ఆది దేవా.. ప్రణమామ్యహం
ఉష, పద్మిని, ఛాయ, సౌంజ్ఞ సమేతుడైన శ్రీ సూర్యభగవానుడికి శ్రీ వైఖానస ఆగమశాస్త్ర ప్రకారం ఆదివారం ఉదయం 11.30 గంటలకు కల్యాణ మహోత్సవం నిర్వహించేందుకు పండితులు ముహుర్తం నిర్ణయించారు. వేద పండితుల వేదమంత్రోచ్ఛరణాల మధ్య ఆలయ చైర్మన్ గమిని రామచంద్రరావు (రాము) దంపతులు పీటలపై కూర్చుని స్వామివారి కల్యాణ ఘట్టం నిర్వహిస్తారు. ఉదయం 5 గంటల నుంచి భక్తులకు స్వామివారి దివ్య దర్శనం, మధ్యాహ్నం 2 గంటలకు స్వామివారి రథోత్సవం, సాయంత్రం 6 గంటలకు పుష్పయాగం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఉదయం నుంచి స్వామి వారికి పంచామృతాభిషేకాలు, ప్రత్యేక అలంకరణ, పూజాధికాలు నిర్వహిస్తారు. ఉదయం 11 గంటల నుంచి స్వామివారి ఆలయ ప్రాంతంలో అన్నప్రసాద వితరణకు ఏర్పాట్లు చేశారు.
రథసప్తమి సందర్భంగా తణుకు సూర్యదేవాలయాన్ని సందర్శించేందుకు సమారుగా 50వేలకు పైగా భక్తులు వస్తారని అంచనా. భక్తుల సౌకర్యార్థం సూర్యాలయం వీధి పొడవునా చలువ పందిర్లు, భక్తులు క్యూలో వెళ్లి స్వామివారిని దర్శించుకునేలా బారికేడ్లు సిద్ధం చేశాం. క్యూలో ఉన్న వారికి తాగునీరు సరఫరా చేస్తాం. స్వామివారి దివ్య దర్శనం, కల్యాణాన్ని వీక్షించేందుకు వచ్చే భక్తులందరికీ తీర్థ ప్రసాదాలు అందజేస్తాం.
– ముత్యాల సత్యనారాయణ, ఈవో, తణుకు సూర్యదేవాలయం
తణుకు అర్బన్: భక్త ప్రజానీకం ఆరోగ్య ప్రదాతగా కొలిచే శ్రీ సూర్యనారాయణస్వామి కల్యాణమహోత్సవానికి తణుకు శ్రీసూర్యదేవాలయం ముస్తాబైంది. ఆదివారం రథసప్తమి సందర్భంగా సూర్యదేవాలయంలో ఉష, పద్మిని, ఛాయ, సౌంజ్ఞ సమేతుడైన శ్రీ సూర్యభగవానుడికి కల్యాణం నిర్వహించేందుకు దేవాదాయ ధర్మాదాయ శాఖ, ఆలయ కమిటీ పెద్దల ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. రాష్ట్ర వ్యాప్తంగా శ్రీకాకుళం జిల్లా అరసవల్లి సూర్యదేవాలయం తరువాత రెండో ఆలయం తణుకులో ఉండడంతోపాటు అదే తరహాలో స్వామివారి కల్యాణం జరిపించే తణుకు సూర్యదేవాలయానికి జిల్లా నుంచే కాకుండా ఇతర జిల్లాల నుంచి కూడా వేలసంఖ్యలో భక్తులు ప్రతి ఏడాది తరలి వస్తుంటారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ఆలయ ప్రాంతంలో అన్ని ఏర్పాట్లు చేశారు. ఏ ఇబ్బందులు లేకుండా భక్తులంతా స్వామి వారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించే విధంగా సూర్యాలయం వీధి రోడ్డు పొడవునా చలువ పందిర్లు వేసి బారికేడ్లు ఏర్పాటుచేశారు.
ప్రసిద్ధి చెందిన ఆలయం
శ్రీకాకుళం జిల్లా అరసవల్లి తరువాత రాష్ట్రంలో రెండో సూర్యదేవాలయంగా తణుకు సూర్యదేవాలయం పేరుగాంచింది. ముఖ్యంగా ప్రతి ఏడాది రథసప్తమి సందర్భంగా స్వామివారి కల్యాణ మహోత్సవాన్ని తిలకించేందుకు జిల్లా నలుమూలల నుంచి 50 వేలకు పైగా భక్తులు వస్తుంటారు. ఈ ఏడాది స్వామివారికి ప్రీతికరమైన రోజు ఆదివారం రథసప్తమి రావడంతో భక్తుల తాకిడి మరింతగా పెరిగే అవకాశం ఉండడంతో దేవాదాయ ధర్మాదాయ శాఖ, ఆలయ కమిటీ పెద్దల పర్యవేక్షణలో స్వామి వారి కల్యాణం, దివ్య దర్శనం కార్యక్రమాలకు అంతా సిద్ధం చేశారు.
అరుదైన విగ్రహం
తణుకు సూర్యదేవాలయంలోని స్వామి విగ్రహం సప్త అశ్వాలతో అనూరుడను సారధితో ద్వారపాలకుల పహరాతో ఉష, పద్మిని, ఛాయ, సౌంజ్ఞ సమేతుడైన సూర్యభగవానుడి విగ్రహం అరుదైనదిగా చరిత్రలో నిలిచింది. 1942వ సంవత్సరంలో తణుకుకు చెందిన జోశ్యుల శ్రీరామమూర్తి స్థాపించిన తణుకు ఆలయంలోని ఈ సూర్య విగ్రహం స్కాంద, పద్మ పురాణాల్లో ప్రసుత్తించబడిన విధంగా చూపరులకు నేత్రానందం కలిగిస్తోంది. 2001వ సంత్సరంలో తణుకుకు చెందిన చిట్టూరి పరిపూర్ణ బ్రహ్మానంద చౌదరి, భక్తుల సహకారంతో ఆలయాన్ని పునఃప్రతిష్ట చేశారు.
ఆలయంలో దేవతామూర్తుల విగ్రహాలు
నేడు రథసప్తమి
ముస్తాబైన తణుకు సూర్యదేవాలయం
స్వామి దర్శనార్థం తరలిరానున్న భక్తులు
ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తి
ఆది దేవా.. ప్రణమామ్యహం
ఆది దేవా.. ప్రణమామ్యహం
ఆది దేవా.. ప్రణమామ్యహం
ఆది దేవా.. ప్రణమామ్యహం


