జిల్లా చిన్నకొండేపూడి, పెద్ద కొండేపూడి పంట పొలాల్లో పెద్దపులి పాదముద్రలను అక్కడి అధికారులు గు ర్తించారు. అక్కడి నుంచి తూర్పుగోదావరి జిల్లాలో ప్రవేశించిన పెద్దపులి రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో సంచరిస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేసింది. ఫారెస్ట్‌ అధికారులు, పూనే నుంచి వచ్చిన రెస్క్యూ టీమ్‌ రాయవరం మండలం కూర్మాపురంలో గన్‌ ద్వారా మత్తు ఇంజక్షన్లు ఇచ్చి శుక్రవారం సాయంత్రం పెద్దపులిని బంధించారు. అక్కడి నుంచి పులిని రాజమండ్రి తరలిస్తున్నట్టు అధికారులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement