విద్యాసంస్థల్లో ఫీజుల దోపిడీ
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రెడ్‌బుక్‌ని విడిచి ప్రైవేట్ విద్యాసంస్థల వైపు చూడాలని, ఫీజుల దందాను అరికట్టాలని ఎస్‌ఎఫ్ ఐ జిల్లా కార్యదర్శి కె.లెనిన్ డిమాండ్ చేశారు. శుక్రవారం స్థానిక పాత బస్టాండ్ సెంటర్‌లో విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. మోహన్‌బాబు విద్యాసంస్థల్లో జరుగుతున్న దోపిడీని ప్రశ్ని స్తే కిడ్నాప్ చేయటం, చిత్రహింసలు పెట్టడం సరికాదన్నారు. మోహన్‌బాబు, ఆయన తనయుడు విష్ణు విద్యావ్యవస్థలో రాక్షస పాలన నడుస్తోందన్నారు. ఏఐఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు డి.శివ మాట్లాడుతూ మోహన్‌బాబు యూనివర్సిటీలో బౌన్సర్లు ఎందుకున్నారని, యూజీసీ విచారణకు వెళ్లినప్పుడు ఏం చేసిందంటూ ప్రశ్నించారు. పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్షుడు కాకి నాని, ఎస్‌ఎఫ్‌ఐ నగర అధ్యక్షుడు సీహెచ్ శివాజీ, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి డీఎన్‌వీడీ ప్రసాద్, బీకేఎంయూ జిల్లా కార్యదర్శి బండి వెంకటేశ్వరరావు, సీపీఎం నగర కార్యదర్శి పి.రవికుమార్, సీపీఐ జిల్లా కార్యదర్శి ఎం.కృష్ణ చైతన్య తదితరులు పాల్గొన్నారు.


