తల్లిని కోల్పోయాం.. ప్రభుత్వమే ఆదుకోవాలి
జంగారెడ్డిగూడెం: ఇటీవల జరిగిన దాడిలో తమ తల్లిని కోల్పోయామని, తమను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతూ జంగారెడ్డిగూడెం వచ్చిన ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ యాదవ్‌ను ఇటీవల హత్యకు గురైన కలపాల జీలుగులమ్మ కుమార్తెలు కోరారు. ఈ మేరకు ఎంపీకి వినతిపత్రం అందజేశారు. వారసత్వంగా తమకు రావాలసిన పొలం తమకు ఇవ్వకపోగా, గొడ్డలితో విచక్షణా రహితంగా దాడి చేసి తమ తల్లి జీలుగులమ్మ, అమ్మమ్మ ముప్పిడి చుక్కమ్మలను హత్య చేసి తమకు ఆధారం లేకుండా చేశారని కన్నీటి పర్యంతమయ్యారు. తమ తల్లి ఎంతో కష్టపడి తమను ఉన్నత చదువులు చదివించిందని తెలిపారు. తమకు ప్రభుత్వమే ఉపాధి కల్పించి ఆదుకోవాలని కోరారు. స్పందించిన ఎంపీ కలెక్టర్‌తో మాట్లాడి న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో కొండ్రెడ్డి కిషోర్, ఎస్సై ఎన్‌వీ ప్రసాద్ తదితరులు ఉన్నారు.
చాట్రాయి: కప్పుకున్న దుప్పటికి నిప్పంటుకుని వృద్ధురాలు మృతి చెందిన ఘటన చాట్రాయి మండలంలోని చనుబండలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం చనుబండ గ్రామానికి చెందిన గజవెల్లి నారాయణమ్మ (90) తాటాకింట్లో ఒంటరిగా నివసిస్తోంది. ఆమెకు చుట్ట తాగే అలవాట ఉండడంతో శుక్రవారం రాత్రి చుట్ట వెలిగించుకున్న అగ్గిపుల్ల మంచం మీద పడి పక్క దుప్పటికి అంటుకుని ఆ మంటల్లో నారాయణమ్మ శరీరం పూర్తిగా కాలిపోయింది. కోడలు గజవెల్లి చెన్నమ్మ శనివారం ఉదయం నారాయణమ్మకు టీ టిఫిన్ ఇవ్వడానికి వెళ్లగా మంచం మీద కాలిపోయి ఉండడాన్ని గుర్తించింది. మృతురాలికి ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.


